గ్యాస్‌కు ఆధార్ గుదిబండ | Aadhaar gas clogging | Sakshi
Sakshi News home page

గ్యాస్‌కు ఆధార్ గుదిబండ

Published Sat, Mar 21 2015 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

Aadhaar gas clogging

సాక్షి, ప్రతినిధి, నెల్లూరు : సంక్షేమ పథకాలకు కోతపెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. వంటగ్యాస్‌పై రాయితీని తగ్గించుకునేందుకు కేంద్రం ఆధార్ అనుసంధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గ్యాస్‌పై రాయితీ పొందాలంటే ఈనెల 31వ తేదీలోపు లబ్ధిదారులు ఆధార్ నంబరును అనుంధానం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. గ్యాస్ ఏజెన్సీల్లో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకోకుంటే వచ్చేనెల నుంచి సిలిండర్‌పై నగదు బదిలీ వర్తించదని తేల్చి చెప్పింది. ఓవైపు సుప్రీంకోర్టు సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. గ్యాస్ నిర్వాహకులు సిలిండర్ రాయితీపై ఆంక్షలు సడలించలేదు. దీంతో గ్యాస్ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
 
అనుసంధానం చేయాల్సిందే

జిల్లావ్యాప్తంగా మొత్తం 4,76,920 మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు. భారత్, ఎచ్‌పీ, ఇండియన్ గ్యాస్ కంపెనీల నుంచి లబ్ధిదారులు కనెక్షన్లు పొంది ఉన్నారు. ఈ గ్యాస్ సరఫరా మొత్తం 52 మంది డీలర్ల నుంచి పంపిణీ జరుగుతోంది. అయితే 3,93,712 మంది లబ్ధిదారులు ఆధార్ నంబరు అనుసంధానం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 83,212 మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది.

అయితే అనధికారికంగా లక్షమందికిపైగా ఉన్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అందించే ప్రతి సిలిండర్‌కు కేంద్రం రాయితీ ఇస్తుంది. కంపెనీ ధర ప్రకారం సిలిండర్‌కు రూ.860లు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం రాయితీ మీద రూ.472లకే అందజేస్తున్న విషయం తెలిసిందే. గ్యాస్ పథకానికి కేంద్రం ఆధార్ అనుసంధానం చేసి లబ్ధిదారుని ఖాతాకే నేరుగా రాయితీ నగదును బదీలీ చేసే విధం గా చర్యలు చేపట్టింది. ఇందుకుగాను లబ్ధిదారుడు ఆయా ఏజెన్సీల్లో ఆధార్‌తో పాటు బ్యాంకు ఖాతా నంబర్‌ను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
 
ఆధార్ అనుంధానానికి 31 గడువు
గ్యాస్ లబ్ధిదారులు ఆధార్ అనుంధానానికి ఈనెల 31 చివరి గడువుగా విధించారు. అందులో భాగంగా లీడ్ బ్యాంక్ మేనేజనర్ డి వెంకటేశ్వరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు తప్పనిసరిగా నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయునున్నట్లు తెలిపారు. ఆధార్ అనుంధానం చేసుకోని లబ్ధిదారులు సిలిండర్‌కు మొత్తం ధర ను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీని నగదు బదిలీ పథకం ద్వారా ఖాతాకు జమ చేస్తున్నట్లు వెల్లడించారు.

లీడ్ బ్యాంక్ మేనేజర్ చెప్పిన విధంగా.. లబ్ధిదారుడు ముందు సిలిండర్‌కు సంబంధించి మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకోని వారు, ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నా.. నంబర్ రాని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన డీలర్లు మాత్రం ఆధార్ నంబరు అనుసంధానం చేయకుంటే నగదు బదిలీ పథకం వర్తించదని తెగేసి చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఆధార్ లేని లక్షమందికి వచ్చేనెల నుంచి వంటగ్యాస్ రాయితీ వర్తించదని అధికారులు తేల్చిచెబుతున్నారు. లక్షమందికి వచ్చేనెల నుంచి ఒకరికి రూ.388 చొప్పున మొత్తం రూ.3.88 కోట్లు అదనపు భారం పడనుంది.
 
సుప్రీం ఆదేశాలుకు బేఖాతర్
సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేస్తూ సంక్షేమ పథకాలకు ఆధార్ లింకును ముడిపెడుతున్నాయి. దీంతో ఆయా లబ్ధిదారులు ఆధార్ లింకుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పేద, మధ్య తరగతికి చెందిన వర్గాలు మాత్రమే ఆధార్‌కార్డు అనుసంధానంలో వెనుకబడినట్లు తెలుస్తుంది. వీరందరిపై వచ్చేనెల నుంచి వంటగ్యాస్‌కు భారం పడనుంది. వంటగ్యాస్‌కు ఆధార్ నెంబరు ముడిపెట్టడంపై ఆయ వర్గాలకు చెందిన ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement