DTH operators
-
కేబుల్ బిల్లు కాస్తంత తగ్గుతుందా?
హడావుడిగా కేబుల్ టీవీ డిజిటైజేషన్ పూర్తిచేసిన టెలికం రెగ్యులేటరీ అథారిటీ క్రమంగా తప్పులు దిద్దుకుంటోంది. మొదట్లో బ్రాడ్ కాస్టర్లకు అత్యధిక మేలు చేసి, ఆ తరువాత క్రమంలో ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు లబ్ధిపొందగా నష్ట పోయింది కేబుల్ టీవీ వినియోగదారులే. డీటీహెచ్ వినియోగదారులు అప్పటికే డిజిటైజేషన్ పూర్తి చేసుకున్నారు గనుక బ్రాడ్ కాస్టర్లు పెంచిన బిల్లు తప్ప వాళ్ళ నెలవారీ బిల్లులు పెద్దగా ప్రభావితం కాలేదు. మొదట్లో ట్రాయ్ చేసిన తప్పు ఉచిత చానల్స్ సంఖ్య పరిమితం చేయటం. నెట్వర్క్ కెపాసిటీ ఫీజు రూ. 130 కింద 100 చానల్స్ ఇవ్వటం, అందులోనే దూరదర్శన్ చానల్స్ కూడా చేర్చటం. మరో ప్రధానమైన విమర్శ పే చానల్ ధరలు పెంచటం. బొకేలో పెట్టే చానల్స్ గరిష్ఠ చిల్లర ధర 19గా నిర్ణయించటమంటే, సగటున నెలకు బిల్లు 125 దాకా అదనంగా భరించాల్సి వచ్చింది. ఆ తరువాత కోర్టులో ట్రాయ్‌కి అనుకూలంగా తీర్పు వచ్చినా, మార్కెట్ శక్తుల వలన బ్రాడ్ కాస్టర్లు పోటీపడి ధరలు తగ్గిస్తారని ఆశించిన ట్రాయ్ భంగపడింది. ఎట్టకేలకు కొన్ని మార్పులతో 2020 జనవరి 1న రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటిం చింది. ఇందులో ప్రధానంగా రూ.130కి ఇచ్చే ఉచిత చానల్స్ సంఖ్యను 100 నుంచి 200కు పెంచటంతోబాటు వీటికి అద నంగా 26 ప్రసారభారతి చానల్స్ చేర్చాలని చెప్పటం. అదే సమయంలో వినియోగదారుడు తన నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న మొత్తం చానల్స్ కోరుకుంటే రూ.160 కే ఇచ్చి తీరాలి. ఇంకో ముఖ్యమైన సవరణ–అదనపు టీవీ సెట్లు ఉండేవారికి ఊరట కల్పించటం. మొదటి టీవీకి కట్టే రూ. 130 కనీస చార్జ్ కాగా, ఆ తరువాత ఎన్ని అదనపు టీవీలున్నా, 40% చొప్పున, అంటే రూ. 52 చెల్లిస్తే సరిపోతుంది. ఎలాగూ పే చానల్స్ ధరలు అదనం. ఇది కూడా ఎమ్మెస్వోలను, ముఖ్యంగా కేబుల్ ఆపరే టర్లను ఇబ్బంది పెట్టే విషయమే. అదే సమయంలో పే చానల్ చందాల విషయంలో రెండో టీవీకి తగ్గింపు ధర నిబంధన లేక పోవటం ద్వారా బ్రాడ్ కాస్టర్లను వదిలేశారని, ఇది అన్యాయమని అంటున్నారు.ఇక ట్రాయ్ చేసిన ప్రధానమైన సవరణ పే చానల్స్ ధరల నిర్ణయానికి సంబంధించినది. ఏ బ్రాడ్ కాస్టర్ అయినా, విడిగా తన చానల్ ధర నిర్ణయించుకోవాలనుకుంటే దానికి ఎలాంటి పరిమితి లేకపోయినా, ఒక బొకేలో పెట్టి తన చానల్స్‌ను తక్కువ ధరకు ఆశచూపి ఇవ్వాలనుకుంటే మాత్రం దాని గరిష్ఠ చిల్లర ధర ఇంతకుముందు 19 రూపాయలుంటే, ఇప్పుడు దాన్ని 12కు తగ్గించటం వలన కేబుల్ బిల్లులో 25 నుంచి 30 రూపాయల దాకా తప్పకుండా తగ్గే అవకాశముంది. టారిఫ్‌కు సంబంధించినంతవరకు ట్రాయ్‌కి అసలు ఆ అధికారమే లేదని బ్రాడ్కాస్టర్లు కోర్టుకెక్కారు. ఒక వస్తువు తయారీదారుడు తన వస్తువు ధరను నిర్ణయించుకునే అవకాశం ఉండటం సహజం అయినప్పుడు పే చానల్ ధరల నిర్ణయాధి కారం తమకే ఉండాలని వారు వాదించారు. అయితే, ఒక నియం త్రణా సంస్థ ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఇలాంటి చర్యలు తీసుకోవటాన్ని బొంబాయి హైకోర్ట్ సమర్థించింది. అయితే ధరల నియంత్రణ విషయంలో ట్రాయ్‌కి పూర్తి అను కూలమైన తీర్పు రాలేదనే చెప్పాలి. బొకేలో పెట్టదలచుకున్న చానల్ గరిష్ఠ చిల్లర ధర రూ. 19 నుంచి 12కు తగ్గించినా, బ్రాడ్ కాస్టర్లు రకరకాల విన్యాసాలతో బొకేలు తయారు చేయటం ఇంతకుముందు చూశారు గనుక ఈసారి కఠిన నిబంధనలు పెట్టాలని ట్రాయ్ నిర్ణయించుకుంది. అందుకే బొకేలు రూపొం దించటంలో బ్రాడ్ కాస్టర్లకు రెండు కఠినమైన నిబంధనలు పెట్టింది. మొదటిది– బొకేల మీద మితిమీరిన డిస్కౌంట్ ఇవ్వటం ద్వారా వినియోగదారులు బొకేలే తీసుకునేట్టు చేయటం ఇప్పటి దాకా నడిచింది. అందువలన ఇకమీదట 33% మించి డిస్కౌంట్ ఇవ్వకుండా కట్టుదిట్టం చేసింది. అప్పుడే బొకే ధరలు అదుపులో ఉంటాయి. అదే సమయంలో ఆ బొకేలో పెట్టే చానల్స్ చిల్లర ధరలు కూడా అదుపులో ఉంటాయి. బొకే నచ్చకపోతే అందులో కొన్ని చానల్స్ విడిగా తీసుకోవటం వినియోగదారునికి అనువుగా ఉంటుంది. ఈ షరతు సమంజసమేనని బొంబాయ్ హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇందుకు అనుగుణంగా బొకేలు తయారు చేయటానికి ఎన్ని రకాల కసరత్తు చేసినా, ఇప్పటిదాకా వస్తున్న ఆదాయంలో కనీసం 20% గండిపడే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఒక్కో బ్రాడ్ కాస్టర్‌కు ఒక్కో రకంగా ఉండవచ్చు. స్టార్ గ్రూప్ ఎక్కువగా నష్టపోతుం దని ఇప్పటిదాకా ఉన్న బొకేలు గమనిస్తే సులభంగా అర్థమవు తుంది. ఏమంత నష్టం జరగనిది సన్ గ్రూప్‌కి కాగా, జీ గ్రూప్‌కి నామమాత్రంగా నష్టం జరగవచ్చు.ఇక రెండో షరతు విషయానికొస్తే, బొకేలో ఉండే చానల్స్ విడి ధరలు ఆ బొకేలోని మొత్తం సగటులో మూడురెట్లకంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక పెద్ద చానల్‌తో అనేక చిన్నా చితకా చానల్స్ కలిపి అంటగట్టటానికి వీల్లేదు. కానీ ఈ షరతును బొంబాయి హైకోర్ట్ తోసిపుచ్చింది. దీనివలన మరింత కట్టడికి వీలయ్యేది గానీ ఇది కొట్టివేయటం వలన బ్రాడ్ కాస్టర్లకు కొంతమేర ఊరట కలుగుతుంది. మొత్తంగా చూసినప్పుడు ట్రాయ్ సవరించిన కొత్త టారిఫ్ ఆర్డర్ వలన చందాదారులకు సగటున 30 రూపాయల లబ్ధి కలుగుతుంది. కోరుకున్న చానల్స్‌ను బొకేలో కాకుండా విడివిడిగా ఎంచుకునే సౌకర్యం మెరుగుపడుతుంది. ఒకసారి చానల్స్ బొకేలు ప్రకటిస్తే అప్పుడు చందాదారులు తమ హక్కు వినియో గించుకుంటూ లాభపడే అవకాశం కలుగుతుంది. ఇలా ధరలు ప్రకటించటానికి కోర్టు ఆరు వారాల సమయం ఇచ్చిందిగనుక ఆ లోపు బ్రాడ్ కాస్టర్లు సాధ్యమైనంతవరకు లాభాలలో కోతపడ కుండా ఉండే బొకేలు తయారు చేస్తారు. సామాన్యులకు ఈ బొకేలు,అ– లా–కార్టే చానల్స్ ధర నుంచి తమకు ఉపయోగకరమైన విధంగా, బిల్లు తగ్గించుకునే విధంగా ఎంచుకోవటం తెలియదు కాబట్టి ఎమ్మెస్వోలు స్వయంగా స్థానిక ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా బొకేలు తయారుచేసి సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటారు. కాకపోతే, బ్రాడ్కాస్టర్లు ఎప్పటిలాగే ఆ బొకేలలో తమ చానల్స్ కలిపేలా రకరకాల తాయిలాలతో ఎమ్మెస్వోలను ఆకట్టుకోరన్న గ్యారంటీ ఏమీలేదు. చందాదారుడు అంతకంటే తెలివిగా ఉంటేనే ట్రాయ్ సవరణలతో మరింత లబ్ధిపొందుతాడు. తోట భావనారాయణ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించొద్దు..
న్యూఢిల్లీ : దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సమచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలివిజన్ బ్రాడ్కాస్టర్స్కు, డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లకు కీలక సూచనలు చేసింది. వీక్షకులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కష్ట సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా టెలివిజన్ ప్రసారాలు అందించాలని కోరింది. ఈ మేరకు బ్రాడకస్టర్స్కు, డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, ఎమ్‌ఎస్‌వోలకు, లోకల్ కేబుల్ ఆపరేటర్స్‌కు ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. చందదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రసారాలు అందేలా చూడాలని ఆ లేఖలో కోరింది. ఈ కష్ట సమయంలో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని తెలిపింది. ఇలా చేయడం ద్వారా కరోనాకు సంబంధించిన వార్తలను, ప్రస్తుత పరిస్థితులను ప్రజలు నిరంతరం తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని సదరు మంతిత్వ శాఖ భావిస్తోంది. చదవండి : లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్ కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు -
ఏ ఆపరేటర్‌కైనా అదే సెట్‌టాప్ బాక్సు
న్యూఢిల్లీ: డీటీహెచ్ సంస్థలు తమ వినియోగదారులకు ఇచ్చే సెట్‌టాప్ బాక్సులు... ఒక ఆపరేటర్ నుంచి వేరొక ఆపరేటర్‌కు మారినా సరే ఉపయోగపడేటట్లు ఉండాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇలాంటి బాక్సులనే వినియోగదార్లకు ఇవ్వాల్సిందిగా కంపెనీలను ఆదేశించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది. అంటే వినియోగదారుడు ఆపరేటర్‌ను మార్చాలని భావించినా (డీటీహెచ్ పోర్టబిలిటీ) సెట్‌టాప్ బాక్సు మాత్రం మార్చాల్సిన పని ఉండదు. ఈ సెట్‌టాప్ బాక్సులన్నీ యూఎస్బీ ఆధారిత కనెక్షన్‌తో పనిచేసేలా ఉండాలని కూడా ట్రాయ్ స్పష్టంచేసింది. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ మార్గదర్శకాలను సవరించాలని కూడా ట్రాయ్ సూచించింది. ఈ మార్పులను అమలు చేసేందుకు డీటీహెచ్ కంపెనీలకు 6 నెలల గడువివ్వాలని ట్రాయ్ పేర్కొంది. దీనికోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాయ్, భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ), టీవీ ఉత్పత్తిదారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖను కోరింది. ప్రతిపాదిత ప్రమాణాలను డీటీహెచ్, కేబుల్ టీవీ విభాగాలు అమలు చేస్తున్నదీ లేనిదీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. -
కేబిల్లు గుభేలు..!
‘మీరు వినియోగిస్తున్న కేబుల్ ప్యాకేజీ మారింది. ఇదివరకున్న బేసిక్ ప్యాకేజీని బెస్ట్ ఫిట్ ప్యాక్‌లోకి మార్చాము. ట్రాయ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.’–ఓ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కస్టమర్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ సారాంశమిది. వాస్తవానికి ఈనెలాఖరు వరకు కస్టమర్ ఎంపిక చేసుకున్న ప్యాకేజీ అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. కానీ కేబుల్ ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు అత్యుత్సాహం చూపుతూ చానళ్లను తొలగిస్తున్నారు. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఎంఎస్లు పంపుతుండగా, కేబుల్ ఆపరేటర్లు సమాచారం ఇవ్వకుండానే చానళ్లకు కోత పెడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: కేబుల్ చానల్ వినియోగదారులకు ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు చుక్కలు చూపిస్తున్నారు. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు ఒక్కసారిగా మార్చేస్తున్నారు. ట్రాయ్ సూచనలంటూ పలు చానెళ్లకు కోతపెడుతున్నారు. సాధారణంగా వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని మధ్యలో మార్చే వీలుండదు. ఎందుకంటే ఎంపిక చేసుకున్న ప్యాకేజీకి బిల్లును చెల్లించేయడంతో గడువు ముగిసే వరకు సేవలందించాలి. కేబుల్ చానళ్ల విషయంలో ట్రాయ్ సూచనలు చేసిన నేపథ్యంలో ఆపరేటర్లు, ప్రొవైడర్లు ఒక్కసారిగా తమ పంథాను మార్చేసుకున్నారు. వినియోగదారున్ని సంప్రదించకుండానే ప్యాకేజీలు మార్చేయడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంటోంది. వాస్తవానికి మార్చి 31వరకు చానళ్ల ఎంపికకు గడువున్నప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తున్న ఆపరేటర్లు, ప్రొవైడర్లు చానళ్లను కట్ చేస్తున్నారు. డిమాండ్ ఉన్న చానళ్లకు కత్తెర రాష్ట్రంలో ఎక్కువ మంది తెలుగు చానళ్లు చూస్తుంటారు. హిందీ, ఇంగ్లీష్ చానళ్లకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వినియోగదారులున్నప్పటికీ... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తెలుగు చానళ్లకే ఎక్కువ వీక్షకులున్నారు. తాజాగా ట్రాయ్ సూచనలు సాకుగా చూపుతున్న ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు కీలకమైన చానళ్లకు కోత పెట్టేశారు. రాష్ట్రంలో దాదాపు 85శాతం వినియోగదారులు ఈ సమస్యతో లబోదిబోమంటున్నారు. ఈమేరకు డీటీహెచ్ ఆపరేటర్లు వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపిస్తుండగా, కేబుల్ ఆపరేటర్లు మాత్రం అలాంటి సమాచారం ఇవ్వకుండానే కోత పెడుతున్నారు. తెలుగు చానళ్లతోపాటు కిడ్స్ చానళ్లు, న్యూస్ చానళ్లు కోత పడుతున్న కేటగిరీలో ఉన్నాయి. భారంగా కొత్త ప్యాకేజీ చానళ్ల కోతపై ఆపరేటర్లను ప్రశ్నిస్తే కొత్త ప్యాకేజీలోకి మారాలని సూచిస్తు న్నారు. దీంతో కొత్త ప్యాకేజీలోకి మారేందుకు ప్రయత్నిస్తే వినియోగదారుడు ఖంగుతినే పరిస్థితి వస్తోంది. కేబుల్ ఆపరేటర్లు అందిస్తున్న బేసిక్ ప్యాకేజీ కనిష్ట ధర రూ.230గా ఉంది. ఇందులో కేవలం 100 చానళ్లు మాత్రమే వచ్చినా... ఇందులో అన్ని తెలుగు చానళ్లు ప్రసారం కావు. పూర్తిస్థాయి తెలుగు చానళ్లు కావాలనుకుంటే రూ.350, న్యూస్ చానళ్లు కావాలనుకుంటే రూ.410, పిల్లలు చూసే కిడ్స్ చానళ్లు కావాలనుకుంటే రూ.450లోకి మారాల్సి వస్తుంది. ఇప్పటివరకు కేబుల్ ఆపరేటర్లకు నెలవారీగా రూ.150 నుంచి రూ.200 చొప్పున చెల్లిస్తున్న వినియోగదారులు... ఇకపై రూ.450 చెల్లించాల్సిందే. అతి తక్కువ ప్యాకేజీలో 163 చానళ్లు వస్తుండగా... ఇందులో వందకుపైగా చానళ్లుఇతర ప్రాంతీయ భాషలకు సంబం ధించినవి. దీంతో అవసరం లేకున్నా అధిక మొత్తంలో బిల్లు వసూలు చేసేందుకు ఆపరేటర్లు, ప్రొవైడర్లు ఒత్తిడి తీసుకువస్తున్నారు. -
కప్.. కప్.. హుర్రే!
క్రికెట్ వరల్డ్ కప్ సీజన్‌పై టీవీ, డీటీహెచ్ కంపెనీల కన్ను * సొమ్ము చేసుకునే ప్రణాళికలు * పోటాపోటీ ఆఫర్లకు రెడీ..! న్యూఢిల్లీ: డీటీహెచ్ ఆపరేటర్లు, టీవీ తయారీ సంస్థలు దాదాపు 45 రోజులు జరగనున్న (ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు) క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ సందర్భంగా కస్టమర్లను ఆకర్షించటానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. వివిధ ఆఫర్లతో ఎలాగైనా అమ్మకాలను పెంచుకోటానికి సన్నద్ధమౌతున్నాయి. పానాసోనిక్, ఎల్జీ వంటి ఎలక్ట్రానిక్ కంపెనీలతోపాటు డిష్ టీవీ, టాటా స్కై, వంటి డీటీహెచ్ ఆపరేటర్లు వారి వారి వ్యాపారంపై ధీమాగా ఉన్నారు. ‘ఆటపై కస్టమర్ల ఉత్సాహం, మా కంపెనీ ఉత్పత్తులపై వారికి ఉన్న విశ్వా సంతో ఈ టోర్నమెంట్ సీజన్ లో కంపెనీ ఉత్పత్తుల విక్రయాల్లో దాదాపు 25 నుంచి 30 శాతం వృద్ధిని నమోదు చేస్తాం’ అని పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్ డెరైక్టర్ మనీష్ శర్మ అన్నారు. ఫ్రీ ఆడియో ఉత్పత్తులు, స్క్రాచ్ కార్డులు, క్యాష్ బ్యాక్, తదితర ఆఫర్లతో ఎల్జీ కస్టమర్లను ఆకర్షించనుంది. ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా కస్టమర్లకు దగ్గరవ్వటానికి వరల్డ్ కప్ సీజన్ మాకు చాలా దోహదపడుతుంది. వారికోసం వివిధ ఆఫర్లను తీసుకొస్తున్నాం’ అని ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ సంజయ్ చిత్కారా చెప్పారు. కంపెనీ ఈ ఏడాది హై ఎండ్ ఆల్ట్రా హెచ్డీ, ఓలెడ్ టీవీ శ్రేణుల్లో అధిక వృద్ధికి ప్రణాళికల్ని రచించిందని తెలిపారు. ‘రీప్లేస్మెంట్’పై ఎల్జీ, పానాసోనిక్ దృష్టి ఎల్జీ, పానాసోనిక్ కంపెనీలు రీప్లేస్మెంట్ మార్కెట్‌పై కూడా కన్నేశాయి. ‘రీప్లేస్మెంట్ మార్కెట్లో 12-15% వృద్ధి ఉంటుందని భావిస్తున్నాం. ఈ టోర్నమెంట్ సీజన్ లో 24 అంగుళాలు నుంచి 32 అంగుళాల సెగ్మెంట్లో పానాసోనిక్ 25% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని శర్మ చెప్పారు. 5 పట్టణాల ట్రోఫీ టూర్, సంతకపు బ్యాట్ ప్రచారం, తదితర వాటితో ఎల్జీ తన టీవీ అమ్మకాల్లో వృద్ధిని నమోదుచేయాలని ప్రయత్నిస్తోంది. తాము ప్రకటించబోయే వివిధ ఆఫర్లతోపాటు ఎల్జీ టీవీలను కొనుగోలు చేయటం ద్వారా వచ్చే ప్రయోజనాలను కస్టమర్లకు తెలియజేయటానికి టీవీ, ప్రింట్ ప్రచారాలు చాలా దోహదపడతాయని చిత్కారా చెప్పారు. అమ్మకాల వృద్ధికి డీటీహెచ్ ఆపరేటర్ల ప్రణాళిక ఈ టోర్నమెంట్ సీజన్లో తమ వ్యాపారాన్ని పెంచుకోటానికి డిష్ టీవీ, టాటా స్కై వంటి డీటీహెచ్ ఆపరేటర్లు కూడా వివిధ ప్రత్యేక ఆఫర్లతో ముందుకురానున్నాయి. ‘ఎప్పుడూ కూడా వరల్డ్ కప్ వంటి అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ సీజన్లో కొనుగోళ్లలో అధిక వృద్ధి ఉంటుంది. ఇతర కంపెనీల పోటీ కారణంగా మాకు గరిష్ట హెచ్డీ, స్పోర్ట్ చానళ్లను వినియోగదారులకు అందించే ప్రయోజనం కలిగింది’ అని డిష్ టీవీ సీఓఓ సలిల్ కపూర్ అన్నారు. హెచ్డీని ప్రోత్సహించటానికి తగిన ప్రణాళికల్ని రచిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్ సమయంలో 4కే సెట్-టాప్ బాక్స్‌తో తమ అమ్మకాలను పెంచుకోవాలని టాటా స్కై భావిస్తోంది. ఈ బాక్స్‌తో టీవీలో స్పష్టమైన చిత్రాలను చూడవచ్చు.