మరో సంచలనానికి రిలయన్స్ రెడీ
ముంబై: జియో 4జీ మొబైల్ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీని కుదుపేసిన రిలయన్స్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తోంది. జియో టీవీతో ప్రస్తుతం ఉన్న డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ కంపెనీలకు షాక్ ఇవ్వనుంది.
హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ తో ఒక జీబీపీస్ వరకు ఇంటర్నెట్ అందించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల కేబుల్స్ వేసింది. పైలట్ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలను రిలయన్స్ అందిస్తోంది. అయితే ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందా, లేదా అనేది వెల్లడికాలేదు. డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు జియో సేవలు కూడా అందించాలని రిలయన్స్ యోచిస్తోంది. వీటికి సంబంధించిన సెట్ అప్ బ్యాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్ అందించి నిరాంతరాయంగా హైస్పీడ్ ఇంటర్నెట్ కల్పించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా 4కే వీడియోలు వీక్షించే అవకాశం కలుగుతుంది.
జియో టీవీ ద్వారా 360పైగా చానళ్లు (ఇందులో కనీసం 50 హెచ్ డీ చానళ్లు) వీక్షకులకు అందుబాటులో ఉంచనుంది. తమకు కావాల్సిన కార్యక్రమాలను జియో సర్వర్లతో సేవ్ చేసుకోవచ్చు. మాటలతో పనిచేసే రిమోట్ తో తమకు కావాల్సిన చానల్ మార్చుకోవచ్చు. అంతేకాదు కార్యక్రమం, కేటగిరి, నటీనటుల పేరు చెప్పి రిమోట్ ను ఆపరేట్ చేసే విధంగా ఫీచర్లు పొందుపరచనున్నట్టు తెలుస్తోంది.