
న్యూఢిల్లీ: టీవీ వీక్షకులకు త్వరలోనే పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ మార్చే పని లేకుండానే డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్లను మార్చుకోవడం సాకారం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. ‘‘గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్(ఎస్‌టీబీలు)ల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీని (అంతర్లీనంగా పనిచేయగలగడం) సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అవరోధాల్లో చాలా వరకు పరిష్కారం అయ్యాయి.
కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరికి సాధ్యమవుతుంది’’ అని శర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్‌పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు.