మళ్లీ వంట గ్యాస్ కొరత!
బిల్లు జనరేట్ ఆ తర్వాత రద్దు
రెండు సార్లు బుకింగ్ చేస్తేనే..
గ్యాస్ ఏజెన్సీల చేతివాటమా..?
డెలివరీకి కనీసం 20 రోజులు
నగరంలోని సైదాబాద్‌కు చెందిన హుస్సేన్ అనే వినియోగదారుడు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 2న తన ఎల్పీజీ రీఫిల్‌ను బుకింగ్ చేసుకున్నాడు. 10వ తేదీన బిల్లు జనరేట్ జరిగి త్వరలో రీఫిల్ డెలివరీ కానున్నట్లు మొబైల్‌కు మేస్‌జ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోగా, బుకింగ్ రద్దయినట్లు... తిరిగి బుక్ చేసుకోమని మరో మేసెజ్ చేరింది. మళ్లీ బుక్ చేస్తే వారం తర్వాత బిల్లు జనరేట్ ఆయినట్లు త్వరగా డెలివరీ జరగనున్నట్లు మొబైల్‌కు సమాచారం వచ్చినా.. సిలిండర్ మాత్రం రాలేదు. ఇది గ్రేటర్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇక్కట్లకు నిదర్శనం..
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఆన్‌లైన్‌లో రెండు సార్లు బుకింగ్ చేస్తే కానీ.. సిలిండర్ ఇంటికి చేరే పరిస్థితి కన్పించడంలేదు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల చేతివాటమో.. లేక డెలివరీ బాయ్స్ జమ్మిక్కులో తెలియడం లేదు. అయితే డోర్ లాక్ లేకున్నా వంట గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరేసరికి కనీసం 20 రోజులు పడుతుంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు నగదు బదిలీ పథకంలో చేరిన వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీపై సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ పైన సిలిండర్లకు సంబందించిన సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ కాదు. ఆయితే ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుండటంతో గత రెండు నెలలుగా బిల్లు జనరేట్ తర్వాత బుకింగ్ అటోమెటిక్‌గా రద్దు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా వంట గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ కనెక్షన్ల పరిస్థితి..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 29.18 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, హైదరాబాద్ పరిధిలోనిలోని 13.22 లక్ష లు, రంగారెడి జిల్లా పరిధిలో 15.96 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. మొత్తంమీద గ్యాస్ ఏజెన్సీలు 115 ఉండగా, ప్రతిరోజు 80 వేల నుంచి లక్షల మంది వినియోగదారుల వరకు గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. డెలివరీ సైతం ప్రతిరోజు 60 వేలకు తగ్గకుండా సరఫరా ఉంటుందని ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.. తాజాగా బుకింగ్ రద్దు వ్యవహారంతో కనీసం 40 వేల వరకు కూడా సిలిండర్ డెలివరీ కానట్లు సమాచారం.