కదిరి, న్యూస్‌లైన్: గ్యాస్ బండ కావాలంటే ఇకపై కచ్చితంగా మీకు సెల్‌ఫోన్ ఉండాల్సిందే. ఎందుకంటే మీ సెల్ ఫోన్ ద్వారా బుక్ చేస్తేనే మీకు గ్యాస్ బండ కావాలన్న విషయం ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. మీ మిత్రులు, ఇరుగు పొరుగు వారు, బంధువుల సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేద్దామన్నా ఆన్‌లైన్ అంగీకరించదు. గ్యాస్ ఏజెన్సీల్లో ‘ఇంటర్ వాయిస్ రికార్డింగ్ సర్వీస్(ఐవీఆర్‌ఎస్) విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో గ్యాస్ వినియోగదారులు సతమతమవుతుంటే మళ్లీ ఇంకొకటొచ్చి పడింది. చమురు సంస్థలు తీసుకున్న ఈ కొత్త విధానంతో నిరక్షరాస్యులు, ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారు, సొంతంగా సెల్‌ఫోన్ లేనివారికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్‌లున్నాయి. వీటిలో 1.30 లక్షలు దీపం కనెక్షన్‌లున్నాయి. భారత్, హెచ్‌పీ గ్యాస్ గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే ఆన్‌లైన్ విధానం ద్వారా గ్యాస్ నమోదు చేసుకుంటున్నారు. ఈ విధానంపై అవగాహన ఉన్నవారేమో మంచిదంటుంటే అందరికీ ఆన్‌లైన్‌పై అవ గాహన ఉండాలి కదా? అని మెజార్టీ ప్రజలు అంటున్నారు. అందుకే ఇలాంటి వారంతా నేరుగా గ్యాస్ ఏజెన్సీల చెంతకెళ్లి గ్యాస్ బండ కావాలని నమోదు చేయించుకుంటున్నారు. ఇకపై అలా ఉండదు. ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్ ద్వారానే గ్యాస్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది.
సెల్‌ఫోన్ లేనివారు, ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారితో పాటు తరచుగా సెల్ నెంబర్లు మార్చేవారికి కూడా ఐవీఆర్‌ఎస్ విధానంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఎందుకంటే కొత్త సెల్ నెంబర్ తీసుకున్న విషయం గ్యాస్ ఏజెన్సీ వారికి తెలియజేస్తూ తమ కస్టమర్ వివరాల్లో మార్పు చేయించాలి. ఒక సెల్ నెంబర్‌తో ఒకే కనెక్షన్‌కు మాత్రమే అనుసంధానం చేస్తారు. జనవరి ఒకటో తేదీ నుండి అందరూ ఆన్‌లైన్ ద్వారానే అదీ మీ సెల్ నెంబర్ ద్వారానే గ్యాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇకపై గ్యాస్ బండకు సెల్‌ఫోన్‌కు లింక్ ఉందన్నమాట. ఐవీఆర్‌ఎస్ విధానంతో గ్యాస్ అక్రమాలను అరికట్టవచ్చని సివిల్ సప్లయస్ అధికారులంటున్నారు.
గ్యాస్ బండకు సెల్‌ఫోన్‌కు లింకుంది!
Published Thu, Dec 26 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement