
న్యూఢిల్లీ: డీటీహెచ్ సంస్థలు తమ వినియోగదారులకు ఇచ్చే సెట్‌టాప్ బాక్సులు... ఒక ఆపరేటర్ నుంచి వేరొక ఆపరేటర్‌కు మారినా సరే ఉపయోగపడేటట్లు ఉండాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇలాంటి బాక్సులనే వినియోగదార్లకు ఇవ్వాల్సిందిగా కంపెనీలను ఆదేశించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది. అంటే వినియోగదారుడు ఆపరేటర్‌ను మార్చాలని భావించినా (డీటీహెచ్ పోర్టబిలిటీ) సెట్‌టాప్ బాక్సు మాత్రం మార్చాల్సిన పని ఉండదు.
ఈ సెట్‌టాప్ బాక్సులన్నీ యూఎస్‌బీ ఆధారిత కనెక్షన్‌తో పనిచేసేలా ఉండాలని కూడా ట్రాయ్ స్పష్టంచేసింది. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ మార్గదర్శకాలను సవరించాలని కూడా ట్రాయ్ సూచించింది. ఈ మార్పులను అమలు చేసేందుకు డీటీహెచ్ కంపెనీలకు 6 నెలల గడువివ్వాలని ట్రాయ్ పేర్కొంది. దీనికోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాయ్, భారత ప్రమాణాల సంస్థ(బీఎస్‌ఐ), టీవీ ఉత్పత్తిదారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖను కోరింది. ప్రతిపాదిత ప్రమాణాలను డీటీహెచ్, కేబుల్ టీవీ విభాగాలు అమలు చేస్తున్నదీ లేనిదీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment