హెల్త్‌ పాలసీనీ మార్చుకోవచ్చు! | Health policy can change | Sakshi
Sakshi News home page

హెల్త్‌ పాలసీనీ మార్చుకోవచ్చు!

Published Mon, Sep 18 2017 12:58 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

హెల్త్‌ పాలసీనీ మార్చుకోవచ్చు!

హెల్త్‌ పాలసీనీ మార్చుకోవచ్చు!

► మొబైల్‌ నంబర్‌ మాదిరే ఇక్కడా పోర్టబిలిటీ
► సేవలు నచ్చకుంటే వేరే సంస్థకు మారే అవకాశం
► అదే సంస్థలో వేరే ప్లాన్‌కూ మారిపోవచ్చు
►వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌లకు వెసులుబాటు


మొబైల్‌ కంపెనీ అందించే సేవలు నచ్చకపోతే నంబరుతో సహా వేరే కంపెనీకి మారిపోయే వెసులుబాటు ఇప్పుడొచ్చింది. ఈ మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ... ఇపుడు ఆరోగ్య బీమా పాలసీలకూ అందుబాటులోకొచ్చింది. అంటే... ఒక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సర్వీసులు నచ్చకపోతే మరోదానికీ మారొచ్చు. లేదా మనకు అనువైనదిగా ఉంటే అదే కంపెనీ ఆఫర్‌ చేసే మరో పాలసీకి కూడా మారిపోవచ్చు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పోర్టబిలిటీ ప్రయోజనాలు, పోర్టబిలిటీ ప్రక్రియ మొదలైన అంశాల గురించి వివరించేదే ఈ కథనం.
– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీల్లో ప్రీ–ఎగ్జిస్టింగ్‌ కండీషన్స్‌కి సంబంధించి కొంత వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే మనం పాలసీ తీసుకునే నాటికే దాని పరిధిలోకి రాని ఆరోగ్య సమస్యేదైనా ఉంటే.. కొంత కాలం తర్వాత బీమా కంపెనీ సదరు ఆరోగ్య సమస్యకి కూడా కవరేజీ ఇచ్చే వెసులుబాటు ఒకటుంది. నిర్దిష్ట కాలం దాకా నిరీక్షించే పాలసీదారుకు మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. గతంలో ఒకవేళ గడువులోగా వేరే కంపెనీ పాలసీ తీసుకుని ఉంటే.. అప్పటి దాకా నిరీక్షణ రూపంలో వచ్చిన ప్రయోజనాలు దక్కకపోగా.. మళ్లీ కొత్త కంపెనీలో ఆయా ఆరోగ్య సమస్యలకు కవరేజీ కోసం మళ్లీ నిరీక్షించాల్సి వచ్చేది.

లేదా అదే కంపెనీలో మనకు అనువైన మరో పాలసీకి మారినా .. అప్పటిదాకా జమయిన క్రెడిట్స్‌ పాయింట్స్‌ను వదులుకోవాల్సి వచ్చేది. అయితే, తాజాగా పోర్టబిలిటీ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్య తీరిపోయింది. కంపెనీని మార్చినా లేదా అదే సంస్థలో వేరే ప్లాన్‌కి మారినా అప్పటిదాకా జమయిన క్రెడిట్స్‌ కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ఆరోగ్య సమస్యల కవరేజీ కోసం మళ్లీ మొదటి నుంచి నిరీక్షించాల్సిన పని లేకుండా.. సత్వరమే ప్రయోజనం పొందే వెసులుబాటు దొరుకుతుంది. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్‌తో పాటు గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలన్నింటికీ ఈ పోర్టబిలిటీ ఆప్షన్‌ వర్తిస్తుంది. అయితే, గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పోర్టబిలిటీకి వస్తే.. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే అవకాశం లేకపోయినప్పటికీ.. అదే సంస్థలో వేరే ప్లాన్‌కి మారేందుకు వీలుంది.

ఈ కింది సందర్భాల్లో పోర్టబిలిటీని ఎంచుకోవచ్చు..
♦ ప్రస్తుత ఆరోగ్య బీమా సంస్థ అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా లేకపోతే.
♦ నిర్దిష్ట ఆరోగ్య సమస్యలకు ప్రస్తుతమున్న కవరేజీ సరిపోదని భావించిన పక్షంలో; అలాగే ప్రస్తుత కంపెనీ అంతకు మించిన కవరేజీ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోయినా..
♦ మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ చాలా మందకొడిగా ఉన్నా లేక క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ చరిత్ర బాగా లేకపోయినా..
♦ ప్రస్తుత ఆరోగ్య బీమా సంస్థ అందిస్తున్న పాలసీలకన్నా మార్కెట్లో మరింత తక్కువ ప్రీమియంకే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు లభించే పాలసీ దొరుకుతున్నా..

పోర్టబిలిటీకి గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పథకాలకు పోర్టబిలిటీ అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల విషయానికొస్తే.. బీమా కంపెనీని మార్చుకునే అవకాశం లేకపోయినప్పటికీ.. అదే సంస్థలో గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ నుంచి ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకానికి మారే వెసులుబాటు ఉంది. అదే వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను మాత్రం అదే కంపెనీలో వేరే పాలసీలకైనా మార్చుకోవచ్చు లేదా ఇతర ఇన్సూరెన్స్‌ కంపెనీకైనా మారొచ్చు.

ఇందుకోసం 45 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుత పాలసీ ప్రీమియం రెన్యువల్‌ తేదీ కన్నా 45 రోజుల కన్నా ముందుగా (అరవై రోజులు దాటకుండా) మాత్రమే పోర్టింగ్‌ దరఖాస్తును సదరు ఇన్సూరెన్స్‌ సంస్థకు అందించాలి. పోర్టింగ్‌కి సంబంధించిన గడువు నిబంధనలకు విరుద్ధంగా మీ దరఖాస్తు ఉందని భావించిన పక్షంలో బీమా కంపెనీ దాన్ని తిరస్కరించవచ్చు. కాబట్టి, ఎప్పుడు పడితే అప్పుడు పాలసీని పోర్టింగ్‌ చేసుకునేందుకు వీలుండదు.

ఇండివిడ్యువల్‌ నుంచి ఫ్యామిలీ ఫ్లోటర్‌కి లేదా ఫ్యామిలీ ఫ్లోటర్‌ నుంచి ఇండివిడ్యువల్‌కి కూడా పాలసీని పోర్టింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటోంది. ఇది చాలా మందికి ఊరట కలిగించే విషయం. ఉదాహరణకు పెళ్లి కాక ముందు ఇండివిడ్యువల్‌ పాలసీ ఉన్నా.. వివాహమయ్యాక ఫ్యామిలీ ఫ్లోటర్‌కి మారాల్సి వస్తుంది. ఒకవేళ మీ ప్రస్తుత బీమా కంపెనీ పాలసీలు మీకు అనుకోండి వేరే సంస్థకు మారొచ్చు. అయితే, ఒక్క విషయం.. అప్పటిదాకా అది వ్యక్తిగత పాలసీగానే ఉన్నందు వల్ల .. పాలసీ పరిధిలోకి అప్పటిదాకా రాని ఆరోగ్య సమస్యలకు సంబంధించిన క్రెడిట్స్‌ అనేవి సదరు పాలసీదారువి మాత్రమే కొనసాగుతాయి. కొత్తగా పాలసీలోకి చేర్చిన జీవిత భాగస్వామికి సంబంధించిన వెయిటింగ్‌ పీరియడ్‌ లాంటివి మళ్లీ కొత్తగానే మొదలవుతాయి.

అదే, ఫ్యామిలీ ఫ్లోటర్‌ నుంచి ఇండివిడ్యువల్‌ పాలసీకి మారాల్సి వచ్చే సందర్భాలూ ఎదురుకావొచ్చు. ఉదాహరణకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటం వల్ల తరచూ క్లెయిమ్స్‌ చేయాల్సి వస్తుండవచ్చు. దీంతో మొత్తం పాలసీలోని కుటుంబసభ్యులందరికీ పూర్తి ప్రయోజనాలు లభించకుండా పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు తరచూ అనారోగ్యం బారిన పడే మెంబర్‌ పేరును ఫ్యామిలీ ఫ్లోటర్‌ నుంచి తొలగించి ప్రత్యేకంగా వారి పేరున ఇండివిడ్యువల్‌ పాలసీని తీసుకోవడం శ్రేయస్కరం. మిగతా కుటుంబసభ్యులకు ప్రస్తుత ఫ్యామిలీ ఫ్లోటర్‌ బీమా కవరేజీ యథాప్రకారం కొనసాగుతుంది.

ప్రీమియం క్రమం తప్పకుండా కడితేనే..
పాలసీ ప్రీమియంలు క్రమం తప్పకుండా కడుతుంటేనే పోర్టింగ్‌ అవకాశం ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా సరే ప్రీమియం క్రమం తప్పకుండా కట్టకపోవడం వల్ల పాలసీకి బ్రేక్‌ వచ్చిదంటే అవకాశం కోల్పోయినట్లే.

ప్రీమియం గడువు తేదీ ముందుగా ప్రాసెస్‌ కాకపోతే..
నిర్దేశించిన విధంగా 45 రోజుల కన్నా ముందుగానే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పోర్టబిలిటీ ఎంచుకున్నప్పటికీ.. ఆఖరి రోజున కూడా మీ దరఖాస్తు కొత్త బీమా కంపెనీ దగ్గర పెండింగ్‌లోనే ఉన్న పక్షంలో బీమా రక్షణ కోల్పోకుండా మీకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రస్తుత బీమా కంపెనీ దగ్గర పాలసీ గడువును గరిష్టంగా నెల రోజుల పాటు పొడిగించుకునేందుకు వీలు ఉంటుంది. పొడిగించుకున్న వ్యవధికి మాత్రమే ప్రీమియం కడితే సరిపోతుంది. అయితే, ఈలోగానే ఏదైనా క్లెయిమ్‌ తలెత్తిన పక్షంలో.. పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా కంపెనీ చెల్లింపులు జరుపుతుంది.

కానీ, అలాంటప్పుడు పాత కంపెనీకే పూర్తి ఏడాది ప్రీమియంను కట్టాల్సి వస్తుంది. క్లెయిమ్‌ చేసిన తర్వాత ఇక ఆ ఏడాదంతా అదే సంస్థ పాలసీనే కొనసాగించాల్సి వస్తుంది. వేరే సంస్థకు పోర్టింగ్‌ అవకాశం ఉండదు. ఇక, పోర్టింగ్‌ సంబంధించి కొత్త సంస్థ నుంచి రూఢీగా పాలసీ జారీ అయితే గానీ లేదా పాలసీదారు నుంచి రాతపూర్వకంగా అభ్యర్ధన వస్తే గానీ ప్రస్తుత బీమా సంస్థ.. పాలసీని రద్దు చేయడానికి లేదు.

సమ్‌ అష్యూర్డ్‌లోకే నో క్లెయిమ్‌ బోనస్‌ కూడా ..
ఉదాహరణకు మీ ప్రస్తుత పాలసీ కవరేజీ రూ. 2 లక్షలు కాగా మీకు నో–క్లెయిమ్‌ బోనస్‌ కింద రూ. 50,000 వచ్చిందనుకోండి. పోర్టబిలిటీ ఎంచుకున్నప్పుడు కొత్త బీమా సంస్థ.. ప్రస్తుత సమ్‌ అష్యూర్డ్‌తో పాటు బోనస్‌ని కూడా కలిపి ప్రీమియం లెక్కేస్తుంది. అంటే.. పాలసీని పోర్ట్‌ చేసినప్పుడు రూ. 2 లక్షలు కాకుండా రూ. 2,50,000 కవరేజీకి ప్రీమియం కట్టాల్సి వస్తుంది.

కొత్త సంస్థ మీ దరఖాస్తు తిరస్కరించవచ్చు..
పోర్టబిలిటీ అనేది పాలసీదారు హక్కే అయినప్పటికీ.. బీమా కంపెనీలు కచ్చితంగా పోర్టింగ్‌ వచ్చిన ప్రతి పాలసీనీ అంగీకరించి తీరాలనేమీ లేదు. కొత్త కంపెనీ మీ దరఖాస్తును కొత్తదానిలాగే పరిగణిస్తుంది. ఒకవేళ రిస్కులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే తిరస్కరించనూ వచ్చు కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షలకు సిఫార్సు చేయొచ్చు. అయితే ఏ నిర్ణయమైనా సరే మీరు పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా మీకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గడువు దాటిన పక్షంలో తిరస్కరించడానికి ఉండదు.

ప్రక్రియ ఇలా..
అవసరమైన పత్రాలతో పోర్టింగ్‌ దరఖాస్తును సమర్పించాక, కొత్త బీమా సంస్థ మీ మెడికల్, క్లెయిమ్‌ల హిస్టరీ గురించి ప్రస్తుత  బీమా సంస్థ నుంచి సమాచారం సేకరిస్తుంది. ఇదంతా బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ వెబ్‌ సైట్‌ ద్వారా జరుగుతుంది. కొత్త సంస్థ నుంచి అభ్యర్ధన వచ్చిన వారం రోజుల్లోగా మీ ప్రస్తుత సంస్థ సదరు సమాచారాన్ని ఐఆర్‌డీఏకి అందించాల్సి ఉంటుంది. లేకపోతే నిబంధనలు ఉల్లంఘించినట్ల వుతుంది. ప్రస్తుత సంస్థ నుంచి వివరాలు వచ్చాక, కొత్త సంస్థ అండర్‌రైటింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తుంది. పాలసీదారు నుంచి దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లోగా తమ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పోర్టబిలిటీ కోసం ప్రత్యేక చార్జీలేమీ ఉండవు. పూర్తిగా ఉచితం.

కావల్సిన పత్రాలు..
♦ ప్రస్తుత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ
♦ గడిచిన ఏడాదిలో క్లెయిమ్స్‌ లేకపోతే ఆ విషయాన్ని స్వయంగా ధృవీకరిస్తూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌.
♦ ఒకవేళ క్లెయిమ్‌ ఉంటే, డిశ్చార్జి సమ్మరీ, చికిత్స, రిపోర్టు కాపీలు మొదలైనవి.
♦ కీలకమైన అనారోగ్య సమస్యలేమైనా గతం నుంచీ ఉంటే వైద్యులతో కన్సల్టేషన్‌ పత్రాలు, ప్రిస్క్రిప్షన్‌లు, చికిత్స రిపోర్టులు.
♦ పోర్టబిలిటీ దరఖాస్తు ఫారం
♦ ఇవి కాకుండా సదరు బీమా సంస్థ ఇతరత్రా పత్రాలేమైనా కోరిన పక్షంలో అవి.

పోర్టబిలిటీ  ప్రయోజనాలు..
♦ కొత్త సంస్థ నుంచి మెరుగైన సేవల అంచనాలు.
♦ సముచిత ప్రీమియానికి మెరుగైన పాలసీ
♦ భవిష్యత్‌ అవసరాలను బట్టి పాలసీని తీర్చిదిద్దుకునే అవకాశం.

ప్రతికూలతలు..
♦   రెన్యువల్‌ సమయంలో మాత్రమే పోర్టింగ్‌కు అవకాశం.
♦ నో–క్లెయిమ్‌ బోనస్‌ ఉచితంగానే పోగుపడినా.. కొత్త సంస్థ దాన్ని కూడా సమ్‌ ఇన్సూర్డ్‌ కింద చేర్చడం వల్ల ప్రీమియం భారం పెరగడం.
♦ కొత్త బీమా సంస్థ మళ్లీ మీ రిస్కును తమ తమ పద్ధతుల్లో బేరీజు వేసుకుని మళ్లీ కొత్తగా ప్రీమియంలు నిర్ణయించడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement