బండ దోపిడీ | Gas companies do not proide home delivery of cylinders | Sakshi
Sakshi News home page

బండ దోపిడీ

Published Wed, Mar 11 2015 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

Gas companies do not proide home delivery of cylinders

ఏలూరు (టూటౌన్) :జిల్లాలోని వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను దోచేస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అయినకాడికి దండుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఏజెన్సీల అక్రమార్జన మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది. జిల్లాలో 57 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 8  లక్షల 19వేల 568 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో లక్షా 45 వేలు డ్వాక్రా మహిళలకు సంబంధించినవి. వీరందరికీ ఒకే గ్యాస్ బండ ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీలు తమ వినియోగదారులకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా డోర్ డెలివరీ చేయాల్సి ఉంది. అది దాటితే 30 కిలోమీటర్ల లోపు 10 రూపాయలు, అది కూడా దాటితే 15 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.
 
 కానీ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం ఒక్కొక్క వినియోగదారుడి నుంచి రూ. 50 నుంచి రూ. వంద వరకూ వసూలు చేస్తున్నారు. కొన్ని ఏజెన్సీలైతే వినియోగదారులను తమ వద్దకే వచ్చి గ్యాస్ బండ తీసుకోవాలని నిబంధన పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల గ్యాస్ బుక్ చేసిన ప్పటికీ కంప్యూటర్స్ పనిచేయటం లేదని చెప్పి సకాలంలో గ్యాస్‌ను సరఫరా  చేయడం లేదు. దీంతో వినియోగదారుడు తన అవసరం కొద్దీ అదనంగా సొమ్ము చెల్లించి గ్యాస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డ్వాక్రా గ్రూపులకు గ్యాస్ సరఫరా చేసే ఏలూరుకు చెందిన ఒక గ్యాస్ ఏజెన్సీ బాగా ఇబ్బంది పెడుతోందని ఆరోపణలున్నాయి. ఈ ఏజెన్సీ పరిధిలో సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలంటే ఆటోడ్రైవర్లకు అదనపు సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. లేకపోతే రెండు నెలలకు కూడా గ్యాస్ పంపిణీ చేయటం లేదు. అదేమని మహిళలు అడిగితే మీ గ్యాస్ కనెక్షన్ తిరిగి రెగ్యులర్ చేసుకోవాలని, మీ వివరాలు విశాఖపట్నంలోని ఐఓసీకి పంపి కొత్తగా అనుమతి తెచ్చుకోవలసి ఉంటుందని చెప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోకపోవటంతో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల్ని పీడిస్తున్నాయి.
 
 అక్రమ మార్గంలో వినియోగం
 గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ బండలను కొంతమంది వ్యాపారులు, హోటల్స్ యజమానులు తమ ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వ్యాపారులకు ఎక్కువకు అమ్ముకుని డ్వాక్రా మహిళలను, గృహ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వినియోగదారులకు సంవత్సరానికి 12 గ్యాస్ బండలు ఇవ్వాలన్నది నిబంధన కాగా, చాలా ఏజెన్సీలు గ్రామీణ ప్రాంతాలలో 6 నుంచి 8 బండలను మాత్రమే అందిస్తున్నాయి. మిగిలినవి అడ్డదారిలో అమ్ముకుంటున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గ్యాస్ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో ఆధార్‌కు అనుసంధానం చేయకపోవటమే. నిబంధనల మేరకు గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
 
 సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం
 డ్వాక్రా మహిళలకు, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సమయంలో అక్రమంగా వసూళ్లకు పాల్పడితే వాహనాలను ఆపి మాకు సమాచారం అందించాలి. అలా చేసిన వారి ఏజెన్సీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం త్వరలో గ్యాస్ పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్లు వేరే కంపెనీకి మార్చుకోవటంతో పాటు, కావలసిన ఏజెన్సీకి మార్చుకోవచ్చు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ను వ్యాపారులు వినియోగిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ప్రజలు మాకు సమాచారం అందించాలి.
 -  డి. శివశంకర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement