పూణే-ముంబయిల మధ్య అందుబాటులోకి రానున్న హైపర్‌లూప్ ట్రైన్
సాక్షి, ముంబయి : దేశీయ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తొలి హైపర్‌లూప్ ట్రైన్‌కు మార్గం సుగమమైంది. పూణే, ముంబయిలను కలుపుతూ హైపర్‌లూప్ నిర్మాణం కోసం వర్జిన్ హైపర్‌లూప్ వన్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందంపై(ఎంఓయూ) సంతకాలు చేసింది. హైపర్‌లూప్ రూట్ సెంట్రల్ పూణే నుంచి నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ముంబయిలకు కేవలం 25 నిమిషాల్లోనే ప్రయాణీకులను చేరవేస్తుంది. ఈ రూట్ ద్వారా లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ ప్రయాణ సమయాన్నిభారీగా ఆదా చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సాధ్యాసాధ్యాలపై ఆరు నెలల పాటు అథ్యయనం చేసిన అనంతరం రూట్ అలైన్‌మెంట్ ఖరారు చేస్తారు. రెండు దశల్లో పూణే-ముంబయి హైపర్‌లూప్ రూట్ నిర్మాణం చేపడతారు.
తొలి దశలో ఆపరేషనల్ డిమాన్‌స్ర్టేషన్ ట్రాక్‌ను నిర్మిస్తారు. ఒప్పందం ఖరారైన అనంతరం ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణీకులు, సరుకు రవాణా వేగవంతంగా జరిగితే పెద్ద ఎత్తున సమయం, వ్యయం ఆదాకావడంతో పాటు వృద్ధి రేటు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment