
2024లో 3.8 శాతం పెరిగిన షిప్‌మెంట్
మొత్తం 14.4 మిలియన్ యూనిట్ల రవాణా
పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడి
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్ల (పీసీ)కు 2024లోనూ బలమైన డిమాండ్ కొనసాగింది. వీటి షిప్‌మెంట్ (మార్కెట్‌కు రవాణా) 3.8 శాతం మేర పెరిగింది. మొత్తం 14.4 మిలియన్ యూనిట్ల పీసీల రవాణా జరిగినట్టు మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గేమింగ్, ఏఐ ఆధారిత పీసీలకు అధిక డిమాండ్ నెలకొన్నట్టు తెలిపింది. 2025లో పీసీ మార్కెట్ తక్కువ స్థాయి సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐడీసీ అంచనా వేసింది. ఈ మేరకు త్రైమాసిక వారీ పీసీ డివైజ్ ట్రాక్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ‘‘రూపాయి బలహీనపడడం పీసీల ధరలు పెరగడానికి దారితీసింది. ఇది చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలతోపాటు, వినియోగ విభాగంపై ప్రభావం చూపించింది’’అని ఐడీసీ ఇండియా, దక్షిణాసియా అసోసియేస్ వైస్ ప్రెసిడెంట్ (డివైజెస్ రీసెర్చ్) నవకేందర్ సింగ్ ప్రకటించారు.
అగ్రస్థానంలో హెచ్‌పీ
⇒ హెచ్‌పీ గతేడాది 30.1 శాతం పీసీల రవాణాతో (మార్కెట్‌కు) అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఈ సంస్థ మార్కెట్ వాటా 30 శాతంగా నమోదైంది. వార్షికంగా చూస్తే 1 శాతం, త్రైమాసికం వారీగా చూస్తే 1.8 శాతం చొప్పున రవాణా తగ్గింది.
⇒ లెనోవో సంస్థ 17.2 శాతం పీసీలను రవాణా చేసింది. అంతకుముందు ఏడాదితో పోలి్చతే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.
⇒ డెల్ 16.1 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. 8.1 శాతం వృద్ధిని చూపించింది. .
⇒ ప్రీమియం నోట్‌బుక్‌ల షిప్‌మెంట్ (1,000 డా లర్లకు పైన ధరలోనివి) గతేడాది 13.8% పెరిగింది.
⇒ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి పీసీలకు డిమాండ్ 10.6% మేర పెరిగింది.
⇒ 2024 చివరి మూడు నెలల కాలంలో (అక్టోబర్–డిసెంబర్) మొత్తం పీసీల మార్కెట్ 6.9 శాతం, నోట్‌బుక్ విభాగం 9.6 శాతం మేర వృద్ధి చెందాయి.
⇒ తైవాన్ కంపెనీ ఏసర్ 2024లో 27.7 శాతం మేర షిప్‌మెంట్‌లో వృద్ధిని చూపించింది. 15.1 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
⇒ ఆసుస్ 38.4 శాతం వృద్ధిని డిసెంబర్ త్రైమాసికంలో సాధించింది. అదే కాలంలో లెనోవో 13.5 శాతం అధికంగా షిప్‌మెంట్ చేసి 18.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
⇒ డెల్ సంస్థ డిసెంబర్ త్రైమాసికంలో 18.1 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. 5.8 శాతం వృద్ధిని చూపించింది. ఏసర్ కూడా డిసెంబర్ క్వార్టర్‌లో 20% వృద్ధిని నమోదు చేసి, 15.7 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
వర్క్‌స్టేషన్లకు మరింత డిమాండ్.
‘‘సంప్రదాయ పీసీ మార్కెట్ (డెస్క్ టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్‌స్టేషన్లు) 2024లో 14.4 మిలియన్ యూనిట్లను షిప్‌మెంట్ చేసింది. వార్షికంగా 3.8 శాతం వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా చూస్తే నోట్‌బుక్‌ల షిప్‌మెంట్ 4.5 శాతం మేర, డెస్క్ టాప్‌ల షిప్‌మెంట్ 1.8 శాతం మేర అధికంగా జరిగాయి. వర్క్‌స్టేషన్ల షిప్‌మెంట్ రికార్డు స్థాయిలో 10.9 శాతం పెరిగింది. నోట్‌బుక్‌లకు డిమాండ్ బలంగా ఉంది. వాణిజ్య పీసీ మార్కెట్ సైతం తాజా ఆర్డర్లతో పుంజుకుంది’’అని ఐడీసీ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment