ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన డిజిటల్ టెలివిజన్ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లే (గతంలో టాటాస్కై)ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఎయిర్‌టెల్ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఎఫ్‌టీఏ సేవల ఆవిర్భావం కారణంగా వృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్న డిజిటల్ టెలివిజన్ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగా టాటాప్లేని కొనుగోలు చేయడానికి ఎయిర్‌టెల్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 2017లో టాటా కన్స్యూమర్ మొబిలిటీ వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేసిన తర్వాత రెండు కంపెనీల మధ్య ఇది రెండో ఒప్పందం కానుంది. ఈ ఒప్పదం కుదిరి టాటా ప్లేను ఎయిర్‌టెల్ కొనుగోలు చేస్తే టాటా తన కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాల పూర్తిగా వైదొలుగుతుంది.
టాటా ప్లే ప్రస్తుతం డీటీహెచ్ విభాగంలో 20.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు, 32.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉంది. కానీ ఆర్థిక పరంగా నష్టాల్లో నడుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.353.8 కోట్లుగా ఉంది. టాటా ప్లే కొనుగోలుతో ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ పెరుగుతుందని, అదే సమయంలో జియో అందిస్తున్న ఆఫర్లతో పోటీపడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment