
గుదిబండ
పట్టణంలోని రామకృష్ణాపురం కాలనీ.. గ్యాస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది.
గ్యాస్ బండలు వినియోగదారుల పాలిట గుదిబండల్లా మారుతున్నాయి. సిలిండర్ డెలివరీ చేసినందుకు 15 కిలోమీటర్ల మేరకు ఏజెన్సీలకు వినియోగదారులు రూపాయి కూడా చెల్లించాల్సినఅవసరంలేదు.. దీనిని దాచిపెట్టి ఏజెన్సీలు వినియోగదారుల నుంచి దండుకుంటున్నాయి.. అదేమని ప్రశ్నిస్తే.. సర్వీస్ చార్జ్ అని డెలివరీ బాయ్స్ సమాధానం చెబుతున్నారు...
రవాణా పేరిట అదనపు వసూళ్లు
గ్యాస్ ఏజెన్సీల ఘరానా దోపిడీ
జిల్లాలో నెలకు సామాన్యుడిపై రూ.రెండు కోట్లపైనే భారం
బాపట్లటౌన్ పట్టణంలోని రామకృష్ణాపురం కాలనీ.. గ్యాస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది. కాలనీకి చెందిన వి.శ్రీలతకు గ్యాస్ కంపెనీ నుంచి ఇటీవల సిలిండర్ వచ్చింది. బిల్లుపై రూ.642 ఉంటే డెలివరీ బాయ్ రూ.680 తీసుకున్నాడు. అదేంటని ప్రశ్నిస్తే అది అంతే.. సర్వీస్ ట్యాక్స్ అంటూ వెళ్లిపోయాడు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రాములమ్మకు గ్యాస్ వచ్చింది. ఆమె సిలిండర్‌కు సరిపడా రూ.645 ఇచ్చింది. ఇదేంటి సర్వీస్ చేసినందుకు రూ.50 ఇవ్వాలి.. లేదంటే సిలిండర్ వెనక్కు తీసుకుపోతా.. అని డెలీవరీ బాయ్ వసూలు చేశాడు. మరుప్రోలువారిపాలేనికి చెందిన మస్తానమ్మ గృహం గ్యాస్ ఏజెన్సీ నుంచి రెండు కి.మీ దూరంలో ఉంటుంది. ఆమెకు సిలిండర్ సరఫరా చేసినందుకు గ్యాస్ రేటు కంటే రూ.30 అదనంగా వసూలు చేశారు..
దండుకుంటున్న ఏజెన్సీలు కంపెనీ బిల్లుపై ఒక్క రూపాయి కూడా గ్యాస్ సిలిండర్ కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా ఒక్కో సిలిండర్‌కు రవాణా చార్జీల కింద రూ.30 నుంచి 50 వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా నెలకు సుమారు జిల్లా వ్యాప్తంగా రూ.రెండు కోట్లపైనే వినియోగదారుల నుంచి గ్యాస్ ఏజెన్సీలు దండుకుంటున్నాయి. ఆ అక్రమార్జనలో మాముళ్లు చేతులు మారుతుండటంతో మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి.
నిబంధనలు..
గ్యాస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 15 కిలోమీటర్లలోపు ఉన్న వినియోగదారులకు కంపెనీ ధరకే సిలిండర్ అందజేయాల్సి ఉంది. ఆ తర్వాత కిలోమీటరకు రూ.5 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు జరగడంలేదు. ఏజెన్సీలకు కూతవేటు దూరంలో ఉన్న గృహాలకు సిలిండర్ వచ్చినా అదనంగా వసూలు చేస్తున్నారు.
జిల్లా అధికారులకు తెలిసినా.. తెలియనట్టు!
జిల్లా వ్యాప్తంగా సుమారు 70 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి నుంచి నెలకు సరాసరి సుమారు 8.50 లక్షల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. ఒక్కో సిలిండర్‌కు రూ.30 చొప్పున చూస్తేనే 8.50 లక్షల సిలిండర్లకు రూ.2.55 కోట్లు వినియోగదారుల నుంచి దండుకుంటున్నారు. ఈ విషయం మండల స్థాయి జిల్లా స్థాయి అధికారుల దృష్టికి అనేకమంది తీసుకెళ్లినా ఫలితంలేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది.
బిల్లు కంటే అదనంగా రూపాయి కూడా చెల్లించొద్దు..
గ్యాస్ సిలిండర్ పై ఉన్న బిల్లు కంటే 15 కి.మీ లోపు డెలివరీ చేస్తే ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదనంగా వసూలు చేస్తున్న ఏజెన్సీలపై ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటాం. - డీఎస్‌వో చిట్టిబాబు