
ఢిల్లీ అధికారులకు ప్రధాని మోదీ ఆదేశం
ప్రజలను భాగస్వాములను చేయాలని సూచన
న్యూఢిల్లీ: కాలుష్యమయంగా మారిన యమునా నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నది ప్రక్షాళన కోసం చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రక్షాళన క్రతువులో ఢిల్లీ ప్రజలను తప్పనిసరిగా భాగస్వా ములను చేయాలని ప్రధానమంత్రి సూచించారు. రియల్–టైమ్ డేటా, స్పేస్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతల సాయంతో నదిని పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలుష్యానికి తావులేకుండా యమునా నదిలో ఛాత్ పూజలు నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని అన్నారు. నది పట్ల మరింత గౌరవం పెంచేలా చూడాలన్నారు. పవిత్ర యుమునతో ప్రజల అనుబంధం మరింత పెరగాలని ఆకాంక్షించారు.