టెల్కోలు పోర్టబిలిటీ నిబంధనలను అతిక్రమిస్తున్నాయి
రిలయన్స్ జియో ఆరోపణ
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు యూజర్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీని అడ్డుకుంటున్నాయని రిల యన్స్ జియో ఆరోపించింది. ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి సంస్థలు.. వారి కస్టమర్లు కొత్త నెట్‌వర్క్‌కి మారడానికి రిక్వెస్ట్‌లు పంపితే వాటిని అంగీకరించలేదని పేర్కొంది. ఇవి సెప్టెంబర్ 9 నుంచి 12 మధ్య కాలంలో పోర్టబిలిటీ కోసం చేసిన రిక్వెస్ట్‌లను తిరస్కరించాయని వివరించింది. ఇవి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల నుంచి వచ్చిన 4,919 రిక్వెస్ట్‌లకు అదనమని పేర్కొంది.
ఇలాంటి చర్యలు లెసైన్స్ నిబంధనలకు విరుద్ధమని తెలియజేసింది. టెల్కోలు లెసైన్స్ నిబంధనలను కచ్చితంగా అమలుచేసేలా చూడాలని ట్రాయ్‌ని కోరింది. ఈ మేరకు జియో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ట్రాయ్‌కి ఒక లేఖ రాసింది. టెల్కోలు నిబంధనలను అమలు చేయని పక్షంలో వాటి లెసైన్స్‌ను రద్దు చేయాలని తెలిపింది. అయితే ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలు ఈ అంశమై ఎలాంటి ప్రకటన చేయలేదు.