డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) ఆపరేటర్ల లైసెన్స్ ఫీజు రద్దు అంశంపై టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్‌టెల్ మరోసారి విభేదించాయి. డీటీహెచ్ ఆపరేటర్లను ఇతర టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌లతో సమానంగా పరిగణించాలని, లైసెన్స్ ఫీజును పూర్తిగా ఎత్తివేయాలని ఎయిర్‌టెల్ పట్టుబడుతోంది. మరోవైపు, లైసెన్స్ ఫీజు రద్దు చేస్తే కేబుల్ టీవీ, ఐపీటీవీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) ప్రొవైడర్లకు నష్టం జరుగుతుందని రిలయన్స్ జియో వాదిస్తోంది.
‘టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 పరిధిలో బ్రాడ్‌కాస్టింగ్ సేవల ప్రొవిజన్ కోసం సర్వీస్ ఆథరైజేషన్స్ ఫ్రేమ్‌వర్క్’ అనే అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల టెలికాం సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అందులో ఎయిర్‌టెల్, జియో వంటి దిగ్గజ కంపెనీలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపాయి. డీటీహెచ్ లైసెన్స్ ఫీజును పూర్తిగా తొలగించాలని ఎయిర్‌టెల్ కోరింది. ప్రస్తుతం కంటెంట్ ఆదాయంపై విధిస్తున్న లైసెన్స్ ఫీజు, డీటీహెచ్ ఆపరేటర్లు చెల్లించే లైసెన్స్ ఫీజును బ్రాడ్‌కాస్టర్లు భరించాలని, అంతిమంగా అలాంటి ఆదాయంతో ప్రయోజనం పొందవచ్చని ఎయిర్‌టెల్ సూచించింది. గతంలో ట్రాయ్ చేసిన సిఫార్సులను వీలైనంత త్వరగా అమలు చేయాలని, మార్కెట్‌లో బ్రాడ్‌కాస్టర్లు 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండకుండా నిరోధించేలా క్రాస్ మీడియా ఆంక్షలను తొలగించాలని టాటా ప్లే ట్రాయ్‌ను కోరింది.
టెలికాం రంగానికి కేబినెట్ నిర్దేశించిన స్థూల ఆదాయం (జీఆర్), సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వంటి వాటిని డీటీహెచ్ లైసెన్సులకు కూడా వర్తింపజేయాలని ఎయిర్‌టెల్ సూచించింది. ఎయిర్ ప్రతిపాదించిన ఫీజు రద్దు అంశాన్ని జియో వ్యతిరేకించింది. ఉచిత స్పెక్ట్రమ్ కేటాయింపులు అందిస్తే డీటీహెచ్ సంస్థలు ప్రయోజనం పొందుతాయి కానీ, ఇది జాతీయ ఖజానాకు నష్టం కలిగిస్తుందని తెలిపింది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) ప్రొవైడర్లు తీవ్రంగా నష్టపోతారని వాదిస్తోంది. ఉచిత స్పెక్ట్రమ్ వల్ల డీటీహెచ్ సంస్థలు పొందే ప్రత్యేక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇతర ప్లాట్‌ఫామ్‌లతో పోల్చి లైసెన్స్ ఫీజును మాఫీ చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని జియో ఇన్ఫోకామ్ పేర్కొంది.
ఇదీ చదవండి: వేగంగా బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
డీటీహెచ్ లైసెన్స్ ఫీజును ప్రస్తుతమున్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని 2023 ఆగస్టులో ట్రాయ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ సిఫార్సు వల్ల డీటీహెచ్, కేబుల్ టీవీ, ఐపీటీవీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య సమాన వాటాను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment