- ఏపీలో ‘సాక్షి’ టీవీ ప్రసారాలు ఆపడంపై ‘ఎన్‌బీడీఏ’ ఆశ్చర్యం
- ఇది మీడియా స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమే
- కారణం లేకుండా ప్రసారాలు ఆపడం ట్రాయ్ రూల్స్‌కు విరుద్ధం
- మీడియా స్వతంత్రంగా పనిచేసుకునేలా చూడడం ప్రభుత్వ బాధ్యత
- కేబుల్ ఆపరేటర్లు వెంటనే తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంపై ‘బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్’ (ఎన్‌బీడీఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలనూ ఏపీలోని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిలిపివేయడానికి సరైన కారణాలు చూపకపోవడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని ఎన్‌బీడీఏ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌బీడీఏ సోమవారం(జూన్24) మీడియా ప్రకటన విడుదల చేసింది.
మీడియాతో పాటు ప్రజల ప్రయోజనాలకు భంగం..
ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేయడం వల్లనే ఆయా టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు చెబుతున్నారని, కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు తీసుకున్న ఈ చర్యలు బ్రాడ్‌కాస్టర్లు, మీడియా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ప్రకటించింది. కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆపడం ప్రమాదకరమైన సంకేతాలు పంపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..
ఛానెళ్లలో ఎలాంటివి ప్రసారం చేయాలన్నది బ్రాడ్‌కాస్టర్ల ఇష్టమన్నది రాజకీయ పార్టీలు గుర్తించాలని, మీడియా స్వేచ్ఛలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది. ఇతరుల జోక్యంతో మీడియా తన స్వతంత్రతను కోల్పోయే పరిస్థితి కల్పిస్తుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 19(1)(జీ)లను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది.
మీడియా స్వేచ్ఛపై ప్రభావం..
ఛానళ్లపై నిషేధం సరైన పద్ధతి కాదని,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేదని ఎన్‌బీడీఏ పునరుద్ఘాటించింది. ఏకపక్ష నిర్ణయాలు బ్రాడ్‌కాస్టర్ల వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తాయని, వ్యూయర్‌షిప్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇది చివరికి ఛానళ్ల రేటింగ్ తద్వారా ఆదాయంపైనా ప్రభావం చూపుతుందని వివరించింది.
ప్రభుత్వానిదే బాధ్యత..
దీర్ఘకాలంలో బ్రాడ్‌కాస్టర్లు, ప్రకటనకర్తల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు చర్యలు కారణమవుతాయని తెలిపింది. ఏపీలో మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించేలా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్‌బీడీఏ అభ్యర్థించింది. ఇతరుల జోక్యం ఏమాత్రం లేకుండా మీడియా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చూడాలని కోరింది.
సమాచారం పొందడం ప్రజల హక్కు..
ప్రజాస్వామ్య వ్యవస్థలో వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం పొందే హక్కు ప్రజల మౌలిక హక్కు అని, మీడియా నోరు నొక్కేందుకు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా వెంటనే అడ్డుకోవాలని సూచించింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కొందరు కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే సమీక్షించి ఘర్షణ పూర్వక పరిస్థితిని నివారించాలని ఎన్‌బీడీఏ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment