Hyperloop Track
-
విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..
శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్‌ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. ‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్ హైపర్‌లూప్, జెలెరస్ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్‌లూప్ స్టార్టప్‌ల్లో ప్రధాన స్టార్టప్‌గా ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్‌నకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎలాన్‌మస్క్‌కు 2013లో హైపర్‌లూప్ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్‌లూప్ వన్’ స్టార్టప్‌ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్ డెమోలు, టెస్ట్ ట్రాక్‌లు మినహా ప్రాజెక్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం. హైపర్‌లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్‌లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇదీ చదవండి: ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ.. అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్‌లూప్ వన్ స్టార్టప్‌లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్‌లూప్ వన్‌లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్‌లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్‌కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
25 నిమిషాల్లోనే ముంబయి నుంచి పూణేకు..
సాక్షి, ముంబయి : దేశీయ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తొలి హైపర్‌లూప్ ట్రైన్‌కు మార్గం సుగమమైంది. పూణే, ముంబయిలను కలుపుతూ హైపర్‌లూప్ నిర్మాణం కోసం వర్జిన్ హైపర్‌లూప్ వన్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందంపై(ఎంఓయూ) సంతకాలు చేసింది. హైపర్‌లూప్ రూట్ సెంట్రల్ పూణే నుంచి నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబయిలకు కేవలం 25 నిమిషాల్లోనే ప్రయాణీకులను చేరవేస్తుంది. ఈ రూట్ ద్వారా లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ ప్రయాణ సమయాన్నిభారీగా ఆదా చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సాధ్యాసాధ్యాలపై ఆరు నెలల పాటు అథ్యయనం చేసిన అనంతరం రూట్ అలైన్మెంట్ ఖరారు చేస్తారు. రెండు దశల్లో పూణే-ముంబయి హైపర్‌లూప్ రూట్ నిర్మాణం చేపడతారు. తొలి దశలో ఆపరేషనల్ డిమాన్‌స్ర్టేషన్ ట్రాక్‌ను నిర్మిస్తారు. ఒప్పందం ఖరారైన అనంతరం ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణీకులు, సరుకు రవాణా వేగవంతంగా జరిగితే పెద్ద ఎత్తున సమయం, వ్యయం ఆదాకావడంతో పాటు వృద్ధి రేటు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. -
గొట్టంలో రైలు... రైల్లో మనం!
బుల్లెట్ ట్రెయిన్ కంటే వేగంగా వెళుతుంది! అంతెందుకు వేగంలో విమానం కూడా దీని ముందు దిగదుడుపే. పైగా ప్రయాణ ఖర్చులు బాగా చౌక! ఈ వివరాలన్నీ ఫొటోలో కనిపిస్తున్న ‘హైపర్‌లూప్’ గురించే. అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్నేళ్లలో ప్రపంచ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసే సామర్థ్యమున్న టెక్నాలజీ ఇది. వాహనాల్లో మనం వాడే పెట్రోలు, డీజిళ్లలో గురుత్వాకర్షణ శక్తి, గాలి నిరోధకతలను ఎదుర్కొనేందుకు దాదాపు 80 శాతం వృధా అవుతుందని తెలుసు కదా... ఈ రెండు అడ్డంకుల్లేకుండా చేస్తే అతి తక్కువ ఇంధనంతో చాలా వేగంగా దూసుకెళ్లవచ్చు. ఓ గొట్టం లాంటి నిర్మాణంతో హైపర్‌లూప్ సాధించాలనుకుంటున్నది ఇదే. అమెరికాలోని టెస్లా కంపెనీ యజమాని ఎలన్ మస్క్ కొన్నేళ్ల క్రితం ఈ ఆలోచనను ప్రపంచం ముందు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇది ఎన్నో దశలు దాటింది. డిజైన్ పోటీలు, ఇంజిన్లు, కేబిన్ల తయారీ నమూనా బుల్లి ట్రెయిన్లతో పరీక్షల వంటివన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి కూడా. తాజాగా అసలైన సైజులో హైపర్‌లూప్ టెక్నాలజీని పరీక్షించేందుకు నెవడా (అమెరికా) ఎడారిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు అర కిలోమీటర్ పొడవైన ఈ ట్రాక్‌పై కనిపిస్తున్న గొట్టం 10 అడుగుల వ్యాసముంటుంది. ఈ గొట్టంలోపల రైల్వే బోగీ లాంటి నిర్మాణంలో ప్రయాణీకులు కూర్చుంటారు. ఆ తర్వాత రయ్యిన దూసుకెళ్లడమే! కేవలం 150 మంది ఇంజినీర్ల సాయంతో కొన్ని నెలల వ్యవధిలో ఈ ‘డెవ్‌లూప్’ ట్రాక్‌ను సిద్ధం చేశామని, హైపర్‌లూప్ వన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాష్ గైగెల్ అంటున్నారు. హైపర్‌లూప్ టెక్నాలజీ ద్వారా ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ఇప్పటికే అనేక దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దుబాయిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం హైపర్‌లూప్ వన్‌తో చర్చలు జరుపుతూంటే.. భారత్‌లో ట్రాక్ ఏర్పాటు చేస్తామని హైపర్‌లూప్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే న్యూఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా? కేవలం 70 నిమిషాలు!