చదువు అయిపోయి కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత ఒక్కసారిగా తమకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తోంది. అప్పటివరకు చిల్లర ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడినవారు ఉద్యోగం రాగానే విచ్చలవిడి ఖర్చుకు ఏమాత్రం ఆలోచించడం లేదు. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు ఏరూపంలో వస్తాయో తెలియదు. కాబట్టి యువతతోపాటు అందరూ కొన్ని చిట్కాలు పాటించి డబ్బు ఆదా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల్లోనే బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఫోన్లు చేస్తుంటాయి. చాలామంది అధికంగా ఖర్చు చేయడానికి క్రెడిట్‌కార్డు ఒక కారణం. నెలవారీ ఖర్చులకు మించి అప్పు చేసి మరీ క్రెడిట్‌కార్డు ఉందనే దీమాతో వస్తువులు కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్డు వాడినా ఒకేసారి బిల్లు చెల్లించేలా ప్రణాళికలు వేసుకోవాలి. నెలవారీ బిల్లులో మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుందనేలా బ్యాంకు మెసేజ్‌లు కనిపిస్తాయి. అలాచేస్తే కట్టాల్సిన మొత్తం పేమెంట్‌పై తదుపరి నెల అధికవడ్డీ వసూలు చేస్తారు.
నెలవారీ ఆదాయం, ఖర్చులకు సంబంధించి పక్కా బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి. నెలాఖరులోపు తరచుగా మీకు నగదు కొరత వస్తుందంటే.. ఖర్చులను సమీక్షించాల్సిందే. ఆదాయానికి తగిన బడ్జెట్‌ను తయారు చేసుకుని తప్పకుండా దాన్ని పాటించాలి.
నెలవారీ మొత్తం ఖర్చులు అయిపోయిన తర్వాత మిగతా డబ్బును ఆదా చేయాలని చూస్తారు. కానీ ముందు పొదుపు..తర్వాతే ఖర్చు అనే విధానాన్ని పాటించాలి. ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. దీర్ఘకాలంలో క్రమశిక్షణతో సంపదను సృష్టించేందుకు ఇది తోడ్పడుతుంది.
ఏదైనా పరిస్థితుల్లో చేస్తున్న ఉద్యోగం కోల్పోయినా ఖర్చులు తట్టుకోవాలంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం ఆరు నెలలకు సరిపడా నిధులను సిద్ధం చేసుకోవాలి. దీన్ని సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో ఉంచుకోవచ్చు.
ఉద్యోగం చేస్తున్న సమయంలో బోనస్, ప్రమోషన్, ఇంక్రిమెంట్ల రూపంలో అదనంగా డబ్బు సమకూరుతుంది. దాన్ని విలాసాలు, ఖరీదైన వస్తువులు కొనేందుకు వినియోగించకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే మ్యుచువల్ ఫండ్‌లను ఎంచుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.
ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. మీ వయసు, మీరు చేస్తున్న ఉద్యోగం, మీకు వస్తున్న వేతనం లెక్కించి నెలవారీగా కొంత మొత్తంతో పదవీవిరమణ కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
ఇదీ చదవండి: రెండేళ్లలో అంగారక గ్రహంపైకి స్టార్‌షిప్ మిషన్..?
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసినా ఆదాయంలో 30 శాతం వరకు ఈఎంఐలు మించకూడదు. మారుతున్న ఆహార అలవాట్లతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ముందుగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. ప్రమాదవశాత్తు మీరు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే టర్మ్ పాలసీ తప్పకుండా ఉండాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ రెండు పాలసీలు తప్పకుండా తీసుకోవాలి. వయసు తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తక్కువగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment