విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే.. | Hyperloop One High Speed Trains Project Will Shutdown On This Date, See Details Inside - Sakshi
Sakshi News home page

Hyperloop One Shuts Down: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..

Published Sat, Dec 23 2023 1:17 PM | Last Updated on Sat, Dec 23 2023 7:04 PM

Hyperloop One Speed Trains Project Will Shutdown - Sakshi

శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్‌ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. 

‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్‌ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్‌ హైపర్‌లూప్‌, జెలెరస్‌ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. 

తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్‌లూప్ స్టార్టప్‌ల్లో ప్రధాన స్టార్టప్‌గా ఉన్న వర్జిన్‌ హైపర్‌లూప్‌ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్‌ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్‌నకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.

ఎలాన్‌మస్క్‌కు 2013లో హైపర్‌లూప్‌ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్‌లూప్‌ వన్‌’ స్టార్టప్‌ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్‌ డెమోలు, టెస్ట్ ట్రాక్‌లు మినహా ప్రాజెక్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం.  

హైపర్‌లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్‌లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్‌లూప్‌ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు.

ఇదీ చదవండి: ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్‌ తరహా వెరిఫికేషన్‌.. కానీ..

అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్‌లూప్ వన్ స్టార్టప్‌లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్‌లూప్ వన్‌లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్‌లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్‌ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్‌కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్‌ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement