ఢిల్లీలో ఉంటూ.. ముంబైలో ఉద్యోగం చేయొచ్చా?
కుదురుతుంది కాకపోతే జీతం లక్షల్లో, కోట్లలో ఉండాలి..
వేలకు వేలు పోసి విమానాల్లో ప్రయాణించాలి..
అయితే అంత అవసరం లేదంటోంది హైపర్‌లూప్!
గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో.. గొట్టాల్లో దూసుకెళ్లేలా చేయగలిగేదే హైపర్‌లూప్
ఈ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. కారుకు అయ్యే ఖర్చుతోనే దూర ప్రయాణాలు చేయొచ్చని చెబుతోంది..
దేశంలో హైపర్‌లూప్ కార్యకలాపాలు, ప్రత్యేకతలపై సంస్థ భారతీయ వ్యవహారాల డైరెక్టర్ నౌషాద్ ఊమర్ ‘సాక్షి’కి ఇచ్చిన వివరాలు..
సాక్షి: భారత్‌లో ఎక్కడెక్కడ హైపర్‌లూప్ వ్యవస్థలు ఏర్పాటు అవుతాయి?
నౌషాద్: భారత్‌లో ముంబై–పుణే మధ్య హైపర్‌లూప్ ఏర్పాటు కానుంది. ఈ రెండు మహా నగరాల మధ్య ఉన్న 200 కిలో మీటర్ల దూరాన్ని అరగంట కంటే తక్కువ సమయంలో ప్రయాణించొచ్చు. కారులో వెళ్తే.. 3.50 గంటలు పడుతుంది. కరోనా కారణంగా ప్రాజెక్టు పురోగతి కొంత మందగించినా ప్రస్తుతం మళ్లీ పట్టాలెక్కనుంది. కర్ణాటకలోని బెంగళూరు కేంద్రం నుంచి అక్కడి విమానాశ్రయానికి 10 నిమిషాల్లోనే చేరుకునేలా హైపర్‌లూప్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేస్తున్నాం. పలు మార్గాలను పరిశీలిస్తున్నాం. 2019 డిసెంబర్‌లో పంజాబ్ ప్రభుత్వ రవాణా శాఖతో హైపర్‌లూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర భారతదేశంలో తగిన హైపర్‌లూప్ మార్గాల అన్వేషణ కొనసాగిస్తాం. ఇతర రాష్ట్రాలతో చర్చలు జరిపి దేశం మొత్తం హైపర్‌లూప్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం.
సాక్షి: ముంబై–పుణే మార్గం గురించి చెప్పండి?
నౌషాద్: రెండు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ముందుగా 11 కిలోమీటర్ల పొడవైన హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మిస్తాం. హైపర్‌లూప్ పూర్తిగా సురక్షితమైందని ఈ ట్రాక్ ద్వారా నిరూపించి, ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాత రెండో దశలో మిగిలిన మార్గం నిర్మాణాన్ని చేపడతాం. ఈ ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రకు సుమారు రూ.3,600 కోట్ల పెట్టుబడులు వస్తాయి. హైపర్‌లూప్ నిర్మాణానికి అవసరమైన హైటెక్ ఫ్యాక్టరీ కొత్త ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా స్థానిక తయారీ రంగానికి ఊతమిస్తుంది. ప్రాజెక్టు రెండో దశ మొదలు కాగానే మహారాష్ట్రకు వచ్చే పెట్టుబడులు రూ.72,000 కోట్లకు చేరతాయి. మొత్తమ్మీద 18 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా హైపర్‌లూప్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను 2025 కల్లా సాధించగలమని మా నమ్మకం. వాణిజ్యస్థాయిలో హైపర్‌లూప్ తొలి మార్గం 2030 నాటికి మొదలవుతుంది. ముంబై–పుణే మార్గంలో ఏడాదికి 20 కోట్ల మంది ప్రయాణించేందుకు హైపర్‌లూప్ వీలు కల్పిస్తుంది. ఈ మార్గం పూర్తయితే ఏడాదికి 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చు. బస్సు, రైలు, విమానాల మాదిరిగా హైపర్‌లూప్ టైమ్ టేబుల్ ప్రకారం నడవదు. ప్రయాణికులు ఎప్పుడు వస్తే అప్పుడే స్టార్ట్ అవుతుంది.
సాక్షి: హైపర్‌లూప్ ప్రత్యేకతలేంటి?
నౌషాద్: ఇది పూర్తిగా విద్యుచ్ఛక్తితో పనిచేసే రవాణా వ్యవస్థ. రైలు కంటే 4 రెట్లు, హైస్పీడ్ రైలు కంటే 50%, విమాన ప్రయాణం కంటే 10 రెట్లు ఎక్కువ ఇంధన సామర్థ్యంతో పని చేస్తుంది. హైపర్‌లూప్ మలుపులు విమానం మాదిరిగానే ఉంటాయి. గాలి లేని గొట్టంలో ప్రయాణిస్తుంది కాబట్టి మలుపులు తిరిగేందుకు చాలా తక్కువ స్థలం సరిపోతుంది. 6 రెట్లు ఎక్కువున్న ఎత్తులను రైలుతో పోలిస్తే హైపర్‌లూప్ సులువుగా అధిగమించగలదు.
సాక్షి: హైపర్‌లూప్ ప్రయాణం ఖరీదైన వ్యవహారమా?
నౌషాద్: కానే కాదు. టికెట్ ధరలు భరించలేనంతగా ఉంటే ఎవరూ హైపర్‌లూప్ ఎక్కరని తెలుసు. సామాన్యులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు హైపర్‌లూప్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. చిన్న నగరాల్లో నివసించేవారు రోజూ ముంబైలాంటి నగరాలకు వెళ్లి పనిచేసేందుకు ఇది పనికొస్తుంది. మార్గాన్ని బట్టి టికెట్ ధర ఎంతన్నది చెప్పడం కష్టమే. కానీ ఇటీవలే అమెరికాలోని మిస్సోరిలో హైపర్‌లూప్ ద్వారా వెళ్లిన దూరం.. కారులో వెళ్తే అయ్యే పెట్రోల్ ఖర్చు కన్నా తక్కువగా ఉంటుందని తేలింది.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment