సేవలు నచ్చలేదా...బ్యాంక్ మార్చెయ్!
♦ బ్యాంకు ఖాతాకూ పోర్టబిలిటీ!
♦ అకౌంట్ నంబర్ మాత్రం అదే...
♦ ఈ దిశగా బ్యాంకులు అడుగులు వేయాలన్న ఆర్‌బీఐ
ముంబై: మొబైల్ నంబర్ మారకుండా టెలికం కంపెనీని మార్చేసినట్టుగానే... సేవలు బాగోలేని బ్యాంకుకు గుడ్‌బై చెప్పేసి అదే ఖాతా నంబర్‌తో మరో బ్యాంకు శాఖకు మారిపోయే రోజు భవిష్యత్తులో సాకారం కానుంది. అప్పటి వరకూ మీకున్న రుణ చరిత్రను కోల్పోవాల్సిన పని కూడా లేదు. ఈ దిశగా బ్యాంకులు అడుగులు వేయాలని ఆర్‌బీఐ సూచించింది. ముంబైలో మంగళవారం బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) నిర్వహించిన సమావేశంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు, వాటిపై చార్జీలు, బ్యాంకు ఖాతా పోర్టబులిటీ సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
ఖాతా పోర్టబిలిటీ సాధ్యమే...
‘‘గత రెండు సంవత్సరాల్లో ఆధార్ నమోదు కార్యక్రమం చోటు చేసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. పలు యాప్‌లను కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నింటి దృష్ట్యా ఖాతా నంబర్ పోర్టబిలిటీకి చాలా అవకాశం ఉంది’’ అని ముంద్రా పేర్కొన్నారు. ఆర్‌బీఐ నియంత్రనపరమైన సూచన కాకుండా, బ్యాంకింగ్ రంగంలోని భాగస్వాములు అందరి ఉమ్మడి కృషితో ఈ సౌకర్యం అమల్లోకి వస్తే మంచిదన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీన్ని పరిశీలనలోకి తీసుకుని, అమలు దిశగా పనిని ప్రారంభించాలని ముంద్రా సూచించారు. తప్పనిసరైన ఈ పరిస్థితికి బ్యాంకులు సిద్ధం కావాలని, దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఖాతా నంబర్ పోర్టబిలిటీ ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ఆలోచన చేయాలన్నారు.
పోర్టబులిటీ ఆచరణలోకి వస్తే కస్టమర్ కనీసం మారు మాట్లాడకుండానే సులభంగా బయటకు వెళ్లిపోవడం అనుభవంలోకి వస్తుందన్నారు. బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, మొబైల్ నంబర్ ఐడెంటిఫయర్ (ఎంఎంఐడీ) ఈ తరహా ఎన్నో నంబర్లు ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నాయి. అయితే, ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆధార్ చెల్లింపుల విధానంలో బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్‌ను అనుసంధానిస్తే, లావాదేవీలన్నీ ఆధార్ నంబర్ ఆధారంగానే జరుగుతాయి. ముంద్రా గతంలోనూ ఖాతా నంబర్ పోర్టబిలిటీని ప్రతిపాదించారు. ఇది ఆచరణలోకి వస్తే ఈ సదుపాయం కలిగిన తొలి దేశం మనదే అవుతుంది. ఒకే బ్యాంకు పరిధిలో ఒక శాఖ నుంచి మరో శాఖకు అదే ఖాతా నంబర్‌తో మారే సదుపాయం కల్పించాలని ఆర్‌బీఐ 2012 ఏప్రిల్‌లోనే బ్యాంకులను కోరింది.
సామాన్యులకు సేవలను నిరాకరించరాదు
ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఎంతుండాలి, ప్రీమియం సేవలపై చార్జీలను నిర్ణయించుకునే స్వేచ్ఛను బ్యాంకులకు ఇవ్వడం జరిగిందని... కానీ, సామాన్యులకు సేవలను నిరాకరించడం, దూరం చేయడం కోసం వీటిని వినియోగించుకోరాదని ముంద్రా అన్నారు. కొన్ని బ్యాంకుల్లో ఈ చర్యలను తాము గమనించినట్టు చెప్పారు. ‘‘కొన్ని సేవలకు చార్జీలను వసూలు చేయడం వల్ల నష్టం లేదు. కానీ, కొందరు కస్టమర్లను దూరంగా ఉంచేందుకు ఈ తరహా నిబంధనలు రూపొందించలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. అందరికీ బ్యాంకు సేవలను అందుబాటులో ఉంచడంపైనే తమ దృష్టిగానీ, ఈ తరహా సేవలకు బ్యాంకులు ఎంత చార్జీలు వసూలు చేస్తున్నాయన్నదానిపై కాదని ఆయన పేర్కొన్నారు.
ఆన్‌లైన్ మోసాల నుంచి కస్టమర్లకు రక్షణ
ఎలక్ట్రానిక్ విధానంలో జరిగే మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులకు రక్షణ కల్పించే దిశగా ఆర్‌బీఐ త్వరలో తుది మార్గదర్శకాలు తీసుకురానుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా చెప్పారు. ఖాతాదారుడి ప్రమేయం లేకుండా అనధికారికంగా జరిగే లావాదేవీల్లో... ఖాతాదారుడి బాధ్యతను పరిమితం చేయనున్నట్టు చెప్పారు. వాస్తవానికి ముసాయిదా మార్గదర్శకాలను ఆర్‌బీఐ గతేడాది ఆగస్ట్‌లోనే విడుదల చేసి, అభిప్రాయాలను స్వీకరించింది. భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా తుది మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని ముంద్రా తెలిపారు. మోసపూరిత లావాదేవీల గురించి రిపోర్ట్ చేసేందుకు కాల పరిమితి, ఖాతాదారులు, బ్యాంకుల బాధ్యతను మార్గదర్శకాల్లో పొందుపరుస్తామని చెప్పారు. బ్యాంకులు సైతం తమ ఐటీ భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని సూచించారు.