బ్యాంకు అకౌంట్లపై నియంత్రణ ఒకరికి.. ఒక్కటే! | RBI is planning to bring account portability | Sakshi
Sakshi News home page

బ్యాంకు అకౌంట్లపై నియంత్రణ ఒకరికి.. ఒక్కటే!

Published Sun, Nov 19 2017 1:16 AM | Last Updated on Sun, Nov 19 2017 3:06 AM

RBI is planning to bring account portability - Sakshi - Sakshi - Sakshi

సురేశ్‌కి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మూడు ఖాతాలున్నాయి. ఒకటి హైదరాబాద్‌లో ఆపరేషన్లకు ఉపయోగిస్తుండగా... ఇంకొకటి ఊళ్లో వ్యవసాయ ఆదాయం కోసం వాడుతున్నాడు. మూడో ఖాతాను డీమ్యాట్‌ కార్యకలాపాల కోసం విడిగా వినియోగిస్తున్నాడు. ఇప్పటికైతే సురేశ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ త్వరలో ఈ మూడింటికి బదులు ఒకే ఖాతా ఉండబోతోంది. అది ఏ ఖాతా అన్నది సురేశ్‌ ఇష్టం. మొత్తంగా చూస్తే ఈ మూడు ఖాతాలూ కలిసిపోతాయన్న మాట!!.

శ్రీధర్‌కు మూడు వేర్వేరు బ్యాంకుల్లో మూడు ఖాతాలున్నాయి. నెట్‌వర్క్‌ పెద్దది కదా అని ఎస్‌బీఐ... ఇంటికి దగ్గర కదా అని మరో ప్రభుత్వ బ్యాంక్‌... ఆన్‌లైన్‌ సేవలు బాగున్నాయని ఓ ప్రైవేటు రంగ బ్యాంక్‌... ఈ మూడు ఖాతాలూ వాడుతున్నాడు. మున్ముందు శ్రీధర్‌కు ఈ మూడు ఖాతాల స్థానంలో ఒకటే ఉండబోతోంది. అది ఏ బ్యాంక్‌లో ఉంచుకోవాలన్నది శ్రీధర్‌ ఇష్టం. అదీ పరిస్థితి. బ్యాంకింగ్‌ సంస్కరణల్లో భాగంగా సర్కారు చేపడుతున్న ఈ చర్యలతో... చిన్నస్థాయి ప్రైవేటు బ్యాంక్‌లతో పాటు కొన్ని ప్రభుత్వ బ్యాంక్‌లకూ ఇబ్బందులు తప్పేలా లేవు.

ఒక మనిషికి ఒకటే బ్యాంకు ఖాతా!!
ఇదీ ప్రభుత్వం అమలు చేయబోతున్న తాజా సంస్కరణ. ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి బ్యాంక్‌లకు ఈ మేరకు సూత్రప్రాయంగా సమాచారం అందింది. తొలి దశలో ఒక బ్యాంక్‌లో వేర్వేరు శాఖల్లో రెండేసి ఖాతాలుంటే అందులో ఒకదాన్నే కొనసాగించి... మరొకటి బ్యాంక్‌లే రద్దు చేస్తాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ ప్రక్రియ మొదలయింది. ఆధార్‌ అనుసంధానం పూర్తయ్యాక ఇది వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఒకరికి ఒకటికన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుండటం అనేది సహజం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లనే తీసుకుంటే ఇక్కడ దాదాపు 2,150 ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు, 5 గ్రామీణ బ్యాంకులున్నాయి. వీటికి ఏపీలో 6,552, తెలంగాణలో 4,875 బ్రాంచీలుండగా... వీటన్నింటిలో కలిపి దాదాపు 8 కోట్ల ఖాతాలున్నాయి. వీటిల్లో కనీసం 15 శాతం... అంటే 1.20 కోట్ల ఖాతాలు డూప్లికేషనేనని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌. వెంకటేశ్వర్‌ రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లోనే బహుళ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. గత 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ నుంచి బహుళ ఖాతాలున్నాయన్న కారణంగా లక్ష అకౌంట్లను తొలగించామని కూడా ఆయన వెల్లడించారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి 3 వేల బ్రాంచీలు, దాదాపు 2.4 కోట్ల ఖాతాలున్నాయి. ఒకరికి వేర్వేరు బ్రాంచీల్లో బహుళ ఖాతాలుంటే వాటిని రద్దు చేసుకుని ఒకటే ఉంచాలని సలహా ఇస్తున్నాం’’అని ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ ఒకరు చెప్పారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంట్రా బ్యాంక్‌ అకౌంట్‌ పోర్టబులిటీకి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) వివరాలు సమగ్రంగా, డిజిటల్‌గా ఉన్నట్లయితే కస్టమర్లు అదే బ్యాంక్‌కు చెందిన ఇతర బ్రాంచీకి మార్చుకునే వీలుంది. ఎలాంటి చార్జీల్లేకుండా ఎన్నిసార్లయినా మార్చుకునే వీలుంది’’అని ఆయన తెలియజేశారు. ఖాతా తెరిచిన 6 నెలల్లోపు రద్దు చేసుకుంటే రూ.250–300 వరకు చార్జీ ఉంటుంది. ఆ సమయం దాటితే ఎలాంటి జరిమానాలుండవు.

అకౌంట్‌ పోర్టబిలిటీ..
మొబైల్‌ పోర్టబిలిటీ లానే బ్యాంక్‌ అకౌంట్‌ పోర్టబిలిటీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ యోచిస్తోంది. కస్టమర్లకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించడంతో పాటు చట్ట విరుద్ధమైన లావాదేవీలకు అవకాశం లేకుండా పోర్టబిలిటీ సేవలను తేవాలని లకిష్యంచింది. ముందుగా పొదుపు ఖాతాలకు పోర్టబిలిటీని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇటీవల బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మెన్‌ వార్షిక సదస్సులో... ప్రధాన బ్యాంకులు దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్‌బీఐ కోరింది కూడా. అయితే అధార్‌ అనుసంధానం పూర్తయిన తర్వాతే పోర్టబులిటీపై నివేదికను సమర్పిస్తామని తెలంగాణకు చెందిన నోడల్‌ బ్యాంక్‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం ఎస్‌బీఐ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం పూర్తయిందని, మరో నెల రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సాఫ్ట్‌వేర్, డాటాబేస్‌తో సవాళ్లు..
అకౌంట్‌ పోర్టబిలిటీ అనేది బ్యాంకులకు సవాలే. ఎందుకంటే ఖాతా ప్రారంభంలో చేసే ఫైల్‌ స్ట్రక్చర్, బ్యాంకులు వినియోగించే సాఫ్ట్‌వేర్‌లను మార్చాల్సి ఉంటుంది. అన్ని బ్యాంకులూ ఒకే డేటాబేస్‌ను వినియోగించాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. ప్రస్తుతం దేశంలోని అన్ని బ్యాంక్‌లూ కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్స్, ఫినాకిల్, ఫ్లెక్స్‌క్యూబ్‌ సాఫ్ట్‌వేర్లను వినియోగిస్తున్నాయి. 60 శాతానికి పైగా బ్యాంక్‌లు కోర్‌ బ్యాంకింగ్‌ సాంకేతికతనే వినియోగిస్తున్నాయని వీటిని టీసీఎస్, ఇన్ఫోసిస్‌ అభివృద్ధి చేశాయని ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. అలాగే బ్యాంక్‌లకు సంబంధించిన ఇండియన్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్‌ కోడ్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ), మొబైల్‌ మనీ ఐడెంటిఫియర్‌ (ఎంఎంఐడీ)లల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే వాటి అభివృద్ధి పనులను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి (ఎన్‌పీసీఐ) అప్పగించారని కూడా తెలిసింది. ఇప్పటికే ఎన్‌పీసీఐ భీమ్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి సాంకేతికతను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

అకౌంట్‌ నంబర్లు కూడా సమస్యే..
కస్టమర్ల సంఖ్య ఆధారంగా బ్యాంక్‌ స్థాయిని బట్టి ఖాతా నంబరు 10 నుంచి 20 అంకెలుంటుంది. ఎందరు కస్టమర్లుంటే అన్ని డిజిట్స్‌ పెరుగుతాయన్న మాట. ఉదాహరణకు సిటీ బ్యాంక్‌ ఖాతాకు 10 అంకెలు, ఎస్‌బీఐకు 11, ఐసీఐసీఐకి 12, హెచ్‌డీఎఫ్‌సీకి 14, అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఖాతాకు 16 అంకెలున్నాయి. పోర్టబిలిటీలో అన్ని బ్యాంక్‌ ఖాతాల నంబర్ల సంఖ్య సమానంగా ఉండాలి. ఇది బ్యాంక్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి సంస్థలకు కొంత సవాలే అయినప్పటికీ గతంలో సక్సెసయ్యారు కనుక సులువయ్యే అవకాశముందనేది నిపుణుల మాట. గతంలో భారతీయ మహిళా బ్యాంక్‌ (బీఎంబీ) ఎస్‌బీఐలో విలీనమైనప్పుడు రెండు బ్యాంకుల నంబర్ల సంఖ్యను మ్యాపింగ్‌ చేశారు. బీఎంబీకి 12 అంకెలు, ఎస్‌బీఐకి 11 అంకెలుండేవి. విలీనం తర్వాత రెండు బ్యాంకుల ఖాతాలకూ 11 అంకెలనే కేటాయించారు.

బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతుంది..
ప్రపంచ దేశాల్లో ఎక్కడా బ్యాంక్‌ అకౌంట్‌ పోర్టబిలిటీ లేదు. ఇక్కడ అందుబాటులోకి తెస్తే ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో భారత్‌ తొలి దేశమవుతుంది. పోర్టబిలిటీతో బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతుంది. పాత కస్టమర్లను కాపాడుకుంటూనే కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా మెరుగైన, వేగవంతమైన సేవలందిస్తాయి. తక్కువ చార్జీలుండే బ్యాంకులకు మళ్లే ప్రమాదం ఉంటుంది కనుక బ్యాంకులు కూడా చార్జీలను, వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఇక ఒకటే బ్యాంక్‌లో ఒకటే ఖాతాను తీసుకొస్తే చాలా బ్యాంకుల్లో నగదు ప్రవాహం తగ్గిపోతుంది. డిపాజిట్లు, లావాదేవీలు తగ్గి చిన్న బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు కనుమరుగయ్యే ప్రమాదముంది.

ఇదీ... దేశీ బ్యాంకింగ్‌ స్వరూపం
మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ బ్యాంకులు    12,100
ఈ మూడు రకాలకూ ఉన్న మొత్తం బ్రాంచీలు    1,35,946
మొత్తం పొదుపు ఖాతాల సంఖ్య    38.8కోట్లు 
మొత్తం కరెంట్‌ ఖాతాలు    2.83కోట్లు
మొత్తం జన్‌ధన్‌ ఖాతాలు    30.6కోట్లు
బహుళ అకౌంట్లు (అంచనా)    1617కోట్లు

శ్రీనాథ్‌ ఆడెపు (హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement