
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి జైపూర్(రాజస్థాన్) మధ్య దూరం 300 కిలోమీటర్లు ఉంటుంది. అంతటి దూరాన్ని నిమిషాల్లో చేరుకోగలిగితే ఎలా ఉంటుంది?.. ఇలాంటి హైస్పీడ్ ప్రయాణం కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తొలి అడుగు వేసింది. ఐఐటీ మద్రాస్ ఆలోచనతో భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది.
హైపర్‌లూప్(Hyperloop) అనేది అత్యంత అధునాతనమైన రవాణా వ్యవస్థ. గంటకు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఈ రవాణా వ్యవస్థ లక్ష్యం. సుదుర గమ్యాలను నిమిషాల వ్యవధిలో చేరుకునేలా చేయడమే దీని ఉద్దేశం. అందుకే దీన్ని రవాణా వ్యవస్థలో హైపర్‌లూప్‌ను గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు.
వందేభారత్ తర్వాత బుల్లెట్ రైల్ మీద దృష్టిసారించిన భారతీయ రైల్వే(Indian Railways) ఇప్పుడు మరో ఘనత వైపు అడుగులేస్తోంది. భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) మీడియాకు తెలియజేశారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో 422 మీటర్ల దూరం ఉన్న ట్రాక్‌ను రూపొందించారు. ఈ హైపర్‌లూప్ ప్రాజెక్టు వాస్తవరూపం దాలిస్తే అరగంటలోపే ఢిల్లీ నుంచి జైపూర్‌కు చేరుకోవచ్చన్నమాట.
The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025
రోడ్డు, రైలు, నీరు, వాయు రవాణా మార్గాల తర్వాత ఫిఫ్త్ ట్రాన్స్‌పోర్టేషన్‌గా హైపర్‌లూర్‌ను చెబుతుంటారు. వాక్యూమ్ ట్యూబ్స్‌లో పాడ్స్ ద్వారా ప్రయాణమే హైపర్‌లూప్. గొట్టాల్లాంటి ఆ నిర్మాణాల్లో గాలి నిరోధకత.. పాడ్‌లను అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. 2013లో ఇలాన్ మస్క్ ప్రచారంతో దీని గురించి ఎక్కువ చర్చ నడిచింది. అమెరికా, చైనా ఇలా చాలా దేశాలు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రధాన నగరాలను అనుసంధానించడం కోసమైనా హైపర్‌లూప్ టెక్నాలజీ వినియోగంలోకి తేవాలని యూఏఈ సైతం భావిస్తోంది.