సాక్షి ప్రతినిధి, ఖమ్మం : రేషన్ బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇప్పటివరకు తమ పరిధిలోని రేషన్ దుకాణంలో బియ్యం తీసుకున్న లబ్ధిదారులు.. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రతి రేషన్ దుకాణానికి కోటాకన్నా.. 20 శాతం ఎక్కువ బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. పోర్టబులిటీ విధానం ప్రవేశపెట్టి.. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా సరుకులు లబ్ధిదారులకు అందేలా కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
జిల్లాలో మొత్తం 669 రేషన్ దుకాణాలు ఉండగా.. ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. వీటిని డీలర్లు.. లబ్ధిదారులకు నిర్ణీత తేదీలు, సమయాల్లో పంపిణీ చేస్తుంటారు. అయితే రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. బతుకు దెరువు కోసం మరోచోట నివాసం ఉంటున్నా.. డీలర్లు సరుకులు ఇచ్చే సమయానికి ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి సొంత ఊరికి రావాల్సి వచ్చేది. అటువంటి వారికి వెసులుబాటు కల్పించేందుకు.. సరుకులు పక్కదారి పట్టకుండా.. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఎక్కడి నుంచైనా..
ప్రస్తుతం అమలు చేయనున్న పోర్టబులిటీ విధానంతో లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం సులువుగా తీసుకోవచ్చు. రేషన్ దుకాణానికి వెళ్లి.. కార్డు నంబర్ చెప్పి.. అక్కడ వేలిముద్ర వేసి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రేషన్ సరఫరా చేసే సమయంలో సొంత గ్రామంలోనే ఉండి రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఇక నుంచి ఉండదు. ఏ పని కోసమైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లినా.. రేషన్ తీసుకోవడం కుదరకపోవడంతో ఆ నెల సరుకులు నష్టపోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి నుంచే జిల్లావ్యాప్తంగా పోర్టబులిటీ విధానం అమలవుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కార్డు నంబర్ చెప్పి రేషన్ సరుకులు తీసుకునే వీలుంటుంది.
20 శాతం అదనంగా కేటాయింపు..
రేషన్ బియ్యం ఎక్కడి నుంచైనా తీసుకునే వీలుండటంతో అందుకు అనుగుణంగా బియ్యం కేటాయింపులు కూడా చేశారు. ప్రతి రేషన్ దుకాణానికి అదనంగా 20 శాతం బియ్యం కేటాయించారు. ఏ రేషన్ షాపు నుంచైనా తమ లబ్ధిదారుడు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులు బియ్యం తీసుకెళ్తే ఇచ్చేందుకు వీలుగా ఎక్కువ మొత్తం కేటాయించారు. రేషన్ దుకాణంలో బియ్యం మిగిలితే తర్వాతి నెలకు కేటాయిస్తారు. ఇప్పటి వరకు జిల్లాకు ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. ఇకనుంచి 8,699.64 మెట్రిక్ టన్నులు సరఫరా కానున్నది.
అదనంగా బియ్యం వచ్చాయి..
రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపులకు పకడ్బందీగా బియ్యం పంపిణీ చేసేందుకు మరింత చర్యలు చేపట్టింది. పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 20 శాతం బియ్యాన్ని అదనంగా కేటాయించింది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు కానుంది.
– సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment