Credit Card Scheme
-
క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరాలు పుట్టుకొస్తాయో ఎవరమూ చెప్పలేం. అప్పటిదాకా సజావుగా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క కుదుపు చాలు మొత్తం తిరగబడిపోవడానికి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉపద్రవాలు తలెత్తితే కుటుంబాలే కుదేలయిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తగిన ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు తట్టుకునే విధంగా ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. లేదంటే ప్రమాదమే. ఖర్చులు పెరిగిపోయి అరాకొరా జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఈమధ్యన ఎక్కువగా ఆశ్రయిస్తున్న సాధనం క్రెడిట్ కార్డులు. సగటున నెలకు రూ.25000-రూ.30000 ఆర్జించే వ్యక్తులు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొందరు ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులను స్టేటస్ సింబల్ కోసమో, సరదాకో వాడటం కూడా చూస్తూనే ఉన్నాం.ఏదైనా మోతాదు మించకూడదు..అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఎప్పటికే ప్రమాదమే. ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడినా సమస్యలు తప్పవు. ఆ తర్వాత బిల్లులు కట్టలేక నిండా మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది.ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే మొదటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి కదా అని కొంతమంది 4, 5 క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం.కార్డులిస్తున్న సంస్థలివే..దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొన్ని అన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్డులు ఇస్తున్నాయి.క్రెడిట్‌కార్డు పొందాలంటే..క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బావుండాలి. సాధారణంగా 750 -900 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. నెలకు రూ.20000 ఆదాయం పొందే వ్యక్తికి కూడా క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదే ప్రీమియం కార్డుల విషయానికొస్తే రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్డులు జారీ చేస్తున్నాయి.కార్డు జారీకి ఇవి చాలా ముఖ్యంకార్డు జారీ చేయాలంటే క్రెడిట్ హిస్టరీ బావుండాలి. అంటే గతంలో ఏవైనా లోన్లు తీసుకుని ఉంటే అవి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా లోన్లు ఎంత ఉన్నాయి ఎప్పటికి క్లోజ్ అవుతాయనే వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. కార్డు జారీలో మీరు పని చేస్తున్న కంపెనీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? ఆ కంపెనీ స్థాపించి ఎన్నాళ్లయింది? అది స్థిరమైన కంపెనీ యేనా? వంటి అంశాలు కూడా కార్డుల జారీలో బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి.మెరుగైన సిబిల్ ఉంటేనే..కార్డుకు దరఖాస్తు చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్ (దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు) ఎంతుందో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. కార్డు దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ మీరు అప్లై చేసే బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(Payslips) సమర్పించాలి. దీంతోపాటు ఫోటో ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు స్టేట్మెంట్ తదితర డాక్యుమెంట్లను ఇవ్వాలి. నేరుగా బ్యాంకులోగానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు లేదా సంస్థ మీరిచ్చిన పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి మీ అర్హతను బట్టి కార్డు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: త్వరలో టీజీ రెరా యాప్..ఇష్టారాజ్యంగా వాడితే అంతే..కార్డు చేతికొచ్చాక మీరు దాన్ని సరిగా వాడుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అలాకాక చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడితే అదే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. కార్డు బిల్లు వచ్చాక చాలామంది సాధారణంగా ఒక పొరపాటు చేస్తూంటారు. కనీస మొత్తం చెల్లిస్తూ గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల బాకీ ఎప్పటికీ తీరకపోగా తీసుకున్న మొత్తానికి మించి చెల్లిస్తారు. కట్టేది తక్కువేకదా అనే భ్రమ కలిగించేలా ఉన్న ఈ మినిమం పేమెంట్ ఊబిలో పడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఉదా: ఒక వ్యక్తికి రూ.1 లక్ష విలువ చేసే క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. అతను తన అవసరాల కోసం రూ.25,000 కార్డు నుంచి వాడేశాడు. దాని మీద అతను నెలకు కట్టాల్సిన కనీస మొత్తం రూ.1,250 మాత్రమే. కట్టేది తక్కువేగా అని ఆ మొత్తమే కట్టుకుంటూ పోతాడు. దీనివల్ల 6 నెలలు గడిచినా అతను అప్పటికి రూ.7,500 కట్టి ఉన్నా తీరేది అతి స్వల్ప మొత్తమే. ప్రతి నెలా చార్జీలు జత కలుస్తూనే ఉంటాయి. కార్డు వాడేవాళ్లలో నూటికి 95 మంది చేసే తప్పే ఇది.ఏం చేయాలంటే.. క్రెడిట్ కార్డు పేమెంట్ బిల్లు డేట్ జనరేట్ అయిన తర్వాత మళ్లీ బిల్లు వచ్చి దాన్ని చెల్లించేందుకు 45 రోజుల వడ్డీ రహిత సదుపాయం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మొత్తం బాకీ ఒకేసారి తీర్చేసి మళ్లీ కార్డును వాడుకుంటే మీకు వడ్డీల భారం తగ్గుతుంది. మీరు కట్టాల్సిన మొత్తం తీరిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ రికార్డూ పదిలంగా ఉంటుంది. సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు మీపై విశ్వాసం పెరిగి మీ లిమిట్ మొత్తాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధమయింది కదా క్రెడిట్ కార్డును మీరు ఎలా వాడుతున్నారన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే లబ్ది పొందుతారు. లేదంటే మునిగిపోతారు. ఆలోచించుకుని అడుగేయండి.-బెహరా శ్రీనివాస రావు,పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసా..?
చదువు అయిపోయి కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత ఒక్కసారిగా తమకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తోంది. అప్పటివరకు చిల్లర ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడినవారు ఉద్యోగం రాగానే విచ్చలవిడి ఖర్చుకు ఏమాత్రం ఆలోచించడం లేదు. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు ఏరూపంలో వస్తాయో తెలియదు. కాబట్టి యువతతోపాటు అందరూ కొన్ని చిట్కాలు పాటించి డబ్బు ఆదా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల్లోనే బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఫోన్లు చేస్తుంటాయి. చాలామంది అధికంగా ఖర్చు చేయడానికి క్రెడిట్‌కార్డు ఒక కారణం. నెలవారీ ఖర్చులకు మించి అప్పు చేసి మరీ క్రెడిట్‌కార్డు ఉందనే దీమాతో వస్తువులు కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్డు వాడినా ఒకేసారి బిల్లు చెల్లించేలా ప్రణాళికలు వేసుకోవాలి. నెలవారీ బిల్లులో మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుందనేలా బ్యాంకు మెసేజ్‌లు కనిపిస్తాయి. అలాచేస్తే కట్టాల్సిన మొత్తం పేమెంట్‌పై తదుపరి నెల అధికవడ్డీ వసూలు చేస్తారు.నెలవారీ ఆదాయం, ఖర్చులకు సంబంధించి పక్కా బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి. నెలాఖరులోపు తరచుగా మీకు నగదు కొరత వస్తుందంటే.. ఖర్చులను సమీక్షించాల్సిందే. ఆదాయానికి తగిన బడ్జెట్‌ను తయారు చేసుకుని తప్పకుండా దాన్ని పాటించాలి.నెలవారీ మొత్తం ఖర్చులు అయిపోయిన తర్వాత మిగతా డబ్బును ఆదా చేయాలని చూస్తారు. కానీ ముందు పొదుపు..తర్వాతే ఖర్చు అనే విధానాన్ని పాటించాలి. ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. దీర్ఘకాలంలో క్రమశిక్షణతో సంపదను సృష్టించేందుకు ఇది తోడ్పడుతుంది.ఏదైనా పరిస్థితుల్లో చేస్తున్న ఉద్యోగం కోల్పోయినా ఖర్చులు తట్టుకోవాలంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం ఆరు నెలలకు సరిపడా నిధులను సిద్ధం చేసుకోవాలి. దీన్ని సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో ఉంచుకోవచ్చు.ఉద్యోగం చేస్తున్న సమయంలో బోనస్, ప్రమోషన్, ఇంక్రిమెంట్ల రూపంలో అదనంగా డబ్బు సమకూరుతుంది. దాన్ని విలాసాలు, ఖరీదైన వస్తువులు కొనేందుకు వినియోగించకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే మ్యుచువల్ ఫండ్లను ఎంచుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. మీ వయసు, మీరు చేస్తున్న ఉద్యోగం, మీకు వస్తున్న వేతనం లెక్కించి నెలవారీగా కొంత మొత్తంతో పదవీవిరమణ కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: రెండేళ్లలో అంగారక గ్రహంపైకి స్టార్‌షిప్ మిషన్..?ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసినా ఆదాయంలో 30 శాతం వరకు ఈఎంఐలు మించకూడదు. మారుతున్న ఆహార అలవాట్లతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ముందుగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. ప్రమాదవశాత్తు మీరు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే టర్మ్ పాలసీ తప్పకుండా ఉండాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ రెండు పాలసీలు తప్పకుండా తీసుకోవాలి. వయసు తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తక్కువగా ఉంటుంది. -
SBI : పల్స్ కార్డ్.. మీ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా
హైదరాబాద్: ఫిట్నెస్, ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ ఎస్బీఐ కార్డ్ పల్స్ ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల ఆరోగ్యం, క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ఫీచర్లతో ఈ కార్డ్ డిజైన్ చేశారు. ఈ కార్డు ఆవిష్కరణ సంధర్భంగా ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రామ్మోహన్ రావు అమర మాట్లాడుతూ, “కొవిడ్-19 తర్వాత హెల్త్ కాన్షియస్ పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఎస్బీఐ కార్డ్ పల్స్‌ను ప్రవేశపెడుతున్నాం. ఫిట్నెస్, వెల్నెస్ విషయంలో పెరుగుతున్న మా కస్టమర్ల అవసరాలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సహకరించే విధంగా ఈ కార్డ్ ఉంటుంది” అన్నారు. ప్రయోజనాలు ఈ కార్డుతో వెల్కమ్ గిఫ్టుగా కస్టమర్లకు నాయిస్ కలర్‌ఫిట్ స్మార్ట్‌వాచ్ ఎస్బీఐ కార్డ్ పల్స్ అందుతుంది. 1.4 ఇంచుల ఫుల్ కలర్ డిస్ప్లే, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ (SPO2), స్లీప్ మానిటరింగ్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. - ఏడాదిపాటు ఫిట్‌పాస్ ప్రో సభ్యత్వాన్ని ఈ కార్డు ద్వారా లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 4000 ప్లస్ జిమ్స్, ఫిట్నెస్ స్టూడియోలకు ఈ ద్వారా యాక్సెస్ లభిస్తుంది. అక్కడ యోగా, డ్యాన్స్, కార్డియో, పిలేట్ ఇంకా అనేక ఆన్లైన్ ఫిట్నెస్ సెషన్లను దీని ద్వారా పొందవచ్చు. - ఈ కార్డు ద్వారా కస్టమర్లు ఒక సంవత్సరం నెట్‌మెడ్స్ ఫస్ట్ మెంబర్షిప్ దక్కుతుంది. ఏడాది పాటు ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెషన్లతో పాటు ప్రాథమిక హెల్త్ చెకప్, పాథాలజీ ల్యాబ్ టెస్టులపై 5 శాతం తగ్గింపు వర్తిస్తుంది. - వార్షిక ఫీజు చెల్లించి కార్డుపై మొదటి రిటెయిల్ లావాదేవీ జరిపిన వెంటనే ఫిట్‌పాస్, నెట్‌మెడ్స్ సభ్యత్వం యాక్టివేట్ అవుతాయి. - సంపన్న శ్రేణిని లక్ష్యంగా చేసుకుని అందిస్తున్న ఈ కాంటాక్ట్ లెస్ కార్డు వార్షిక మెంబర్షిప్ ఫీజు రూ.1499 మాత్రమే. దీన్ని వీసా సిగ్నేచర్ ఫ్లాట్‌పామ్‌పై విడుదల చేస్తున్నారు. కార్డు సభ్యత్వ సంవత్సరంలో రూ.2 లక్షల కొనుగోళ్లు జరిపినట్టయితే రెన్యూవల్ ఫీజు మినహాయింపు చేస్తారు. - ఫార్మసీలు, ఔషధ దుకాణాలు, డైనింగ్, సినిమాలపై జరిపే కొనుగోళ్లకు 5X రివార్డు పాయింట్లను కొనుగోలుదారులు పొందుతారు. అంతే కాదు కార్డు సభ్యత్వ సంవత్సరంలో రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు అయితే రూ.1500 విలువైన నెట్‌మెడ్ ఈ-వోచర్ లభిస్తుంది. - ఏడాది కాలంలో 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ విజిట్స్, 99 డాలర్ల విలువైన కాంప్లిమెంటరీ ప్రయారిటీ పాస్ మెంబర్షిప్, కాంప్లిమెంటరీ గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్, కాంప్లిమెంటరీ ఫ్రాడ్ లయబిలిటి కవర్, కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉన్నాయి. వెల్కమ్ ఆఫర్ కస్టమర్లు జాయినింగ్ ఫీజు చెల్లించిన తర్వాత స్వాగత కానుకగా రూ.4,999 విలువ చేసే నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్ వాచ్‌ను అందిస్తున్న మొట్టమొదటి కార్డ్ ఎస్బీఐ పల్స్. చదవండి:SBI: మహిళల కోసం ప్రత్యేక హెల్త్ ప్లాన్ -
ఏ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో మీకు తెలుసా?
బ్యాంక్‌కు వెళ్లి క్రెడిట్ కార్డ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. కానీ ఏ క్రెడిట్ కార్డ్ మంచిదో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకటో, రెండో అయితే ఒకే కానీ మార్కెట్ లో 130 రకాల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. వాటిలో ఏ కార్డ్ వినియోగిస్తే హోటల్స్ రూమ్ బుకింగ్స్‌లో డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్స్ వస్తాయో? ఏ కార్డ్‌పై ఫ్యూయల్ డిస్కౌంట్ లభిస్తాయో మనకు తెలియదు.అయితే వాటిలో మనం తరుచు వాడే 5,6 క్రెడిట్ కార్డ్‌లు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.అవేంటో తెలుసుకొని వినియోగిస్తే ఆర్ధిక ఇబ్బందులతో పాటు, క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇన్ఫినియా - ఎయిర్ పోర్ట్‌లలో ప్యాసింజర్ కోసం ప్రత్యేక సదుపాయాలు ( లాంజ్ యాక్సెస్) ఉంటాయి. వాటిల్లో ఆఫర్స్‌ను సొంతం చేసుకోవచ్చు. , క్లబ్ మారియట్ మెంబర్ షిప్ లభిస్తోంది ఐసీసీఐ బ్యాంక్ ప్లాటినం - ఫ్యూయల్ సర్ ఛార్జీల తగ్గింపు, రెస్టారెంట్లలో 15శాతం డిస్కౌంట్ ఎస్బీఐ ఎలైట్ - ప్రయారిటీ పాస్ మెంబర్ షిప్‌తో పాటు, లాంజ్ యాక్సెస్, ట్రిడెంట్ హోటల్ మెంబర్ షిప్ హెచ్ఎస్బీసీ వీసా ప్లాటినం - అమెజాన్ ఓచర్స్, లాంజ్ యాక్సెస్, విమాన ప్రయాణాల్లో డిస్కౌంట్ లలో భోజన సదుపాయం, క్యాష్ బ్యాక్ సిటీ క్యాష్ బ్యాక్ - క్యాష్ బ్యాక్ తో పాటు రెస్టారెంట్ లలో డిస్కౌంట్స్ యాక్సెస్ బ్యాంక్ నియో - అమెజాన్ ఓచర్స్, జోమాటా, పేటిఎం, మింత్రా, బుక్ మై షోలలో డిస్కౌంట్ -
విద్యార్ధులకు క్రెడిట్ కార్డులు.. రూ.10 లక్షల వరకు పరిమితి
కోల్‌కతా: విద్యార్థులకు రుణసాదుపాయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డ్’ పథకాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రారంభించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీదీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇదొక అద్భుత పథకమని ఈ సందర్భంగా మమత తెలిపారు. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా 4 శాతం వార్షిక సాధారణ వడ్డీతో 10 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చునని చెప్పారు. పదేళ్లుగా బెంగాల్ లో నివసించే విద్యార్థులు (గరిష్ఠ వయసు 40 ఏళ్లు) ఈ కార్డు పొందేందుకు అర్హులని మమత తెలిపారు. అండర్ గ్రాడ్యేయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వైద్య విద్య చదివేవారికి ఈ కార్డు ద్వారా రుణం లభిస్తుందని చెప్పారు. దేశ, విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐఎఎస్, ఐపిఎస్, ఇతరు పోటీ పరీక్షలకు కోచింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి ఈ ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చన్నారు. తీసుకున్న రుణాన్ని 15 సంవత్సరాల్లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సకాలంలో వడ్డీని పూర్తిగా చెల్లిస్తే రుణగ్రహీతలకు ఒక శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ఆమె తెలిపారు. కాగా, దేశంలో స్టూడెంట్ క్రెడిట్ కార్డులు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. చదవండి: శశికళపై మరో కేసు నమోదు.. -
సి‘ఫార్సు’లు
చీరాల, న్యూస్‌లైన్: చేతి వృత్తులకు చేయూతనిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం చేనేత కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఇప్పటికే చేనేత పార్కు, మెగా క్లస్టర్ వంటి ప్రాజెక్ట్‌లు అటకెక్కగా, చేనేత క్రెడిట్ కార్డు పథకం కూడా తూతూ మంత్రంగా సాగుతోంది. చేనేత కార్మికులకు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2 లక్షల వరకు సబ్సిడీ వడ్డీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తే వ్యక్తిగతంగా వారు ఆర్థికాభివృద్ధి సాధించి, సంక్షోభం నుంచి బయట పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం నుంచి చేనేత క్రెడిట్ కార్డుల పథకాన్ని అమలు చే స్తోంది. ఈ పథకం తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. రుణాలు కల్పిస్తామని క్రెడిట్ కార్డులు మంజూరు చేసిన చేనేత శాఖ జిల్లా మొత్తం రెండు వేల మంది కార్మికులకు రుణాలివ్వలేదు. దీంతో రుణాలు అందక, మగ్గం సాగక కార్మికులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రుణాలు దక్కని కార్మికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఆర్టిజన్, క్రెడిట్ కార్డుల వంటి పథకాలు అమలు చేసి రుణ సౌకర్యాలు కల్పిస్తామన్న సర్కారు ఆచరణలో మాత్రం చేనేతలకు ‘చెయ్యి’స్తోంది. దశాబ్దాల తరబడి మాస్టర్‌వీవర్ వద్ద కూలీలుగా పని చేస్తున్నారే తప్ప స్వతంత్రంగా పని చేసుకోలేని పరిస్థితిలో కార్మికులున్నారు. మాస్టర్ వీవర్లు ఇచ్చే కూలీలు (మజూరీలు) తినడానికి కూడా చాలక పస్తులతో కాలం నెట్టుకొస్తున్నారే తప్ప సొంతగా వారి కాళ్లపై నిలబడలేని దయనీయమైన స్థితిలో ఉన్నారు. చేనేత కార్మికులకు చేయూతనిస్తామని ఏడాదిన్నర క్రితం చేనేత క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. చేనేత మగ్గం ఉండి, చేనేత గుర్తింపు కార్డు ఉంటే అటువంటి వారిని అర్హులుగా గుర్తించి *2 లక్షల వరకు సబ్సిడీ వడ్డీ, మార్జిన్మనీతో కూడిన రుణం కల్పిస్తామని చెప్పింది. చీరాల, వేటపాలెంతో పాటు జిల్లాల్లో ఉన్న చేనేత ప్రాంతాల్లో చేనేత శాఖాధికారులు ఈ పథకం గురించి చేనేత కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అర్హులైన వారందరి నుంచి దరఖాస్తులు కూడా సేకరించారు. జిల్లాలో 33 వేల చేనేత కుటుంబాలున్నాయి. 17 వేల మగ్గాలు పని చేస్తున్నాయి. 10 వేల మంది అర్హులైన వారు జిల్లాలో ఉన్నారు. కానీ ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల ద్వారా 1970 మందికి మాత్రమే రుణాలు కల్పించారు. అది కూడా ఒక్కొక్కరికి రూ.35 వేల నుంచి రూ.50 వేల లోపు మాత్రమే. క్రెడిట్ కార్డులున్నా బ్యాంక్‌లు రుణ సౌకర్యానికి మోకాలడ్డేస్తున్నాయి. క్రెడిట్‌కార్డు ద్వారా రుణ సౌకర్యం కల్పించాల్సిన చేనేత శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించడంలో చొరవ చూపలేకపోతోంది. దీంతో చేనేతలకు రుణం గగనంగా మారింది. వేలాది మంది చేనేత కార్మికులుంటే ఇప్పటి వరకు ఇచ్చింది 1970 మందికి మాత్రమే అంటే పథకం నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ సిఫార్సు ఉంటేనే... చేనేత క్రెడిట్ కార్డుల ద్వారా రుణం పొందే హక్కు గుర్తింపు కార్డులున్న కార్మికులకు ఉంటుంది. కానీ కేవలం స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు, కొంత మంది కార్యకర్త లు సిఫార్సు చేసిన వారికే రుణ సౌకర్యం లభిస్తోంది. చేనేతలు అధికంగా ఉండే ఈపూరుపాలెంలో ఒక మాజీ సర్పంచ్ రుణ పంపిణీ లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాడు. ఆయ న చెప్పిన కొంత మందికే రుణాలు మంజూరవుతున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి కాకుండా మరో పార్టీకి పని చేసిన వారికి రుణాలు అందడం లేదు. మిగతా ప్రాంతాల్లో కూడా స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల ఆదరాభిమానాలు ఉంటేనే రుణం అందే పరిస్థితులున్నాయి. చేనేత అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే తానాతందానా అనడం గమనార్హం. ఇదిలా ఉంటే కొం దరు నాయకులు రుణం మంజూరు చేయిస్తే రూ.5 వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. హ్యాండ్లూమ్ ఏడీ ఏమంటున్నారంటే... జిల్లాలో చేనేత క్రెడిట్ కార్డుల పథకం కింద 1970 మందికి రుణాలు కల్పించాం. మరికొద్ది మందికి కల్పించాల్సి ఉంది. ఒక్కొక్కరికి రూ.35 నుంచి రూ. 50 వేల వరకు రుణాలు మంజూరయ్యాయి.సకాలంలో బ్యాంకర్లకు తిరిగి చెల్లిస్తే మళ్లీ అదనంగా రుణాలు వచ్చే అవకాశం ఉం దని చేనేత శాఖ ఏడీ రామ్మూర్తి పేర్కొన్నారు.