‘మీరు వినియోగిస్తున్న కేబుల్ ప్యాకేజీ మారింది. ఇదివరకున్న బేసిక్ ప్యాకేజీని బెస్ట్ ఫిట్ ప్యాక్‌లోకి మార్చాము. ట్రాయ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.’–ఓ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కస్టమర్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్ సారాంశమిది.
వాస్తవానికి ఈనెలాఖరు వరకు కస్టమర్ ఎంపిక చేసుకున్న ప్యాకేజీ అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. కానీ కేబుల్ ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు అత్యుత్సాహం చూపుతూ చానళ్లను తొలగిస్తున్నారు. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు ఎస్‌ఎంఎస్‌లు పంపుతుండగా, కేబుల్ ఆపరేటర్లు సమాచారం ఇవ్వకుండానే చానళ్లకు కోత పెడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: కేబుల్ చానల్ వినియోగదారులకు ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు చుక్కలు చూపిస్తున్నారు. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు ఒక్కసారిగా మార్చేస్తున్నారు. ట్రాయ్ సూచనలంటూ పలు చానెళ్లకు కోతపెడుతున్నారు. సాధారణంగా వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని మధ్యలో మార్చే వీలుండదు. ఎందుకంటే ఎంపిక చేసుకున్న ప్యాకేజీకి బిల్లును చెల్లించేయడంతో గడువు ముగిసే వరకు సేవలందించాలి. కేబుల్ చానళ్ల విషయంలో ట్రాయ్ సూచనలు చేసిన నేపథ్యంలో ఆపరేటర్లు, ప్రొవైడర్లు ఒక్కసారిగా తమ పంథాను మార్చేసుకున్నారు. వినియోగదారున్ని సంప్రదించకుండానే ప్యాకేజీలు మార్చేయడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంటోంది. వాస్తవానికి మార్చి 31వరకు చానళ్ల ఎంపికకు గడువున్నప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తున్న ఆపరేటర్లు, ప్రొవైడర్లు చానళ్లను కట్ చేస్తున్నారు.
డిమాండ్ ఉన్న చానళ్లకు కత్తెర
రాష్ట్రంలో ఎక్కువ మంది తెలుగు చానళ్లు చూస్తుంటారు. హిందీ, ఇంగ్లీష్ చానళ్లకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వినియోగదారులున్నప్పటికీ... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తెలుగు చానళ్లకే ఎక్కువ వీక్షకులున్నారు. తాజాగా ట్రాయ్ సూచనలు సాకుగా చూపుతున్న ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు కీలకమైన చానళ్లకు కోత పెట్టేశారు. రాష్ట్రంలో దాదాపు 85శాతం వినియోగదారులు ఈ సమస్యతో లబోదిబోమంటున్నారు. ఈమేరకు డీటీహెచ్ ఆపరేటర్లు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తుండగా, కేబుల్ ఆపరేటర్లు మాత్రం అలాంటి సమాచారం ఇవ్వకుండానే కోత పెడుతున్నారు. తెలుగు చానళ్లతోపాటు కిడ్స్ చానళ్లు, న్యూస్ చానళ్లు కోత పడుతున్న కేటగిరీలో ఉన్నాయి.
భారంగా కొత్త ప్యాకేజీ
చానళ్ల కోతపై ఆపరేటర్లను ప్రశ్నిస్తే కొత్త ప్యాకేజీలోకి మారాలని సూచిస్తు న్నారు. దీంతో కొత్త ప్యాకేజీలోకి మారేందుకు ప్రయత్నిస్తే వినియోగదారుడు ఖంగుతినే పరిస్థితి వస్తోంది. కేబుల్ ఆపరేటర్లు అందిస్తున్న బేసిక్ ప్యాకేజీ కనిష్ట ధర రూ.230గా ఉంది. ఇందులో కేవలం 100 చానళ్లు మాత్రమే వచ్చినా... ఇందులో అన్ని తెలుగు చానళ్లు ప్రసారం కావు. పూర్తిస్థాయి తెలుగు చానళ్లు కావాలనుకుంటే రూ.350, న్యూస్ చానళ్లు కావాలనుకుంటే రూ.410, పిల్లలు చూసే కిడ్స్ చానళ్లు కావాలనుకుంటే రూ.450లోకి మారాల్సి వస్తుంది. ఇప్పటివరకు కేబుల్ ఆపరేటర్లకు నెలవారీగా రూ.150 నుంచి రూ.200 చొప్పున చెల్లిస్తున్న వినియోగదారులు... ఇకపై రూ.450 చెల్లించాల్సిందే. అతి తక్కువ ప్యాకేజీలో 163 చానళ్లు వస్తుండగా... ఇందులో వందకుపైగా చానళ్లుఇతర ప్రాంతీయ భాషలకు సంబం ధించినవి. దీంతో అవసరం లేకున్నా అధిక మొత్తంలో బిల్లు వసూలు చేసేందుకు ఆపరేటర్లు, ప్రొవైడర్లు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment