కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా.. | Sakshi
Sakshi News home page

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..

Published Wed, May 8 2024 2:04 PM

AstraZeneca has decided to withdraw Covid-19 vaccine worldwide

ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్‌ నుంచి తొలగిస్తున్న సంస్థ ప్రకటించింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్‌) కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్  తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈమేరకు సంస్థ వీటిని ధ్రువపరుస్తూ యూకే కోర్డులో పత్రాలను అందజేసింది. అనంతరం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

కొత్త కొవిడ్ వేరియంట్‌లతో పోరాడే  వ్యాక్సిన్‌ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్‌ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్ వాక్స్‌జెవ్రియా మార్కెటింగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. ఇకపై ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరగదని వివరించింది.

వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గతంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఒకపై ఆ ఒప్పందాలు రద్దైనట్లు తెలిసింది.

ఇదీ చదవండి: సిబ్బంది అనారోగ్యంతో 70కి పైగా విమానాలు రద్దు

అసలేం జరిగిందంటే..

యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తన శరీరంలో రక్తం గడ్డకడుతుందని వైద్యులు గుర్తించారు. అయితే టీకా వేయించినప్పటి నుంచి ఈ సమస్య ఉండడంతో తన అనారోగ్యానికి అదే కారణమని అనుమానం వ్యక్తంచేశారు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత తన పరిస్థితికి టీకానే కారణమని నిర్థారణ అయింది. తాను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ బారిన పడినట్లు తేలింది. దాంతో యూకే కోర్టులో దావా వేశారు. తాజాగా కంపెనీ వివరణ ఇస్తూ చాలా అరుదుగా ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంగీకరించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement