hyperloop
-
విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..
శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్‌ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. ‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్ హైపర్‌లూప్, జెలెరస్ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్‌లూప్ స్టార్టప్‌ల్లో ప్రధాన స్టార్టప్‌గా ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్‌నకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎలాన్‌మస్క్‌కు 2013లో హైపర్‌లూప్ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్‌లూప్ వన్’ స్టార్టప్‌ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్ డెమోలు, టెస్ట్ ట్రాక్‌లు మినహా ప్రాజెక్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం. హైపర్‌లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్‌లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇదీ చదవండి: ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ.. అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్‌లూప్ వన్ స్టార్టప్‌లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్‌లూప్ వన్‌లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్‌లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్‌కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
90 నిమిషాల్లో ఢిల్లీ టూ ముంబై
ప్రపంచంలో ఇప్పుడందరి దృష్టి హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ మోడ్ మీద ఉంది. ప్రఖ్యాత కంపెనీలు నిరంతరం హైపర్ లూప్ ప్రయాణం అభివృద్ధిలో పడ్డాయి. వర్జిన్ గ్రూప్ హైపర్ లూప్ రైలు అభివృద్ది పనులను చక చక చేపడుతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఇంకా ట్రయల్ దశలో ఉంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో సంచలనం క్రియేట్ చేసే అవకాశం ఉంది. హైస్పీడ్ రైల్ కంటే మూడు రెట్లు వేగంగా, సాదారణ రైలు కంటే పది రెట్లు వేగంగా ప్రయాణించనుంది. హైపర్ లూప్ గరిష్ఠ వేగం గంటకు 1000 కిలోమీటర్లు. ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ కొత్త టెక్నాలజీ వాణిజ్య జెట్లకు ప్రయాణ సమయం పరంగా పోటీని ఇవ్వగలదని హైపర్ లూప్ పేర్కొంది. హైపర్ లూప్ పోర్టల్ లోని రూట్ ఎస్టిమేటర్ లో పేర్కొన్న విధంగా ఢిల్లీ నుంచి ముంబైకి 1153 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరాన్ని 1 గంట 22 నిమిషాల్లో కవర్ చేయవచ్చని పేర్కొంది. హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. (చదవండి: పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు) దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. వర్జిన్ హైపర్ లూప్ పాడ్స్ వేగాన్ని పెంచడానికి అయస్కాంత లెవిటేషన్, ప్రొపల్షన్ టెక్నాలజీని మరింత ఉపయోగిస్తాయి. వర్జిన్ హైపర్ లూప్ వ్యవస్థ వల్ల ప్రయాణం సురక్షితంగా జరుగుతుంది. -
ఆనంద్.. మంచి కాఫీలాంటి శాటిలైట్
తన 50 ఏళ్ల చరిత్రలో ‘ఇస్రో’ తొలిసారిగా మన ప్రైవేట్ సంస్థల శాటిలైట్లను నింగిలోకి పంపనుంది. ఈ నెల 28న పీఎస్ఎల్వీ–సి51 ద్వారా పంపే ఈ శాటిలైట్లలో బెంగళూరు స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ‘పిక్సెల్’ రూపొందించిన ‘ఆనంద్’ ఒకటి. పాతికేళ్లు కూడా నిండని ఎవ్యాస్ అహ్మద్, క్షితిజ్ ఖండేల్వాల్లు ఈ కంపెనీ రథసారథులు. ‘పిక్సెల్’ విజయప్రస్థానం... చిన్నప్పుడు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు. చిక్కమగళూరు(కర్నాటక) అబ్బాయి ఎవ్యాస్ అహ్మద్ కూడా అంతే. ఆ ఆసక్తి తాను చదువుకున్న బిట్స్ పిలాని(రాజస్థాన్) వరకు కొనసాగింది. బిట్స్ పిలానిలో ‘హైపర్‌లూప్ ఇండియా’ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యులో అహ్మద్ కూడా ఒకరు. ‘హైపర్‌లూప్ ఇండియా’తో తన కలలకు శాస్త్రీయ పునాది ఏర్పడింది. వేరు వేరు క్యాంపస్‌లలో నుంచి వచ్చిన విద్యార్థులతో పరిచయం, పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ స్పాన్సర్ చేసే ‘హైపర్‌లూప్ పోడ్ కాంపిటీషన్’లో ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్, నాన్ స్టూడెంట్స్ టీమ్‌లు పాల్గొంటాయి. ఈ పోటీలో పాల్గొనడాన్ని ప్రతిష్ఠాత్మక విషయంగా భావిస్తాయి. హైపర్‌లూప్ కాన్సెప్ట్ ప్రకారం సబ్‌స్కేల్ ప్రోటోటైప్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ నిర్మించడం, డిజైన్ చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. ‘హైపర్‌లూప్ ఛాలెంజ్’లో బిట్స్ పిలాని టీమ్‌కు పాల్గొనే అవకాశం వచ్చింది. కాలిఫోర్నియాలోని ‘స్పేస్ఎక్స్’ ప్రధానకార్యాలయంలో తమదైన హైపర్‌లూప్ టెక్నాలజీ(అత్యంగా వేగంగా ఒక మైలు దూరం వ్యాక్యూమ్ ట్యూబ్‌లో ప్రయాణం చేసే సాంకేతిక జ్ఞానం) డెమో ఇచ్చారు. ఫైనల్ వరకు వెళ్లారు. ఈ పోటీ పుణ్యమా అని టెక్స్టార్ ఎలాన్ మాస్క్‌ను కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మాస్క్‌తో మాట్లాడడం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. నా కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటాడు ఆరోజుని గుర్తు చేసుకుంటూ 22 సంవత్సరాల అహ్మద్. హైపర్‌లూప్ కాంపిటీషన్లో పాల్గోవడం వల్ల తన పరిమిత అవగాహనలోని ఖాళీలకు జవాబులు దొరికాయి. ఆ తరువాత ‘ఏఐ ఎక్స్‌ప్రైజ్ కాంపిటీషన్’లో పాల్గొన్నాడు. సాంకేతిక అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీలు నిర్వహించే ఈ సంస్థను 1994లో కాలిఫోర్నియాలో స్థాపించారు. జెమ్స్ కామెరూన్, లారీపేజ్లాంటి ప్రముఖులు ఈ సంస్థకు ట్రస్టీలుగా ఉన్నారు. ‘ఎక్స్‌ప్రైజ్’లో పాల్గొన్న సందర్భంలోనే అహ్మద్‌కు ‘శాటిలైట్ ఇమేజరీ’ గురించి ఆలోచన వచ్చింది. రిమోట్ లొకేషన్లలో, పైప్‌ల నుంచి గ్యాస్ లీకేజిలను గుర్తించడానికి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా గనులలో అక్రమ తవ్వకాలను గుర్తించడానికి, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి, విత్తడానికి సరిౖయెన సమయాన్ని ఎంచుకోవడానికి...ఒకటి రెండు అని ఏమిటి! చాలా రకాలుగా శాటిలైట్ ఇమేజరీలను వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ పిక్సెల్. బిట్స్‌పిలానిలో తనతో పాటు చదువుకున్న క్షితిజ్ ఖండెల్వాల్తో కలిసి 2019లో బెంగళూరులో ‘పిక్సెల్’ స్టార్టప్ ప్రారంభించాడు అహ్మద్. అయితే నిధుల సమస్య పెద్ద సవాలుగా మారింది. వీరు ఎంత సీరియస్‌గా తమ ప్రాజెక్ట్ గురించి వివరించినా అందరూ తేలిగ్గా తీసుకునేవారు. దీనికి కారణం వారి వయసు. నిధుల సమస్యను అధిగమించడానికి రాజస్థాన్ గవర్నమెంట్, ఇతరుల కోసం కొన్ని ప్రాజెక్ట్‌లు చేశారు. కొద్ది కాలం తరువాత ‘పిక్సెల్’ ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. తొలిరోజుల్లో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించని ‘పిక్సెల్’ టీమ్ ఇండస్ తరువాత ఇండియన్ స్పేస్ స్టార్టప్‌లలో హైయెస్ట్ ఫండింగ్‌లో ఉంది. తాము అత్యున్నత ప్రమాణాలతో జెనరేట్ చేసే ఇమేజరీ డాటా యూఎస్ నుంచి యూరప్ వరకు వినియోగదారులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ‘పిక్సెల్’ సీయివో,సీటీవో అహ్మద్, క్షితిజ్లు. మూడు రోజుల తరువాత పిక్సెల్ వారి ‘ఆనంద్’ ఆకాశంలోకి దూసుకెళ్లబోతుంది. వెళుతూ వెళుతూ ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చివెళుతుంది. పట్టుదల ఉంటే కన్న కలలు సాకారమవుతాయి. జీవితాన్ని ఆనందంతో నింపుతాయి. -
హైపర్‌లూప్.. గంటకు 1,200 కి.మీ. వేగంతో దూసుకెళ్లేలా..
ఢిల్లీలో ఉంటూ.. ముంబైలో ఉద్యోగం చేయొచ్చా? కుదురుతుంది కాకపోతే జీతం లక్షల్లో, కోట్లలో ఉండాలి.. వేలకు వేలు పోసి విమానాల్లో ప్రయాణించాలి.. అయితే అంత అవసరం లేదంటోంది హైపర్‌లూప్! గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో.. గొట్టాల్లో దూసుకెళ్లేలా చేయగలిగేదే హైపర్‌లూప్ ఈ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. కారుకు అయ్యే ఖర్చుతోనే దూర ప్రయాణాలు చేయొచ్చని చెబుతోంది.. దేశంలో హైపర్‌లూప్ కార్యకలాపాలు, ప్రత్యేకతలపై సంస్థ భారతీయ వ్యవహారాల డైరెక్టర్ నౌషాద్ ఊమర్ ‘సాక్షి’కి ఇచ్చిన వివరాలు.. సాక్షి: భారత్‌లో ఎక్కడెక్కడ హైపర్‌లూప్ వ్యవస్థలు ఏర్పాటు అవుతాయి? నౌషాద్: భారత్‌లో ముంబై–పుణే మధ్య హైపర్‌లూప్ ఏర్పాటు కానుంది. ఈ రెండు మహా నగరాల మధ్య ఉన్న 200 కిలో మీటర్ల దూరాన్ని అరగంట కంటే తక్కువ సమయంలో ప్రయాణించొచ్చు. కారులో వెళ్తే.. 3.50 గంటలు పడుతుంది. కరోనా కారణంగా ప్రాజెక్టు పురోగతి కొంత మందగించినా ప్రస్తుతం మళ్లీ పట్టాలెక్కనుంది. కర్ణాటకలోని బెంగళూరు కేంద్రం నుంచి అక్కడి విమానాశ్రయానికి 10 నిమిషాల్లోనే చేరుకునేలా హైపర్‌లూప్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేస్తున్నాం. పలు మార్గాలను పరిశీలిస్తున్నాం. 2019 డిసెంబర్లో పంజాబ్ ప్రభుత్వ రవాణా శాఖతో హైపర్‌లూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర భారతదేశంలో తగిన హైపర్‌లూప్ మార్గాల అన్వేషణ కొనసాగిస్తాం. ఇతర రాష్ట్రాలతో చర్చలు జరిపి దేశం మొత్తం హైపర్‌లూప్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. సాక్షి: ముంబై–పుణే మార్గం గురించి చెప్పండి? నౌషాద్: రెండు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ముందుగా 11 కిలోమీటర్ల పొడవైన హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మిస్తాం. హైపర్‌లూప్ పూర్తిగా సురక్షితమైందని ఈ ట్రాక్ ద్వారా నిరూపించి, ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాత రెండో దశలో మిగిలిన మార్గం నిర్మాణాన్ని చేపడతాం. ఈ ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రకు సుమారు రూ.3,600 కోట్ల పెట్టుబడులు వస్తాయి. హైపర్‌లూప్ నిర్మాణానికి అవసరమైన హైటెక్ ఫ్యాక్టరీ కొత్త ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా స్థానిక తయారీ రంగానికి ఊతమిస్తుంది. ప్రాజెక్టు రెండో దశ మొదలు కాగానే మహారాష్ట్రకు వచ్చే పెట్టుబడులు రూ.72,000 కోట్లకు చేరతాయి. మొత్తమ్మీద 18 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌లూప్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను 2025 కల్లా సాధించగలమని మా నమ్మకం. వాణిజ్యస్థాయిలో హైపర్‌లూప్ తొలి మార్గం 2030 నాటికి మొదలవుతుంది. ముంబై–పుణే మార్గంలో ఏడాదికి 20 కోట్ల మంది ప్రయాణించేందుకు హైపర్‌లూప్ వీలు కల్పిస్తుంది. ఈ మార్గం పూర్తయితే ఏడాదికి 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చు. బస్సు, రైలు, విమానాల మాదిరిగా హైపర్‌లూప్ టైమ్ టేబుల్ ప్రకారం నడవదు. ప్రయాణికులు ఎప్పుడు వస్తే అప్పుడే స్టార్ట్ అవుతుంది. సాక్షి: హైపర్‌లూప్ ప్రత్యేకతలేంటి? నౌషాద్: ఇది పూర్తిగా విద్యుచ్ఛక్తితో పనిచేసే రవాణా వ్యవస్థ. రైలు కంటే 4 రెట్లు, హైస్పీడ్ రైలు కంటే 50%, విమాన ప్రయాణం కంటే 10 రెట్లు ఎక్కువ ఇంధన సామర్థ్యంతో పని చేస్తుంది. హైపర్‌లూప్ మలుపులు విమానం మాదిరిగానే ఉంటాయి. గాలి లేని గొట్టంలో ప్రయాణిస్తుంది కాబట్టి మలుపులు తిరిగేందుకు చాలా తక్కువ స్థలం సరిపోతుంది. 6 రెట్లు ఎక్కువున్న ఎత్తులను రైలుతో పోలిస్తే హైపర్‌లూప్ సులువుగా అధిగమించగలదు. సాక్షి: హైపర్‌లూప్ ప్రయాణం ఖరీదైన వ్యవహారమా? నౌషాద్: కానే కాదు. టికెట్ ధరలు భరించలేనంతగా ఉంటే ఎవరూ హైపర్‌లూప్ ఎక్కరని తెలుసు. సామాన్యులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు హైపర్‌లూప్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. చిన్న నగరాల్లో నివసించేవారు రోజూ ముంబైలాంటి నగరాలకు వెళ్లి పనిచేసేందుకు ఇది పనికొస్తుంది. మార్గాన్ని బట్టి టికెట్ ధర ఎంతన్నది చెప్పడం కష్టమే. కానీ ఇటీవలే అమెరికాలోని మిస్సోరిలో హైపర్‌లూప్ ద్వారా వెళ్లిన దూరం.. కారులో వెళ్తే అయ్యే పెట్రోల్ ఖర్చు కన్నా తక్కువగా ఉంటుందని తేలింది. – సాక్షి, హైదరాబాద్ -
23 నిమిషాల్లో ముంబై టు పుణె
ముంబై: ముంబై–పుణె మధ్య నిర్మించనున్న హైపర్‌లూప్‌ను ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. భూమిపై నిర్మించే ఓ గొట్టంలో అత్యంత వేగంతో ప్రయాణించేందుకు ఈ హైపర్‌లూప్ ను నిర్మించాలని ప్రణాళిక ఉంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి పుణెలోకి వాకాడ్ వరకు నిర్మించే ఈ హైపర్‌లూప్ అందుబాటులోకి వస్తే, ముంబై–పుణె మధ్య 117.5 కి.మీ. దూరాన్ని కేవలం 23 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రూ.70 వేల కోట్ల వ్యయంతో, రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పుణె మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతోంది. తొలి దశలో పుణె మహానగర పరిధిలోనే 11.8 కిలోమీటర్లపాటు హైపర్‌లూప్‌ను రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మించి, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే రెండో దశలో మిగతా దూరం మొత్తం హైపర్‌లూప్‌ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు సత్వరంగా లభించడం కోసం దీనిని ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రభుత్వం తాజాగా గుర్తించింది. -
హైపర్‌లూప్ ఇక యూరప్‌లో
పారిస్: అత్యంత వేగవంతమైన ప్రయాణానికి మానవుడి అద్భుత సృష్టిగా భావిస్తున్న హైపర్‌లూప్ రైల్వే ప్రాజెక్ట్ ఇప్పుడు యూరప్‌లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే దుబాయ్, కెనడా, రష్యాలలో హైపర్‌లూప్ టెక్నాలజీతో రైలు మార్గాల ఏర్పాటుకు ప్రాజెక్టులు ప్రారంభించగా.. ఇటీవల చెక్ రిపబ్లిక్‌లోని బ్రునో నుంచి, స్లొవేకియా రాజధాని బ్రాస్టిస్లావా వరకు హైపర్‌లూప్ రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు హెచ్‌టీటీ(హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాటజీ) ఒప్పందం కుదుర్చుకుంది. యూరప్‌లో హైపర్‌లూప్ ప్రాజెక్టును విస్తరించేందుకు ఫ్రాన్స్‌లోని టౌలౌస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు హెచ్‌టీటీ వెల్లడించింది. యూరోపియన్ ఎరోస్పేస్ ఇండస్ట్రీకి టౌలౌస్ ప్రాముఖ్యత గల ప్రదేశంగా ఉన్న విషయం తెలసిందే. ఇక్కడ నుంచి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సెంట్రల్ యూరోపియన్ లైన్లో తమ సేవల విస్తరణకు అనుకూలంగా ఉంటుందని హెచ్‌టీటీ భావిస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన మార్గం గుండా.. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి హైపర్‌లూప్ రైళ్లలో వీలుంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా రాబోయే రోజుల్లో రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో.. 'ద ట్రైన్ ఆఫ్ ద ఫ్యూచర్'గా హైపర్‌లూప్‌ను పేర్కొంటున్నారు. చదవండి: హైపర్‌లూప్ టెక్నాలజీ అంటే ఏమిటీ? -
విమానం కన్నా వేగంగా రైలులో...
లాస్ వెగాస్: విమానంకన్నా వేగంగా రైల్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకుంటున్నారా? వినూత్న ఆవిష్కారంతో హైపర్ లూప్ మార్గం.. ఇప్పుడు మీకు అందుబాటులోకి రానుంది. గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగంతో.. విస్మయపరిచే ప్రయాణ అనుభవాన్ని మీకు అందిచనుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ కు కేవలం 35 నిమిషాల్లో చేరేందుకు హైపర్ లూప్ మార్గం అందుబాటులోకి వస్తోంది. 1100 కిలోమీటర్ల విమానానికి మించిన వేగంతో ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. హైపర్ లూప్ సంస్థ దీనికి సంబంధించి తాజాగా ప్రయోగాలు జరిపింది. ప్రముఖ హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్స్ తన హైపర్ లూప్ ఆలోచనను విజయవంతంగా ఆచరణలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల లాస్ వెగాస్ ఎడారి ప్రాంతంలో హైపర్ లూప్ టెక్నాలజీస్ కి సంబంధించిన హైపర్ లూప్ వన్ మొదటిసారి తమ కొత్త రవాణా సిస్టమ్ పై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది. హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్... లారెన్స్ లివేర్మోర్ నేషనల్ లాబొరేటరీ నుంచి ఇండక్ ట్రాక్ పేరిట తన నూతన ఆవిష్కారానికి సాంకేతిక లైసెన్సును కూడ పొందింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే హైపర్ లూప్ స్వంత ఆవిష్కారం త్వరలో మనముందు సాక్షాత్కరించి, అత్యంత వేగవంతమైన మార్గాన్ని సుగమం చేయనుంది. -
రెండు గంటల్లో హైదరాబాద్ - శ్రీనగర్!
లాస్ ఏంజెలిస్: హైదరాబాద్ నుంచి శ్రీనగర్ దూరం ఎంతో తెలుసా.. ఏకంగా 2,400 కిలోమీటర్లు. అంతదూరం వెళ్లాలంటే సాధారణంగా అయితే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో.. 40 గంటలు పడుతుంది. కానీ, రెండే రెండు గంటల్లో అంతదూరాన్ని అధిగమించగలమని మీకు తెలుసా? ప్రయాణికులు నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటే ఎంత బాగుండనే ఓ ఆలోచన నుంచి ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్‌కు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. అదే 'హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ'. ఇది వచ్చే ఏడాదికల్లా అమెరికాలో కార్యరూపం దాల్చబోతోంది. ముందుగా ప్రయోగాత్మకంగా లాస్ ఏంజెలిస్ నుంచి 610 కిలోమీటర్ల దూరంలోని శాన్ ఫ్రాన్సిస్కోకు హైపర్‌లూప్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే 610 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే హైపర్‌లూప్ ద్వారా గంటకు దాదాపు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చన్న మాట ఓహ్.. విమానం కన్నా రెట్టింపు వేగం. వాట్ యాన్ ఐడియా! 610 కిలోమీటర్ల దూరం వరకు హైపర్‌లూప్ నిర్మాణానికి దాదాపు 1600 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని దీని నిర్మాణానికి ముందుకొచ్చిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొటేషన్ టెక్నాలజీస్ (హెచ్‌టీటీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డర్క్ అహల్బార్న్ వియన్నాలో జరిగిన ఓ సదస్సులో వెల్లడించారు. జర్మనీలో జన్మించిన ఆయన ప్రస్తుతం అమెరికాలో పలు దిగ్గజ వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు. హైపర్‌లూప్ టెక్నాలజీ అంటే ఏమిటీ? ట్యూబ్ ఆకారంలో ఉండే రవాణా వ్యవస్థ. ఇందులో నుంచి గాలిని వెలికితీసి వ్యాక్యూమ్‌ను ఏర్పరుస్తారు. దీనిగుండా ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలు కాప్సుల్ ఆకారంలో ఉంటాయి. వాటికి చలన చోదక శక్తిని కలిగించేందుకు అయస్కాంతాలను అమరుస్తారు. వెలుపలి వాతావరణ పీడనం, భూమ్యాకర్శన శక్తిని తగ్గించేందుకు ఈ వ్యవస్థను పూర్తిగా వంతెనల్లాగా భూమి పైభాగంలోనే నిర్మిస్తారు. మొత్తం ఎనిమిది మంది ప్రయాణించే వీలున్న కాప్సుల్ వాహనాలను తయారు చేస్తారు. ప్రతి 30 సెకండ్లకో కాప్సుల్ వాహనాన్ని దీని గుండా పంపిస్తారు. ఈ మొత్తం వ్యవస్థకు అవసరమయ్యే విద్యుత్‌ను సౌర విద్యుత్ ద్వారా సమకూర్చుతారు. లాస్ ఏంజెలిస్ నుంచి శాన్ ఫ్రాన్సిన్కోకు హైపర్‌లూప్‌లో వెళ్లే ప్రయాణికుడి వద్ద నుంచి 20 డాలర్లను చార్జీకింద వసూలు చేయాలన్నది ప్రాథమిక అంచనా. కేవలం ప్రయాణికుల పీక్ టైమ్‌లోనే చార్జీలు వసూలు చేస్తామని, లీన్ పీరియడ్‌లో ఉచితంగానే ప్రయాణికులను అనుమతిస్తామని డర్క్ అహల్బార్న్ తెలిపారు. హైపర్‌లూప్ అంచనాలకు సరిపడా పెట్టుబడులను ఎలా సమకూరుస్తున్నారని ప్రశ్నించగా, ఇప్పటికే ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, తమ లక్ష్యానికి తాము అతి దగ్గరలో ఉన్నామని ఆయన వివరించారు. ప్రయాణికుల నుంచి చార్జీల కింద 20 డాలర్లను మాత్రమే వసూలు చేయడం ద్వారా ప్రాజెక్టు ఎలా లాభదాయకం అవుతుందని ప్రశ్నించగా, హైపర్‌లూప్ నడవడానికి సౌరశక్తి తక్కువే ఖర్చవుతోందని, మిగులు విద్యుత్‌ను ఇతర అవసరాలకు విక్రయించడం ద్వారా ప్రాజెక్టును లాభదాయకం చేయవచ్చని ఆయన తెలిపారు. వాస్తవానికి హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఎలాన్ మాస్క్ సొంతాలోచన. ఆయన ఈ విషయాన్ని 2013లోనే బయటపెట్టారు. ఈ ఆలోచనను మరింత అభివృద్ధిచేసి కార్యరూపంలోకి తీసుకరావాల్సిందిగా వ్యాపారవేత్తలను ఆయన బహిరంగంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని అందిపుచ్చుకున్న డర్క్ ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన దాదాపు ఐదువేల ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టు ఆయన చెప్పారు.