గ్యాస్ కనెక్షన్ ఇంకా రాని సమయంలో చిన్న సిలెండర్లు తీసుకుని, వాటిమీద వంట చేసుకోడం సర్వసాధారణమే. కానీ వాటిని అనధికారికంగా బయట కొనుక్కోవడం, రీఫిల్ చేయించుకోవడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు. ఇప్పుడు తొలిసారిగా ఐదు కిలోల సిలిండర్లను పెట్రోలు బంకుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచాలని చమురు మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ముందుగా మెట్రో నగరాల్లో దీన్ని అమలుచేస్తుంది.
దీంతోపాటు.. ఎల్పీజీ కనెక్షన్ పోర్టబులిటీ, కావాలంటే డీలర్లను మార్చుకోవడం లాంటివన్నీ ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. చమురు కంపెనీలు స్వయంగా నిర్వహించే పెట్రోలు బంకుల్లో మాత్రమే ఈ ఐదుకిలోల సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. ఇలాంటివి దేశం మొత్తమ్మీద కేవలం 47 వేల బంకులే ఉన్నాయి. అయితే.. వీటి ధర మాత్రం సబ్సిడీ ధర కంటే దాదాపు రెట్టింపు ఉండే మార్కెట్ రేటుకు మాత్రమే ఇస్తారు.
ఈనెల ఐదో తేదీన బెంగళూరులో ఈ ఐదు కిలోల సిలిండర్లను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రారంభిస్తారు.
ప్రాథమికంగా ఇవి కేవలం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాలకు మాత్రమే పరిమితం. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు కలిసి 1,440 బంకులను ఇందుకోసం ఎంచుకున్నాయి. ఒకచోట నుంచి మరోచోటుకు బదిలీలపై వెళ్లేవారు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఇలాంటివాళ్లకు ఉద్యోగ సమయాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్లకు గ్యాస్ సిలిండర్లు తీసుకోవడం కుదరదు. అలాంటివాళ్లకు ఇది వరంగా ఉటుందని భావిస్తున్నారు.
ఇక పెట్రోలు బంకుల్లో గ్యాస్ సిలిండర్లు!!
Published Wed, Oct 2 2013 3:48 PM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement