DTH and broadband services
-
ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలు
డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) ఆపరేటర్ల లైసెన్స్ ఫీజు రద్దు అంశంపై టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్టెల్ మరోసారి విభేదించాయి. డీటీహెచ్ ఆపరేటర్లను ఇతర టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌లతో సమానంగా పరిగణించాలని, లైసెన్స్ ఫీజును పూర్తిగా ఎత్తివేయాలని ఎయిర్టెల్ పట్టుబడుతోంది. మరోవైపు, లైసెన్స్ ఫీజు రద్దు చేస్తే కేబుల్ టీవీ, ఐపీటీవీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) ప్రొవైడర్లకు నష్టం జరుగుతుందని రిలయన్స్ జియో వాదిస్తోంది.‘టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 పరిధిలో బ్రాడ్‌కాస్టింగ్ సేవల ప్రొవిజన్ కోసం సర్వీస్ ఆథరైజేషన్స్ ఫ్రేమ్‌వర్క్’ అనే అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల టెలికాం సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అందులో ఎయిర్టెల్, జియో వంటి దిగ్గజ కంపెనీలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపాయి. డీటీహెచ్ లైసెన్స్ ఫీజును పూర్తిగా తొలగించాలని ఎయిర్టెల్ కోరింది. ప్రస్తుతం కంటెంట్ ఆదాయంపై విధిస్తున్న లైసెన్స్ ఫీజు, డీటీహెచ్ ఆపరేటర్లు చెల్లించే లైసెన్స్ ఫీజును బ్రాడ్కాస్టర్లు భరించాలని, అంతిమంగా అలాంటి ఆదాయంతో ప్రయోజనం పొందవచ్చని ఎయిర్టెల్ సూచించింది. గతంలో ట్రాయ్ చేసిన సిఫార్సులను వీలైనంత త్వరగా అమలు చేయాలని, మార్కెట్లో బ్రాడ్కాస్టర్లు 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండకుండా నిరోధించేలా క్రాస్ మీడియా ఆంక్షలను తొలగించాలని టాటా ప్లే ట్రాయ్‌ను కోరింది.టెలికాం రంగానికి కేబినెట్ నిర్దేశించిన స్థూల ఆదాయం (జీఆర్), సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వంటి వాటిని డీటీహెచ్ లైసెన్సులకు కూడా వర్తింపజేయాలని ఎయిర్టెల్ సూచించింది. ఎయిర్ ప్రతిపాదించిన ఫీజు రద్దు అంశాన్ని జియో వ్యతిరేకించింది. ఉచిత స్పెక్ట్రమ్ కేటాయింపులు అందిస్తే డీటీహెచ్ సంస్థలు ప్రయోజనం పొందుతాయి కానీ, ఇది జాతీయ ఖజానాకు నష్టం కలిగిస్తుందని తెలిపింది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) ప్రొవైడర్లు తీవ్రంగా నష్టపోతారని వాదిస్తోంది. ఉచిత స్పెక్ట్రమ్ వల్ల డీటీహెచ్ సంస్థలు పొందే ప్రత్యేక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇతర ప్లాట్‌ఫామ్‌లతో పోల్చి లైసెన్స్ ఫీజును మాఫీ చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని జియో ఇన్ఫోకామ్ పేర్కొంది.ఇదీ చదవండి: వేగంగా బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలుడీటీహెచ్ లైసెన్స్ ఫీజును ప్రస్తుతమున్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని 2023 ఆగస్టులో ట్రాయ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ సిఫార్సు వల్ల డీటీహెచ్, కేబుల్ టీవీ, ఐపీటీవీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య సమాన వాటాను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
Airtel: కస్టమర్లకు నచ్చినట్టుగా ప్లాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ ఎయిర్టెల్ భారత్‌లో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. గృహ వినియోగదారులకు ఫైబర్, డీటీహెచ్, మొబైల్ సర్వీసులను ఒకే గొడుకు కిందకు తెచ్చింది. రెండు లేదా అన్ని కనెక్షన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. నచ్చిన విధంగా ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. ఫైబర్ రూ.499, డీటీహెచ్ రూ.153, మొబైల్ రూ.499 నుంచి నెలవారీ ప్లాన్స్ మొదలవుతాయి. లేదా కంపెనీ ప్రవేశపెట్టిన నాలుగు రకాల ప్లాన్స్‌లో దేనినైనా ఎంచుకోవచ్చు. రూ.998 ప్లాన్‌లో రెండు మొబైల్, ఒక డీటీహెచ్ కనెక్షన్ పొందవచ్చు. రూ.1,598 ప్లాన్ కింద రెండు మొబైల్, ఒక ఫైబర్, రూ.1,349 ప్లాన్‌లో మూడు మొబైల్, ఒక డీటీహెచ్, రూ.2,099 ప్లాన్ కింద మూడు మొబైల్, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్ కనెక్షన్ ఇస్తారు. జీఎస్టీ అదనం. ఎటువంటి అదనపు భారం లేకుండా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. ఇన్స్టాలేషన్, సర్వీస్ చార్జీలు లేవు. ఎయిర్టెల్ బ్లాక్ వినియోగదారులు కస్టమర్ కేర్ ప్రతినిధిని 60 సెకన్లలోపే ఫోన్లో సంప్రదించవచ్చని కంపెనీ తెలిపింది. -
డీటీహెచ్ సంస్థలకు ఇకపై 20 ఏళ్ల లైసెన్స్
న్యూఢిల్లీ: డీటీహెచ్ (ఇళ్లకు నేరుగా ప్రసారాలు అందించే) సేవలు దేశంలో మరింత బలపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనల సవరణకు.. అదేవిధంగా డీటీహెచ్ బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆరు కోట్ల ఇళ్లకు డీటీహెచ్ ‘‘భారత్‌లో ఆరు కోట్లకు పైగా ఇళ్లకు డీటీహెచ్ సేవలు అందుతున్నాయి. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించాలని వాణిజ్య శాఖ లోగడ నిర్ణయించింది. అయితే, సమాచార, ప్రసార శాఖ నిబంధనల కారణంగా ఈ ప్రయోజనం డీటీహెచ్ రంగానికి ఇంతకాలం లభించలేదు. నూతన నిబంధనలు వాణిజ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ నిబంధనల కింద 49 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉంది’’ అని మంత్రి మీడియాకు వివరించారు. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేస్తామని, తర్వాత నుంచి ప్రతీ పదేళ్ల కాలానికి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. లైసెన్స్ ఫీజును ప్రస్తుతం ఏడాదికోసారి వసూలు చేస్తుండగా, ఇక మీదట త్రైమాసికానికి ఓసారి వసూలు చేస్తామన్నారు. ‘ఎఫ్‌డీఐ నిబంధనల సవరణతో ఈ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఫలితంగా నూతన పెట్టుబడులు రావడంతోపాటు, నూతన ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. 8 శాతానికి తగ్గింపు నూతన నిబంధనల కింద లైసెన్స్ ఫీజును స్థూల ఆదాయంలో 10 శాతం కాకుండా.. సవరించిన స్థూల ఆదాయం (జీఎస్టీని మినహాయించిన తర్వాత)లో 8 శాతంగా మార్పు చేయనున్నారు. దీంతో టెలికం శాఖ మాదిరే లైసెన్స్ ఫీజు అమలు కానుంది. ఇలా ఆదా అయిన నిధులను సేవల విస్తరణకు వెచ్చించడం ద్వారా ఈ రంగం మరింత వృద్ధిని సాధించొచ్చన్నది సమాచార, ప్రసార శాఖ అంచనా. ‘‘డీటీహెచ్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా డీటీహెచ్ వేదికలను, టీవీ చానళ్ల ట్రాన్స్పోర్ట్ స్ట్రీమ్‌లను పంచుకోవచ్చు. అదే విధంగా టీవీ చానళ్ల పంపిణీదారులు సైతం తమ సబ్‌స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎస్ఎమ్ఎస్), కండీషనల్ యాక్సెస్ సిస్టమ్ (సీఏఎస్) అప్లికేషన్ల కోసం ఉమ్మడి హార్డ్‌వేర్‌ను పంచుకోవడానికి అనుమతిస్తాము. సదుపాయాలు పంచుకోవడం వల్ల శాటిలైట్ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు’’ అని సమాచార శాఖ ప్రకటన తెలియజేసింది. సంతోషం.. ఫీజులు కూడా తగ్గించాలి ‘‘మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మా కృతజ్ఞతలు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న లైసెన్స్ పాలసీని పరిష్కరించారు. ఇది అనిశ్చితిని తొలగిస్తుంది’’ అని టాటా స్కై ఎండీ, సీఈవో హరీత్ నాగ్‌పాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని, అప్పుడు తాము మరింత పోటీపడగలమన్నారు. ‘‘కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజును నిర్ణయించడం ద్వారా మాకూ సమాన అవకాశం కల్పించాలి. కేబుల్ టీవీ కూడా సమాచార, ప్రసార శాఖ లైసెన్స్ పరిధిలోనే, ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ధరలు, మార్జిన్లను పాటిస్తోంది’’ అని నాగ్‌పాల్ చెప్పారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం మార్చి చివరికి డీటీహెచ్ పరిశ్రమకు 7.24 కోట్ల మంది చెల్లింపుల చందాదారులు ఉన్నారు. -
మరో సంచలనానికి రిలయన్స్ రెడీ
ముంబై: జియో 4జీ మొబైల్ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీని కుదుపేసిన రిలయన్స్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తోంది. జియో టీవీతో ప్రస్తుతం ఉన్న డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ కంపెనీలకు షాక్ ఇవ్వనుంది. హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ తో ఒక జీబీపీస్ వరకు ఇంటర్నెట్ అందించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల కేబుల్స్ వేసింది. పైలట్ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలను రిలయన్స్ అందిస్తోంది. అయితే ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందా, లేదా అనేది వెల్లడికాలేదు. డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు జియో సేవలు కూడా అందించాలని రిలయన్స్ యోచిస్తోంది. వీటికి సంబంధించిన సెట్ అప్ బ్యాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్ అందించి నిరాంతరాయంగా హైస్పీడ్ ఇంటర్నెట్ కల్పించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా 4కే వీడియోలు వీక్షించే అవకాశం కలుగుతుంది. జియో టీవీ ద్వారా 360పైగా చానళ్లు (ఇందులో కనీసం 50 హెచ్ డీ చానళ్లు) వీక్షకులకు అందుబాటులో ఉంచనుంది. తమకు కావాల్సిన కార్యక్రమాలను జియో సర్వర్లతో సేవ్ చేసుకోవచ్చు. మాటలతో పనిచేసే రిమోట్ తో తమకు కావాల్సిన చానల్ మార్చుకోవచ్చు. అంతేకాదు కార్యక్రమం, కేటగిరి, నటీనటుల పేరు చెప్పి రిమోట్ ను ఆపరేట్ చేసే విధంగా ఫీచర్లు పొందుపరచనున్నట్టు తెలుస్తోంది.