చీరాల, న్యూస్‌లైన్: చేతి వృత్తులకు చేయూతనిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం చేనేత కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఇప్పటికే చేనేత పార్కు, మెగా క్లస్టర్ వంటి ప్రాజెక్ట్‌లు అటకెక్కగా, చేనేత క్రెడిట్ కార్డు పథకం కూడా తూతూ మంత్రంగా సాగుతోంది. చేనేత కార్మికులకు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2 లక్షల వరకు సబ్సిడీ వడ్డీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తే వ్యక్తిగతంగా వారు ఆర్థికాభివృద్ధి సాధించి, సంక్షోభం నుంచి బయట పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం నుంచి చేనేత క్రెడిట్ కార్డుల పథకాన్ని అమలు చే స్తోంది. ఈ పథకం తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. రుణాలు కల్పిస్తామని క్రెడిట్ కార్డులు మంజూరు చేసిన చేనేత శాఖ జిల్లా మొత్తం రెండు వేల మంది కార్మికులకు రుణాలివ్వలేదు. దీంతో రుణాలు అందక, మగ్గం సాగక కార్మికులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రుణాలు దక్కని కార్మికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఆర్టిజన్, క్రెడిట్ కార్డుల వంటి పథకాలు అమలు చేసి రుణ సౌకర్యాలు కల్పిస్తామన్న సర్కారు ఆచరణలో మాత్రం చేనేతలకు ‘చెయ్యి’స్తోంది. దశాబ్దాల తరబడి మాస్టర్‌వీవర్ వద్ద కూలీలుగా పని చేస్తున్నారే తప్ప స్వతంత్రంగా పని చేసుకోలేని పరిస్థితిలో కార్మికులున్నారు. మాస్టర్ వీవర్లు ఇచ్చే కూలీలు (మజూరీలు) తినడానికి కూడా చాలక పస్తులతో కాలం నెట్టుకొస్తున్నారే తప్ప సొంతగా వారి కాళ్లపై నిలబడలేని దయనీయమైన స్థితిలో ఉన్నారు.
చేనేత కార్మికులకు చేయూతనిస్తామని ఏడాదిన్నర క్రితం చేనేత క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. చేనేత మగ్గం ఉండి, చేనేత గుర్తింపు కార్డు ఉంటే అటువంటి వారిని అర్హులుగా గుర్తించి *2 లక్షల వరకు సబ్సిడీ వడ్డీ, మార్జిన్‌మనీతో కూడిన రుణం కల్పిస్తామని చెప్పింది. చీరాల, వేటపాలెంతో పాటు జిల్లాల్లో ఉన్న చేనేత ప్రాంతాల్లో చేనేత శాఖాధికారులు ఈ పథకం గురించి చేనేత కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అర్హులైన వారందరి నుంచి దరఖాస్తులు కూడా సేకరించారు. జిల్లాలో 33 వేల చేనేత కుటుంబాలున్నాయి. 17 వేల మగ్గాలు పని చేస్తున్నాయి. 10 వేల మంది అర్హులైన వారు జిల్లాలో ఉన్నారు. కానీ ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల ద్వారా 1970 మందికి మాత్రమే రుణాలు కల్పించారు. అది కూడా ఒక్కొక్కరికి రూ.35 వేల నుంచి రూ.50 వేల లోపు మాత్రమే. క్రెడిట్ కార్డులున్నా బ్యాంక్‌లు రుణ సౌకర్యానికి మోకాలడ్డేస్తున్నాయి. క్రెడిట్‌కార్డు ద్వారా రుణ సౌకర్యం కల్పించాల్సిన చేనేత శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించడంలో చొరవ చూపలేకపోతోంది. దీంతో చేనేతలకు రుణం గగనంగా మారింది. వేలాది మంది చేనేత కార్మికులుంటే ఇప్పటి వరకు ఇచ్చింది 1970 మందికి మాత్రమే అంటే పథకం నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అధికార పార్టీ సిఫార్సు ఉంటేనే...
చేనేత క్రెడిట్ కార్డుల ద్వారా రుణం పొందే హక్కు గుర్తింపు కార్డులున్న కార్మికులకు ఉంటుంది. కానీ కేవలం స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు, కొంత మంది కార్యకర్త లు సిఫార్సు చేసిన వారికే రుణ సౌకర్యం లభిస్తోంది. చేనేతలు అధికంగా ఉండే ఈపూరుపాలెంలో ఒక మాజీ సర్పంచ్ రుణ పంపిణీ లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాడు. ఆయ న చెప్పిన కొంత మందికే రుణాలు మంజూరవుతున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి కాకుండా మరో పార్టీకి పని చేసిన వారికి రుణాలు అందడం లేదు. మిగతా ప్రాంతాల్లో కూడా స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల ఆదరాభిమానాలు ఉంటేనే రుణం అందే పరిస్థితులున్నాయి. చేనేత అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే తానాతందానా అనడం గమనార్హం. ఇదిలా ఉంటే కొం దరు నాయకులు రుణం మంజూరు చేయిస్తే రూ.5 వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు.
హ్యాండ్లూమ్ ఏడీ ఏమంటున్నారంటే...
జిల్లాలో చేనేత క్రెడిట్ కార్డుల పథకం కింద 1970 మందికి రుణాలు కల్పించాం. మరికొద్ది మందికి కల్పించాల్సి ఉంది. ఒక్కొక్కరికి రూ.35 నుంచి రూ. 50 వేల వరకు రుణాలు మంజూరయ్యాయి.సకాలంలో బ్యాంకర్లకు తిరిగి చెల్లిస్తే మళ్లీ అదనంగా రుణాలు వచ్చే అవకాశం ఉం దని చేనేత శాఖ ఏడీ రామ్మూర్తి పేర్కొన్నారు.
సి‘ఫార్సు’లు
Published Mon, Nov 25 2013 6:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement