personal computers
-
పీసీ అమ్మకాల జోరు.. ల్యాప్‌టాప్స్‌దే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) అమ్మకాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 33.9 లక్షల యూనిట్లు నమోదైంది. 2023 జూన్ త్రైమాసికంతో పోలిస్తే విక్రయాలు 7.1 శాతం పెరిగాయి. నాలుగు త్రైమాసికాలుగా పీసీ మార్కెట్ జోరు కొనసాగుతుండడం విశేషం.ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం.. 2023 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో డెస్క్‌టాప్స్ 5.9 శాతం, నోట్‌బుక్స్ 7.4, వర్క్‌స్టేషన్స్ 12.4 శాతం వృద్ధి చెందాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో మెరుగైన డిమాండ్‌తో కంజ్యూమర్ విభాగం 11.2 శాతం దూసుకెళ్లింది. ఈ–టైల్ చానెల్స్ 22.4 శాతం ఎగశాయి. వాణిజ్య విభాగం 3.5 శాతం అధికమైంది. అమ్మకాల వృద్ధి చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల విభాగంలో 12.4 శాతం, భారీ వ్యాపార సంస్థల సెగ్మెంట్లో 33.1 శాతం నమోదైంది. తిరిగి ఆఫ్‌లైన్ వైపు.. ఆఫ్‌లైన్ మీద కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయని పీసీ డిస్ట్రిబ్యూటర్ ఐటీ మాల్ ఎండీ అహ్మద్ అలీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఒకప్పుడు ఈ కామర్స్ కంపెనీలు డీలర్స్‌తో ఒప్పందం చేసుకుని పీసీలను విక్రయించేవి. కొన్నేళ్లుగా తయారీ సంస్థల నుంచి నేరుగా ఈ–కామర్స్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ–కామర్స్ సంస్థలు ప్రాచుర్యంలోకి రావడంతో తయారీ వ్యయం కంటే తక్కువకే పీసీలను డిమాండ్ చేస్తున్నాయి.దీంతో తయారీ సంస్థలు తిరిగి ఆఫ్‌లైన్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో ఉత్పత్తిదార్లకు కూడా మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రిటైలర్‌కు చేరువగా సర్వీస్ కేంద్రాలను విస్తరిస్తున్నాయి. ఆన్‌లైన్‌కు ఆఫ్‌లైన్‌కు ధరలో వ్యత్యాసం ఎక్కువ లేదు. ఆఫ్‌లైన్‌లో అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది. కంపెనీలు ఆఫ్‌లైన్‌లో ఎక్కువ మోడల్స్ ఆఫర్ చేస్తున్నాయి’ అని వివరించారు.గేమింగ్ హవా.. గేమింగ్ మార్కెట్ బాగా ప్రాచుర్యంలో వస్తోంది. ల్యాప్‌టాప్ సెగ్మెంట్లో గేమింగ్ 65 శాతం వాటా ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. మొత్తం పీసీ మార్కెట్లో ల్యాప్టాప్స్ వాటా అత్యధికంగా 75 శాతం దాకా ఉంది. డెస్క్‌టాప్స్ 10–12 శాతం, ఆల్ ఇన్ వన్స్ 8, వర్క్ స్టేషన్స్ 5 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. రూ.50–60 వేల ధరల శ్రేణిలో ఎక్కువగా పీసీలు అమ్ముడవుతున్నాయి. ఈ విభాగానికి అత్యధికంగా 45 శాతం వాటా ఉంది. పరిమాణం పరంగా రూ.40–50 వేల సెగ్మెంట్ 25–30 శాతం, రూ.20–40 వేల విభాగం 10 శాతం, రూ.60 వేల నుంచి రూ.1 లక్ష వరకు 8–10 శాతం వాటా ఉంది. రూ.1 లక్ష పైన ఖరీదు చేసే పీసీల వాటా 5 శాతం ఉంటుంది. భారత పీసీ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 8–10 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.హెచ్‌పీ వాటా 32శాతంవిక్రేతలు జూన్ త్రైమాసికంలో బ్యాక్ టు స్కూల్/కాలేజ్ ప్రచారాలను ప్రారంభించారు. ఆన్లైన్ విక్రయాల సమయంలో ఈ–టైల్ ఛానెల్లో మంచి డిమాండ్ కనిపించింది. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు భారీ అమ్మకాలకు నాంది పలికింది. తద్వారా కంజ్యూమర్ పీసీ షిప్మెంట్లలో ఆరోగ్యకర వృద్ధిని అందించింది. భారత పీసీ విపణలో 31.7 శాతం వాటాతో హెచ్‌పీ తొలి స్థానంలో నిలిచింది. లెనోవో 17.5 శాతం, డెల్ 14.8, ఏసర్ గ్రూప్ 14.7, ఏసస్ 7.1 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
అలా తీసి ఇలా పట్టుకెళ్లిపోవచ్చు.. ధర ఎంతంటే?
అమెరికన్ కంప్యూటర్స్ తయారీ సంస్థ 'హెచ్‌పీ' ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త 'ఎన్వీ మూవ్' (Envy Move) ఆల్ ఇన్ వన్ పీసీ లాంచ్ చేసింది. ఈ పీసీను మనతోపాటు తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉండేందుకు కంపెనీ హ్యాండిల్, ఫీట్ వంటి వాటిని అందించింది. దీంతో మనం ఒక బ్రీఫ్‌కేస్ మాదిరిగా తీసుకెళ్లవచ్చు. కొత్త హెచ్‌పీ ఎన్వీ మూవ్ ప్రారంభ ధర రూ.124990. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 అయిన ఈ కంప్యూటర్ టచ్ నావిగేషన్‌కు సపోర్ట్ చేసే 23.8 ఇంచెస్ క్యూహెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఆడియో కోసం బ్యాంగ్ & ఒలుఫ్సెన్ మేకర్స్ ఆడియో సిస్టమ్స్ పొందుపరిచారు. ఈ లేటెస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఓన్ వైడ్ విజన్ టెక్నాలజీతో అడ్జస్టబుల్ 5 మెగా పిక్సెల్ కెమెరా పొందుతుంది. ఈ కంప్యూటర్ భద్రతను లేదా సేఫ్టీకి దృష్టిలో ఉంచుకుని సంస్థ మాన్యువల్ ప్రైవేట్ షట్టర్, వాక్ అవే లాక్ వంటి మరిన్ని ఫీచర్స్ అందిస్తోంది. డిస్ప్లే: 23.8 ఇంచెస్ QHD IPS డిస్ప్లే, టచ్, 300 నిట్స్ బ్రైట్నెస్ ప్రాసెసర్: 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 గ్రాఫిక్స్: ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ర్యామ్: 16జీబీ LPDDR5 వరకు స్టోరేజ్: 1 టీబీ PCIe NVMe M.2 SSD కెమెరా: హెచ్‌పీ వైడ్ విజన్ 5ఎంపీ ఓఎస్: విండోస్ 11 హోమ్ పోర్ట్స్: 1 యూఎస్బీ టైప్-ఏ, 1 యూఎస్బీ టైప్-సీ, 1 HDMI పోర్ట్ కనెక్టివిటీ: Wi-Fi 6E, బ్లూటూత్ v5.3 ఛార్జింగ్: 90W బరువు: 4.1 కేజీలు హెచ్‌పీ కంపెనీ లాంచ్ చేసిన 'ఎన్వీ మూవ్' లాంటి కంప్యూటర్లు బహుశా ఇండియన్ మార్కెట్లో లేదనే చెప్పాలి, ఎందుకంటే పర్సనల్ కంప్యూటర్ మనతోపాటు తీసుకెళ్లడం అంటే కొంత కష్టమే, అయితే దీనికి హ్యాండిల్ ఉండటం వల్ల బ్రీఫ్‌కేస్ మాదిరిగా తీసుకెళ్లిపోవచ్చు. కాబట్టి ఇలాంటి కంప్యూటర్ దేశంలో ఇదే మొదటిదై ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఎన్వీ మూవ్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న PCలు చాలానే అందుబాటులో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. -
షూ కాదిది, కంప్యూటర్!, ధర ఎంతంటే?
చూడటానికి స్పోర్ట్స్ షూలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది పర్సనల్ కంప్యూటర్. మామూలు కంప్యూటర్ సీపీయూలో ఉండే మదర్బోర్డ్, ప్రాసెసర్, హార్డ్‌డిస్క్, ర్యామ్ వంటి భాగాలన్నీ ఇందులోనూ ఉంటాయి. దీనిని మానిటర్‌కు అనుసంధానించుకుని, చక్కగా పనిచేసుకోవచ్చు. ఇందులో 2టీబీ హార్డ్‌డిస్క్, 32జీబీ ర్యామ్, ఎన్విడియా ఆర్టీఎక్స్ 4070 జీపీయూ, ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్‌తో పనిచేసే 13700 సీపీయూ, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. అమెరికన్ కంపెనీ కూల్‌మాస్టర్ తన ముప్పయ్యో వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల స్పోర్ట్స్ షూ ఆకారంలో ఉండే ఈ పీసీని ‘సీఎంఓడీఎస్’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 6000 డాలర్లు (రూ.4.99 లక్షలు). -
యాపిల్, శాంసంగ్ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే..
ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung) భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌కు ఈ రెండు టెక్ దిగ్గజాలు దరఖాస్తు చేయలేదు. ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనేందుకు డెల్, లెనోవో, హెచ్పీతో సహా దాదాపు 40 ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అంగీకరించాయి. అయితే యాపిల్, శాంసంగ్ కంపెనీలు మాత్రం వద్దనుకున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఆ రెండు కంపెనీలు పీఎల్ఐ స్కీమ్‌ను వద్దనుకోవడానికి ప్రాథమిక కారణం స్మార్ట్ఫోన్లతో పోలిస్తే భారతదేశంలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు మార్కెట్ చాలా తక్కువగా ఉండటమే. ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌లో భారత్‌లో ఉన్నది కేవలం 2.4 శాతం మాత్రమే. కానీ స్మార్ట్ఫోన్లకు మాత్రం భారత్‌లో అత్యధిక మార్కెట్ ఉంది. పైగా యాపిల్, శాంసంగ్ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు కావు. కాబట్టి చైనా, వియత్నాం వంటి దేశాల నుంచి తయారీ కేంద్రాలను భారత్‌కు తరలించడం ఆర్థికంగా అంత లాభదాయకం కాదు. ఎక్కువ ఆదాయం వాటి నుంచే.. యాపిల్ కంపెనీకి ఆదాయం ప్రధానంగా ఐఫోన్ ఉత్పత్తుల నుంచే వస్తోంది. మాక్‌లు, ఐపాడ్ల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా చాలా తక్కువ. అందువల్లే ఈ సంస్థ భారత్‌లో మాక్‌లు, ఐపాడ్ల తయారీకి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ ప్రభుత్వ ఇన్‌వాయిస్‌లలోని వ్యత్యాసాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఆ కంపెనీ పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనకపోవడానికి కారణం కావచ్చు. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) PLI 2.0 స్కీమ్ భారత్‌లో తయారు చేసే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్, అల్ట్రా-స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ పరికరాలతో సహా వివిధ సాంకేతిక ఉత్పత్తులను కవర్ చేస్తుంది. చాలా కంపెనీలు దీని కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌కు మించి దరఖాస్తులు వచ్చాయి. -
ఆకస్మిక ఆంక్షలు: షాక్‌లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్!
ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్‌పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్‌ఇండియా, స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) లైసెన్స్‌లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్, ఇతర కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా. రానున్న దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్ పుంజుకోనున్న టైంలో లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్‌లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన. కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఇతర హార్డ్‌వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే. -
పీసీ మార్కెట్ 30 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) రవాణా (షిప్మెంట్/విక్రేతలకు సరఫరా) జనవరి–మార్చి త్రైమాసికంలో 29.92 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో షిప్‌మెంట్‌తో పోల్చి చూసినప్పుడు 30 శాతం తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికం పీసీ షిప్మెంట్ వివరాలను విడుదల చేసింది. 2022 ఏడాది మొదటి మూడు నెలల్లో మన దేశ మార్కెట్లో పీసీల షిప్మెంట్ 42.82 లక్షల యూనిట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంలో డెస్క్‌టాప్‌లకు డిమాండ్ ఉందని, నోట్‌బుక్‌ల డిమాండ్ మరో విడత బలహీనంగా నమోదై, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు 41 శాతం తగ్గినట్టు ఐడీసీ నివేదిక తెలిపింది. వినియోగ డిమాండ్ 36.1 శాతం తగ్గితే, వాణిజ్య డిమాండ్ 25.1 శాతం తగ్గింది. అగ్రస్థానంలోనే హెచ్‌పీ కంపెనీ హెచ్‌పీ కంపెనీ 33.8 శాతం వాటాను పీసీ మార్కె ట్లో కలిగి ఉంది. ఈ కంపెనీ పీసీల రవాణా మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 30.2 శాతం తగ్గింది. లెనోవో చేతిలో 15.7 శాతం వాటా ఉంది. లెనోవో పీసీ షిప్మెంట్ మార్చి త్రైమాసికంలో 37.5 శాతం క్షీణించి 4.72 లక్షల యూనిట్లుగా ఉంది. డెల్ మార్కెట్ వాటా 19.4 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది. 4.17 లక్షల పీసీలను షిప్ చేసింది. ఏసర్ గ్రూప్ వాటా 12.3 శా తంగా, ఆసుస్ మార్కెట్ వాటా 6.6 శాతం చొప్పున ఉంది. -
వచ్చే ఆరు నెలల్లో పీసీలకు డిమాండ్: హెచ్‌పీ ఇండియా
న్యూఢిల్లీ: వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) మార్కెట్ కోలుకుంటోందని, వచ్చే ఆరు నెలల్లో పీసీలకు అధిక డిమాండ్ వస్తుందని అంచనా వేస్తున్నట్టు హెచ్‌పీ ఇండియా తెలిపింది. కరోనా నాటితో పోలిస్తే పర్సనల్ కంప్యూటర్ల సంఖ్య పెరిగినట్టు హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ (పీసీలు) విక్రమ్ బేడీ పేర్కొన్నారు. ఇవి ఇంకా పెరిగేందుకు సానుకూలతలు ఉన్నట్టు చెప్పారు. హెచ్‌పీ ఇండియా మంగళవారం పలు నూతన ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా విక్రమ్ బేడీ మాట్లాడారు. హెచ్‌పీ 14, పెవిలియన్ ఎక్స్360, హెచ్‌పీ పెలివియన్ ప్లస్ 14 నోట్‌బుక్‌లను విడుదల చేయగా, వీటి ధరలు రూ.39,999 నుంచి రూ.81,999 మధ్యలో ఉన్నాయి. దేశ పీసీ మార్కెట్లో హెచ్‌పీ ఇండియాకి 30 శాతం మార్కెట్ వాటా ఉంది. -
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ, మార్కెట్లో హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ విడుదల!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ అతి తక్కువ ధరకే క్రోమ్‌బుక్ ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేసింది.హెచ్‌పీ క్రోమ్ బుక్ 15.6 అని పిలిచే క్రోమ్‌బుక్‌లో సెలెరాన్ N4500 ఆధారిత ప్రాసెసర్ ఉండగా.. మార్కెట్లో లభ్యమవుతున్న ఈ ల్యాప్‌టాప్‌ను స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు హెచ్‌పీ వెల్లడించింది. ఈ ల్యాప్‌ట్యాప్‌లో పెద్ద డిస్ప్లే, వైఫై 6 సపోర్ట్‌తో బలమైన కనెక్టివిటీ (stronger connectivity),11.5 గంటల బ్యాటరీ ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా హెచ్‌పీ క్రోమ్‌బుక్‌పై హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడీ మాట్లాడుతూ.. హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అందుబాటులోకి రావడంతో పర్సనల్ కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువుగా మారింది. అందుకే స్టైలిష్, శక్తివంతంగా ఉన్న ఈ క్రోమ్ బుక్ విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఈ క్రోమ్ బుక్ 15.6 ల్యాప్‌ట్యాప్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇంట్లో లేదా క్లాస్ రూమ్‌లో చదువుతున్నా కనెక్టివిటీ, ప్రొడక్టీవ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. HP Chromebook 15.6 ధర HP Chromebook 15.6 ప్రారంభ ధర రూ. 28,999కే లభిస్తుంది. ఫారెస్ట్ టీల్, మినరల్ సిల్వర్‌తో సహా రెండు వేరియంట్ కలర్స్‌తో అందుబాటులో ఉంది. HP Chromebook 15.6 స్పెసిఫికేషన్లు HP Chromebook మైక్రో-ఎడ్జ్ బెజెల్స్‌తో 15.6 ఇమ్మర్సివ్ డిస్ప్లేను కలిగి ఉంది. మైక్రో ఎడ్జ్ బెజెల్స్, 250 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, ముందు భాగంలో వీడియో కాల్స్ మాట్లాడేందుకు వీలుగా వైడ్ విజన్ హెచ్డీ కెమెరా ఉంది. వీటితో పాటు స్పీకర్ ఎన్‌క్లోజర్ డిజైన్‌తో పెద్ద డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. దీంతో పాటు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్లాస్‌రూమ్‌తో పాటు ఫైల్స్, ఫొటోలను తొందరగా పంపిచటానికి హెచ్‌పీ క్విక్ డ్రాప్ సదుపాయం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో నియర్‌బై షేర్ మాదిరిగానే పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365కు ఈ ల్యాప్‌టాప్ లో వినియోగించుకోవచ్చు. ఇక ఈ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ను 15.6ను నదులు, తీర ప్రాంతాల నుంచే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసే ప్లాస్టిక్‌తో, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. -
అరచేతిలో ఇమిడిపోయే పర్సనల్ కంప్యూటర్.. ధర ఎంతంటే?
పర్సనల్ కంప్యూటర్లలో కీలక భాగం సీపీయూ (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్). మానిటర్, కీబోర్డ్, మౌస్ వంటివన్నీ పీసీకి సాధనాలు మాత్రమే! సాధారణంగా పర్సనల్ కంప్యూటర్ బరువు దాదాపు ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు ఉంటుంది. ఇటీవల ఒక అమెరికన్ కంపెనీ ‘ఫ్యూజన్5 ఎఫ్ఎంపీ4’ బ్రాండ్ పేరుతో మినీ పీసీని అందుబాటులోకి తెచ్చింది. ఇది అరచేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. దీని బరువు 140 గ్రాములు మాత్రమే! సాధారణ పీసీకి ఉన్నట్లే దీనికి కూడా యూఎస్బీ పోర్టులు, హెచ్డీఎంఐ పోర్టు, హెడ్‌ఫోన్ జాక్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ వంటివన్నీ ఉంటాయి. ‘క్వాడ్‌కోర్ ఇంటెల్ ఎన్4120 ప్రాసెసర్’ అమర్చిన ఈ పీసీ ‘విండోస్–11’ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. డ్యూయల్ బాండ్ వైఫై కనెక్టివిటీ కూడా ఉండటంతో దీంట్లో ఇంటర్నెట్ వాడుకోవడం కూడా తేలికే! దీని ధర 249.99 డాలర్లు (రూ.20,622) మాత్రమే! -
పీసీ మార్కెట్ జోరు.. 37 లక్షల సేల్స్, తగ్గేదేలే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విపణి జోరు మీద ఉంది. ఏప్రిల్–జూన్‌లో 37 లక్షల యూనిట్ల డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, వర్క్ స్టేషన్స్ అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే ఇది 17.8 శాతం అధికం అని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. ఐడీసీ ప్రకారం.. మొత్తం విక్రయాల్లో 26 లక్షల యూనిట్లతో నోట్‌బుక్స్ విభాగం తన హవాను కొనసాగిస్తోంది. అయితే గడిచిన మూడు త్రైమాసికాల్లో నోట్‌బుక్స్ సగటున 30 శాతం వృద్ధి చెందితే 2022 ఏప్రిల్–జూన్‌లో ఇది 7.3 శాతానికే పరిమితం అయింది. 10 లక్షలకుపైగా డెస్క్‌టాప్స్ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఒక మిలియన్ యూనిట్లు దాటడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. ప్రభుత్వ విభాగాల నుంచి ఆర్డర్లు రావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణం. ఆన్లైన్ బిగ్ సేల్ప్సై ఆశలు.. డెస్క్‌టాప్స్ విక్రయాల విషయంలో గడిచిన మూడు త్రైమాసికాలతో పోలిస్తే ఎంటర్ప్రైస్ విభాగం తక్కువగా 14.9 శాతం వృద్ధి చెందింది. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల నుంచి ఆర్డర్లు రెండు త్రైమాసికాల కంటే తక్కువగా నమోదైంది. అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం భయం, డాలర్ ధర హెచ్చుతగ్గులు ముఖ్యంగా స్టార్టప్‌లలో పీసీల సేకరణను నెమ్మదించాయి. పెద్ద సంస్థలు ఆలస్యంగా కొనుగోలు చేస్తున్నాయి. రాబోయే ఆన్లైన్ బిగ్ సేల్స్ వినియోగదారుల విభాగంలో ఆశాకిరణంగా ఉండవచ్చు. అయితే వాణిజ్య విభాగంలో ప్రభుత్వ సంస్థల నుంచి బలమైన ఊపు, ఎంటర్ప్రైసెస్ నుంచి ఇప్పటికే ఉన్న ఆర్డర్లు సానుకూల అంశం. స్టోర్లకు కస్టమర్ల రాక.. కొన్ని త్రైమాసికాలుగా ఆన్లైన్ సేల్స్ క్రమంగా తగ్గుతున్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్లకు కస్టమర్ల రాక గణనీయంగా పెరుగుతోంది. పాఠశాలలు తెరవడం ప్రారంభించడంతో పీసీ మార్కెట్ వృద్ధి తగ్గింది. తద్వారా రిమోట్ లెర్నింగ్ డిమాండ్ తగ్గిందని ఐడీసీ ఇండియా పీసీ డివైసెస్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ భరత్ షెనాయ్ తెలిపారు. ‘కళాశాలల ప్రారంభం ఆలస్యమైంది. కళాశాలల ప్రమోషన్లతో తిరిగి అమ్మకాలు ఊపందుకుంటాయని విక్రేతలు ఇప్పటికీ ఆశిస్తున్నారు. ఆన్లైన్ అమ్మకాలు కూడా 2022 మూడవ త్రైమాసికం చివరిలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అధిక నిల్వలు ఆందోళన కలిగించే విషయం. రాబోయే కొద్ది నెలల్లో సరుకు నిల్వల దిద్దుబాటు అనివార్యం’ అని వివరించారు. ముందంజలో హెచ్‌పీ పీసీల అమ్మకాల్లో హెచ్‌పీ ముందంజలో ఉంది. ఏప్రిల్–జూన్ కాలంలో 30.8 శాతం మార్కెట్ వాటాతో 11.53 లక్షల యూనిట్లను ఈ సంస్థ విక్రయించింది. రెండవ స్థానంలో ఉన్న డెల్ వాటా 21.6 శాతంగా ఉంది. ఈ కంపెనీ 8.07 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. లెనోవో 19.6 శాతం వాటాతో 7.34 లక్షల యూనిట్లను విక్రయించింది. ఏసర్ గ్రూప్ 8.9 శాతం వాటాతో 3.32 లక్షలు, ఆసస్ 6.1 శాతం వాటాతో 4.86 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించాయి. చదవండి: ద్రవ్యోల్బణం: అధికారులతో ఆర్బీఐ గవర్నర్ భేటీ.. కీలక అంశాలు ఇవే! -
వర్క్‌ఫ్రం హోంతో పెరిగిన డిమాండ్.. మారిన శామ్సంగ్ వ్యూహం?
Samsung Laptops India, న్యూఢిల్లీ: కరోనా కారణంగా వర్క్‌ఫ్రం హోం కల్చర్ పెరగడంతో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైంది. ఉద్యోగులకు ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లు తప్పనిసరిగా మారిపోయాయి. దీంతో గత రెండేళ్లలో పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ పెరిగింది. దీనికి అనుగుణంగా శామ్సంగ్ తన వ్యాపార ప్రణాళికల్లో మార్పులు చేసింది. మార్చి 18 కొరియన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం శాంసంగ్ భారత్‌లో మళ్లీ పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) విభాగంలోకి అడుగుపెట్టింది. గెలాక్సీ బుక్ నోట్‌బుక్స్ సిరీస్‌ను ఆవిష్కరించింది. వీటికి మార్చి 18 నుంచి ప్రీ–బుకింగ్ ప్రారంభమవుతుంది. ధర రూ. 38,990–1,16,000 శ్రేణిలో ఉంటుంది. అత్యుత్తమ పనితీరు కనబర్చేలా వీటిని తీర్చిదిద్దినట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ (మొబైల్ విభాగం) రాజు పులన్ తెలిపారు. పీసీ విభాగంలో ఈ ఏడాది రెండంకెల స్థాయి మార్కెట్ వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు శాంసంగ్ ఇండియా జనరల్ మేనేజర్ సందీప్ పోస్వాల్ ఇటీవలే వెల్లడించారు. భారీ వృద్ధి డేటా కన్సల్టెన్సీ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం.. భారత్‌లో సంప్రదాయ పీసీల మార్కెట్ (డెస్క్‌టాప్‌లు, నోట్బుక్లు, వర్క్స్టేషన్లు మొదలైనవి) 2020తో పోలిస్తే 2021లో 44.5 శాతం వృద్ధి చెందింది. కంపెనీలు, వినియోగదారుల నుంచి డిమాండ్ నెలకొనడంతో డెస్క్‌టాప్‌ల అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీంతో శామ్సంగ్ ఈ మార్కెట్‌పై దృష్టి సారించింది. -
హాట్ కేకుల్లా డెస్క్ టాప్ సేల్స్!! భారత్‌లో కింగ్ మేకర్ ఎవరంటే!
కోవిడ్ కారణంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్‌హోమ్ తో దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ-డెస్క్‌టాప్),ల్యాప్‌ట్యాప్‌ల వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన క్యూ4 ఫలితాల్లో దేశీయంగా పర్సనల్ కంప్యూటర్లు 14.8 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్ జరిగినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. 1.3 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో హెచ్‌పీ సంస్థ మార్కెట్లో కింగ్ మేకర్‌గా నిలిచింది. ►2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగింది. ►క్యూ4లో వరుసగా రెండో త్రైమాసికంలో 1మిలియన్ యూనిట్లకు పైగా షిప్పింగ్ చేస్తూ 23.6శాతం షేర్‌తో డెల్ దేశీయ మార్కెట్లో రెండో స్థానంలో నిలించింది. ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నుండి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెల్ 38శాతం వాటాతో ఎంటర్ప్రైజ్ విభాగంలో ముందుంది. ►మరో టెక్ సంస్థ లెనోవో పీసీ సెగ్మెంట్లో 22.8శాతం వృద్ధిని సాధించింది. 24.7శాతం వాటాతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగం నుండి డిమాండ్ పెరగడంతో లెనోవో..,హెచ్‌పీ కంటే మందంజతో రెండవ స్థానంలో ఉంది. ►ఏసర్ 8.2శాతం, ఆసుస్ 5.9శాతం మార్కెట్ వాటాతో నాలుగు, ఐదవ స్థానాల్ని సంపాదించుకున్నాయి. డెస్క్‌టాప్ విభాగంగాలో ఏసర్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఇది 25.8శాతం మార్కెట్ వాటా ఉంది. ►ఆసుస్ సంవత్సరానికి 36.1శాతం వృద్ధి చెందింది. ఈ సందర్భంగా ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ (పీసీ డివైజెస్) భరత్ షెనాయ్ మాట్లాడుతూ వరుసగా రెండో సంవత్సరం సైతం విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది విద్యార్ధులు మాత్రం పెద్దస్క్రీన్, వాడుకలో సౌలభ్యం వంటి ఇతర ప్రయోజనాల కారణంగా పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
మేడిన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పీసీలు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు సహా వివిధ రకాల పర్సనల్ కంప్యూటర్లను భారత్‌లో తయారు చేయడం ప్రారంభించినట్లు టెక్ దిగ్గజం హెచ్‌పీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాలు కూడా కొనుగోలు చేసే విధంగా వీటిలో కొన్ని ఉత్పత్తులకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రభుత్వ విభాగాలు ఆర్డరు చేసేందుకు ఇవి అందుబాటులో ఉంటాయని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ కేతన్ పటేల్ తెలిపారు. ‘భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి చురుగ్గా పనిచేస్తున్నాం. కోట్ల కొద్దీ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మేకిన్ ఇండియా ప్రోగ్రాంకి అనుగుణంగా మేము దేశీయంగా తయారీని చేపట్టాము. మా తయారీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా స్వావలంబన భారత కల సాకారం కావడంలో అర్ధవంతమైన పాత్ర పోషించగలమని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కమర్షియల్ డెస్క్‌టాప్‌ల తయారీ కోసం ఫ్లెక్స్ సంస్థతో 2020 ఆగస్టులో హెచ్‌పీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగా తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లోని ఫ్లెక్స్ ప్లాంటులో పీసీలు, ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. తొలిసారిగా విస్తృత శ్రేణి .. హెచ్‌పీ ఎలీట్‌బుక్స్, హెచ్‌పీ ప్రోబుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్ వంటి విస్తృత శ్రేణి ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తయారు చేయడం ఇదే తొలిసారని సంస్థ పేర్కొంది. డెస్క్‌టాప్ మినీ టవర్స్ (ఎంటీ), మినీ డెస్క్‌టాప్స్ (డీఎం), స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ (ఎస్ఎఫ్ఎఫ్) డెస్క్‌టాప్స్, ఆల్–ఇన్–వన్ పీసీలు మొదలైన వాటిని కూడా తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల ఆప్షన్లతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు హెచ్‌పీ పేర్కొంది. ఫ్లెక్స్ ఫ్యాక్టరీ.. చెన్నై పోర్టుకు దగ్గర్లో ఉండటం వల్ల నిర్వహణపరమైన సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని, ల్యాప్‌టాప్‌లు..ఇతర పీసీ ఉత్పత్తులకు అవసరమైన ముడివస్తువులను సమకూర్చుకోవడం సులభతరంగా ఉంటుందని తెలిపింది. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్
ఇన్స్టాగ్రామ్ తన కోట్లాది మంది యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై పీసీలోనూ యాప్‌ను యధేచ్చగా ఉపయోగించుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. వెబ్ వెర్షన్ ద్వారా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే అవకాశం కల్పించింది. తొలుత ‘ఎన్‌గాడ్జెట్’లో కనిపించిన ఈ ఫీచర్.. ఇప్పుడు ఈ ఫీచర్ ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్ కంప్యూటర్లలో ఎడిట్ చేసుకున్న ఫొటోల్ని, హైలీ ప్రాసెస్డ్ ఇమేజ్‌లను సైతం అప్లోడ్ చేయొచ్చు. ఇంతకు ముందు కంప్యూటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు పంపించుకున్నాకే ఫొటోల్ని అప్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేదని తెలుసు కదా. ఇక మీదట ఆ అవసరం లేదు. కాకపోతే ఫీడ్ ఎక్స్ప్లోర్ కోసం, ఇన్స్టాగ్రామ్ మెసేజ్‌లను, మిగతా సమాచారాన్ని యాక్సెస్ చేసుకునే వీలుమాత్రం ఉండేది. ఇంతకాలం ఫోన్ ఆధారిత యాప్‌గా ఉన్న ఇన్స్టాగ్రామ్.. ఇప్పుడు కంప్యూటర్ ఆధారితం కూడా కావడంతో యూజర్లకు మరింత సులువుతరం కానుంది. అంతేకాదు యూజర్ల సంఖ్య మరింత పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఫేస్బుక్. చదవండి: పేరు మార్చుకోనున్న ఫేస్బుక్? కారణాలు ఏంటంటే.. -
తిరుపతిలో లెనోవో ట్యాబ్లెట్స్ తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు టెక్నాలజీ కంపెనీ లెనోవో తెలిపింది. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో పర్సనల్ కంప్యూటర్లు, నోట్‌బుక్స్, స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి సామర్థ్యం అధికం చేసినట్టు లెనోవో ఇండియా ఎండీ శైలేంద్ర కత్యాల్ వివరించారు. ‘వింగ్‌టెక్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ట్యాబ్లెట్ పీసీల తయారీని ప్రారంభించాం. సాధారణ కస్టమర్లు, విద్యార్థులతోపాటు రిటైల్, తయారీ, ఆరోగ్య సేవల రంగానికి అవసరమైన ట్యాబ్లెట్లను ఇక్కడ రూపొందిస్తున్నాం. పుదుచ్చేరిలోని పీసీల తయారీ ప్లాంటులో మూడవ లైన్ ఏర్పాటు చేశాం. డిక్సన్ టెక్నాలజీస్ సహకారంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో మోటరోలా బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నాం. భారత్‌తోసహా పలు దేశాల్లోని 30కిపైగా ప్లాంట్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 180 మార్కెట్లలో విక్రయిస్తోంది’ అని తెలిపారు. -
పర్సనల్ కంప్యూటర్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్సెట్ కొరత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) విభాగంపై స్పష్టంగా కనపడుతోంది. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని విధానం కారణంగా డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ సరఫరా ఆ స్థాయిలో జరగడం లేదు. ఇదే అదనుగా తయారీ కంపెనీలు ధరలను 50 శాతంపైగా పెంచాయి. లో ఎండ్ మోడళ్ల ఉత్పత్తిని దాదాపు నిలిపివేశాయి. రూ.50,000లోపు ధరలో ల్యాప్‌టాప్‌లు దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఆల్ ఇన్ వన్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్–జూన్ కాలంలో దేశవ్యాప్తంగా 32 లక్షల యూనిట్ల పీసీలు అమ్ముడైనట్టు సమాచారం. నిలిచిపోయిన సరఫరా.. ల్యాప్‌టాప్స్‌లో కొన్ని నెలల క్రితం వరకు రూ.17–25 వేల ధరల శ్రేణి వాటా 70 శాతం దాకా ఉండేది. రూ.26–40 వేల ధరల విభాగం 20 శాతం, రూ.40 వేలపైన ధరల్లో లభించే హై ఎండ్ మోడళ్ల వాటా 10 శాతం నమోదయ్యేది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మార్కెట్ అంతా హై ఎండ్ మోడళ్లతోనే నిండిపోయింది. వీటికి కూడా 40–50 శాతం కొరత ఉంది. ఇక లో ఎండ్ మోడళ్లు అయితే కానరావడం లేదు. 100 శాతం నగదు ఇచ్చి కొనేందుకు వినియోగదార్లు సిద్ధపడ్డా పీసీ దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితి పరిశ్రమలో ఇదే తొలిసారి అని ఐటీ మాల్ ఎండీ అహ్మద్ తెలిపారు. లో ఎండ్ ల్యాప్టాప్స్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. పేరుతోపాటు ధర కూడా.. కంపెనీలు ఎప్పటికప్పుడు మోడళ్ల పేరు మారుస్తున్నాయి. కొత్త స్టాక్ వచ్చిందంటే మోడల్ పేరు మారుతోంది. అంతేకాదు ఫీచర్లు మారకపోయినా ధరలను సవరిస్తున్నాయి. చిప్సెట్ కొరతను అడ్డుపెట్టుకుని పూర్తిగా హై ఎండ్ మోడళ్లవైపే మొగ్గు చూపుతున్నాయంటే కంపెనీలు ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయో అవగతమవుతోంది. కనీస ధరలు ల్యాప్‌టాప్ రూ.18 వేలది కాస్తా రూ.30 వేలకు చేరింది. హై ఎండ్‌లోనూ ధర 20 శాతంపైగా అధికమైంది. డెస్క్‌టాప్ రూ.25 వేల నుంచి రూ.38 వేలకు, ఆల్ ఇన్ వన్ రూ.30 వేల నుంచి రూ.43 వేలు అయింది. ప్రింటర్ల విషయంలో ఇంక్జెట్ రూ.2 వేల నుంచి రూ.4,500లు, లేజర్‌జెట్ రూ.9 వేలది కాస్తా రూ.16 వేలపైమాటే ఉంది. ధర పెరిగినా ప్రింటర్లు దొరకడం లేదు. -
క్లాసులు, ఉద్యోగం కంప్యూటర్‌తోనే...
హైదరాబాద్: ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం.. వెరసి దేశవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2020 జూలై–సెబర్‌లో దేశంలో 34 లక్షల యూనిట్ల డెస్క్‌టాప్స్, ల్యాప్టాప్స్, వర్క్‌స్టేషన్స్ అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9.2 శాతం అధికం. ఏడేళ్లలో ఒక త్రైమాసికంలో ఈ స్థాయి సేల్స్ జరగడం ఇదే తొలిసారి అని ఐడీసీ మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2019 సెపె్టంబర్ త్రైమాసికంలో 31 లక్షల పీసీలు విక్రయమయ్యాయి. ప్రభుత్వ, విద్యా సంబంధ ప్రాజెక్టులు తక్కువ ఉండడంతో కమర్షియల్ విభాగం 14 లక్షల యూనిట్లకు పరిమితమైంది. కంజ్యూమర్ విభాగం ఏకంగా 20 లక్షల యూనిట్లను చేరుకోవడం విశేషం. ఈ విభాగం క్రితం ఏడాదితో పోలిస్తే 41.7 శాతం, జూన్ త్రైమాసికంతో పోలిస్తే 167.2 శాతం వృద్ధి సాధించింది. సరఫరాను మించిన డిమాండ్.. పీసీ మార్కెట్లో సరఫరా కంటే డిమాండ్ అధికంగా ఉంది. ఒకానొక స్థాయిలో విక్రేతల వద్ద స్టాకు నిండుకుంది. ప్రస్తుత ట్రెండ్‌నుబట్టి చూస్తే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలోనూ అమ్మకాల్లో బలమైన వృద్ధి ఉండొచ్చని అంచనా. మొత్తం విక్రయాల్లో అగ్రస్థానంలో ఉన్న హెచ్‌పీ 28.2 శాతం వాటాను దక్కించుకుంది. లెనోవో 21.7 శాతం, డెల్ టెక్నాలజీస్ 21.3, ఏసర్ గ్రూప్ 9.5, ఆసస్ 7.5 శాతం వాటాను చేజిక్కించుకున్నాయి. యాపిల్ గతేడాదితో పోలిస్తే 19.4 శాతం అధికంగా అమ్మకాలు సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక సేల్స్‌తో రికార్డు నమోదు చేసింది. విద్యా సంస్థల్లో ఆన్లైన్ క్లాసులు కొనసాగనున్నందున పట్టణ ప్రాంతాల్లో నోట్‌బుక్స్ డిమాండ్ మరింత అధికం కానుందని ఐడీసీ తెలిపింది. భారత్‌లో పీసీల విస్తృతి ఇంకా తక్కువగానే ఉంది. బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ పెరుగుతున్నందున డిమాండ్ మరికొన్ని త్రైమాసికాలు బలంగా కొనసాగుతుందని ఐడీసీ ఇండియా ప్రతినిధి భరత్ షెనాయ్ వ్యాఖ్యానించారు. అమ్మకాల్లో నోట్‌బుక్స్‌దే హవా.. మొత్తం పీసీ విక్రయాల్లో నోట్‌బుక్స్‌దే అగ్రస్థానం. సెపె్టంబర్ క్వార్టర్లో గతేడాదితో పోలిస్తే ఇవి 70.1 శాతం వృద్ధి సాధించాయి. డెస్‌్కటాప్స్ కంటే నోట్‌బుక్స్‌కే కంపెనీలు మొగ్గుచూపడం ఇందుకు కారణం. కంపెనీలు పీసీల కోసం చేస్తున్న వ్యయాలు కొనసాగుతున్నాయి. జూన్‌తో పోలిస్తే కమర్షియల్ విభాగం సెప్టెంబర్ త్రైమాసికంలో కాస్త తగ్గాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత చిన్న, మధ్యతరహా కంపెనీలు పీసీల కొనుగోళ్లను పెంచాయి. ఈ విభాగంలో అమ్మకాలు 5.5 శాతం పెరిగాయి. పీసీ రంగంలో హైదరాబాద్ మార్కెట్లో 94 శాతం వరకు నోట్‌బుక్స్‌దే వాటా అని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. వీటిలో రూ.30–50 వేల ధరల శ్రేణి 65 శాతం కైవసం చేసుకుందని చెప్పారు. జూన్‌తో పోలిస్తే ఈఎంఐ వాటా 20 శాతం మెరుగైందన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సైబర్ బీమా!
కరోనా వైరస్ పరిశ్రమల రూపురేఖలను మార్చేసింది. వైరస్ విస్తరించకుండా చూసే లక్ష్యంతో సేవల రంగ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) విధానాన్ని ఆచరణలో పెట్టాయి. ఐటీ, మీడియా తదితర చాలా రంగాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. వైరస్ ఇప్పట్లో కనుమరుగు కాకపోవచ్చని, వ్యాక్సిన్ వచ్చే వరకు సామాజిక దూరం పాటించక తప్పదంటున్నారు నిపుణులు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం భవిష్యత్తులోనూ కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఈ విధానంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ సాయంతో ఇంటర్నెట్ ద్వారా కార్యాలయ సర్వర్లతో అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ దాడుల రిస్క్ ఎక్కువగా పొంచి ఉంటుంది. ఏ కొంచెం అవకాశం ఇచ్చినా సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లు, సర్వర్లలోకి చొచ్చుకుపోయి నష్టానికి కారణం కావచ్చు. కరోనా వైరస్ పేరుతో నిత్యం 2,600 సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నాయని ఇటీవలే చెక్ పాయింట్ సర్వే వెల్లడించింది. కనుక ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువైన డేటాతోపాటు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును జాగ్రత్తగా కాపాడుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒక చక్కని పరిష్కారం. సైబర్ దాడి జరిగితే ఎదురయ్యే నష్టాన్ని సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ భరిస్తుంది. కనుక ఆన్లైన్ వేదికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు, తమ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారాన్ని ఉంచుకునే వారు తప్పకుండా ఈ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. కవరేజీ వీటికి... దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థలు.. బజాజ్ అలియాంజ్ జనరల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థలు ఈ తరహా సైబర్ కవరేజీలను అందిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. హెచ్డీఎఫ్సీ ఎర్గో అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ సైబర్ పాలసీని అందిస్తోంది. ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ప్రతీ ఏటా దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థలను బట్టి కవరేజీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ప్రధానంగా గుర్తింపు చోరీ, అనధికారిక ఆన్లైన్ లావాదేవీలు (మీ ప్రమేయం లేకుండా వేరే వారు చేసేవి) ఈ–ఎక్ట్సార్షన్ (డబ్బు కోసం డిమాండ్ చేస్తూ దాడి చేయం), సైబర్ బుల్లీయింగ్ (బెదిరింపులు), మాల్వేర్ దాడులు (సాఫ్ట్వేర్ సాయంతో కంప్యూటర్లను అధీనంలోకి తీసుకోవడం), కీలకమైన సమాచార వివరాలను (పాస్వర్డ్, యూజర్ నేమ్ వంటివి) చోరీ చేసే ఫిషింగ్ దాడులు, ఈమెయిల్ స్పూఫింగ్ (తప్పుదోవ పట్టించే, మోసపూరిత మెయిల్స్) తదితర దాడుల నుంచి సైబర్ పాలసీల్లో రక్షణ ఉంటుంది. వీటి వల్ల జరిగిన నష్టానికి పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. పరిహారం అన్నది గరిష్టంగా మీరు తీసుకునే సమ్ ఇన్సూర్డ్ వరకేనని గమనించాలి. సైబర్ దాడుల కారణంగా ఎదురయ్యే న్యాయపరమైన చర్యల ఖర్చును కూడా బీమా సంస్థ నుంచి పొందే అవకాశం ఉంటుంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ సంస్థలు ఈ కవరేజీలు అన్నింటినీ ఆఫర్ చేస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అదనంగా సోషల్ మీడియా కవర్‌ను కూడా అందిస్తోంది. దీని కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రొఫైల్‌పై దాడుల వల్ల గుర్తింపు వివరాల నష్టం జరిగితే పరిహారం తీసుకోవచ్చు. ఈ దాడుల వల్ల వేతన నష్టం జరిగితే హెచ్డీఎఫ్సీ ఎర్గో పరిహారం (గరిష్టంగా ఏడు రోజులకు మించకుండా) ఇస్తోంది. మొబిక్విక్ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఐసీఐసీఐ లాంబార్డ్ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే అనధికారిక లావాదేవీల వల్ల కలిగే ఆర్థిక నష్టం, వేతన నష్టాలకు పరిహారం అందిస్తోంది. క్లెయిమ్ విధానం.. సైబర్ దాడి ఏదైనా కానీయండి.. ఏడు రోజుల్లోపు బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ లేదా ఫోన్ లేదా ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని అందించొచ్చు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తూ, ఆధారంగా అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇవి అందిన రోజు నుంచి 30 రోజుల్లోగా బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిష్కరిస్తుంది. క్లెయిమ్ ఫామ్, ఎఫ్ఐఆర్ కాపీ, సైబర్ దాడి జరిగినట్టు ఆధారాలు, లీగర్ నోటీసులు ఏవైనా అందుకుంటే ఆయా కాపీలను కూడా బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది. గమనించాల్సినవి.. సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో పరిమితులు, మినహాయింపులతో ఉంటాయి. ముఖ్యంగా పాలసీదారుడు ఒక ఏడాదిలో ఒకటే క్లెయిమ్ చేయగలరు. ఒకటికి మించి దాడులు ఏకకాలంలో జరిగితే ఇందులో ఎక్కువ నష్టం జరిగిన దాడికి సంబంధించి హెచ్డీఎఫ్సీ ఎర్గో పరిహారం చెల్లిస్తుంది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేస్తున్న సైబర్‌సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో పరిహారానికి సంబంధించి ఉప పరిమితులు ఉన్నాయి. అంటే ప్రతీ కవరేజీకి విడిగా గరిష్ట పరిహారాన్ని కంపెనీ పరిమితం చేసింది. ఉదాహరణకు ఫిషింగ్, ఐటీ చోరీలో పరిహారం అన్నది బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్)లో 25 శాతానికే పరిమితం అవుతుంది. ఉదాహరణకు రూ.1 లక్షకు పాలసీ తీసుకున్నట్టయితే ఫిషింగ్ ఘటనలో లభించే గరిష్ట పరిహారం రూ.25 వేలుగానే ఉంటుంది. అదే విధంగా ఈమెయిల్ స్పూఫింగ్‌లో గరిష్ట బీమా 15 శాతానికే పరిమితం అవుతుంది. మిగిలిన అన్ని దాడుల్లోనూ పరిహారం బీమా కవరేజీలో 10 శాతంగానే ఉంటుందని గమనించాలి. అదే విధంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో ఈ సెక్యూర్ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలో సైబర్ బుల్లీయింగ్, ఈ ఎక్ట్సార్షన్, ఈ రిప్యుటేషన్ (పేరు ప్రతిష్ట) నష్టానికి క్లెయిమ్ చేసుకోవాలంటే 45 రోజులు వేచి ఉండే నిబంధన అమల్లో ఉంది. అంటే పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాతే వీటి విషయంలో క్లెయిమ్ హక్కు లభిస్తుంది. అలాగే, ఈ రిప్యుటేషన్ నష్టం, గుర్తింపు వివ రాల చోరీ, ఈమెయిల్ స్పూఫింగ్ ఘటనల్లో లభించే పరిహారం గరిష్టంగా బీమా కవరేజీలో 25 శాతంగానే ఉంటుంది. ఫిషింగ్‌లో ఇది 15 శాతంగాను, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఈ ఎక్ట్సార్షన్, సైబర్ బుల్లీయింగ్, మాల్వేర్ దాడుల్లో గరిష్ట పరిహారం 10%. అదే విధంగా క్లెయిమ్ మొత్తం రూ.50,000 మించి ఉంటే కనీసం రూ. 3,500ను తగ్గించి ఇస్తుంది. ఐసీఐసీఐ లాం బార్డ్ సైబర్ పాలసీలో 10% లోపే ఆప్షన్ ఉంది. అంటే పాలసీదారు క్లెయిమ్ మొత్తంలో తన వంతుగా 10 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. -
28% పెరిగిన పీసీ అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశీ పర్సనల్ కంప్యూటర్ (పీసీ) అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 28.1 శాతం వృద్ధి చెందినట్లు రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. ఈకాలంలో 22.5 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఈ విభాగంలో హెచ్‌పీ 31.6% మార్కెట్ వాటాతో తన లీడర్ షిప్‌ను కొనసాగించగా.. ఆ తరువాత స్థానంలో ఉన్న డెల్ 23.7%, లెనొవో 18% మార్కెట్ వాటాను నిలబెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇక ఏడాది ప్రాతిపదికన నోట్‌బుక్స్ అమ్మకాలు 45.2 శాతం వృద్ధి చెంది మొత్తం పీసీ అమ్మకాలలో 61 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిపింది. -
6 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు
1955 నాటికి భారతదేశంలో కొన్ని డజన్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు మాత్రమే పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి. 1955 నుంచి 1970 వరకు కంప్యూటర్ వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించి తొలి దశగా పరిగణిస్తారు. 2010 నాటికి 6 కోట్ల మందికి పర్సనల్ కంప్యూటర్లు ఏర్పడ్డాయి. 2 కోట్ల 60 లక్షల మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. -
ఇక వాట్స్‌యాప్ @ డెస్క్‌టాప్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో అందుబాటులోకి శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్... డెస్క్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలోనూ గురువారం నుంచి తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. తద్వారా యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకునే వ్యూహాలకు కంపెనీ తెరతీసింది.గతేడాది సుమారు 19 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించి వాట్స్‌యాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్బుక్... ఈ కొత్త వెబ్ బ్రౌజర్ వెర్షన్ సర్వీసును ప్రారంభించింది. అయితే, ప్రస్తుతానికి దీన్ని గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ నుంచి అదీ ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు మాత్రమే వినియోగించుకునే వీలుంటుంది. ఐఫోన్లో వాట్స్‌యాప్ వాడుతున్న యూజర్లకు యాపిల్ కంపెనీ ప్లాట్‌ఫామ్ పరిమితుల కారణంగా ఈ వెబ్ సేవలు లభించవని వాట్స్‌యాప్ బ్లాగ్‌లో వెల్లడించింది. మొబైల్‌తో అనుసంధానం... యూజర్ తన ఫోన్లోని వాట్స్‌యాప్ అకౌంట్‌నే కంప్యూటర్లోని వెబ్ బ్రౌజర్ ద్వారా ఉపయోగించుకునేలా(మిర్రర్) ఈ సర్వీసు వీలుకల్పిస్తుందని వాట్స్‌యాప్ సంస్థ బ్లాగ్‌లో వెల్లడించింది. అంటే మొబైల్లోని వాట్స్యాప్కు ఎక్స్టెన్షన్ కింద లెక్క. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్స్యాప్కు 60 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నట్లు అంచనా. భారత్‌లో వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 7 కోట్లు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే.. యూజర్లు క్రోమ్ బ్రౌజర్లో ‘వెబ్.వాట్స్‌యాప్.కామ్’ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులోని క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేయాలి. దీంతో మొబైల్ ఫోన్లోని వాట్స్‌యాప్ అకౌంట్ బ్రౌజర్లో ప్రత్యక్షమవుతుంది. ఫోన్లో మెసేజ్‌లు పంపుకున్నట్లే బ్రౌజర్‌లోనూ దీన్ని ఉపయోగించొచ్చు. అయితే, మొబైల్లో తాజా వాట్స్‌యాప్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవడంతో పాటు మొబైల్‌ను నెట్‌తో కనెక్ట్ చేసి ఉంచడం తప్పనిసరి. -
విండోస్ 9 కాదు.. 10 వచ్చేసింది!
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యూజర్లను ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది. విండోస్ 9 వెర్షన్‌ను ప్రకటిస్తుందని అంతా ఎదురు చూస్తుంటే దాన్ని వదిలేసి ఏకంగా విండోస్ 10ను విడుదల చేసింది. ప్రజలకు ఏమాత్రం నచ్చని విండోస్ 8 స్థానంలో దాన్ని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీన విండోస్ 9ను విడుదల చేస్తుందని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో అనూహ్యంగా ఈ నిర్ణయం బయటకు వచ్చింది. టాబ్లెట్లు, ఫోన్లు, సాధారణ కంప్యూటర్లు.. అన్నింటికీ ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. విండోస్ 10 ఇప్పటివరకు తాము విడుదల చేసిన వాటిలో అత్యుత్తమం అవుతుందని మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ టెర్రీ మయర్సన్ అన్నారు. రెండేళ్ల క్రితం విడుదలైన విండోస్ 8ను కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని సాంకేతిక అంశాల పరిశోధన సంస్థ ఫారెస్టర్ తెలిపింది. చాలామంది పీసీ యూజర్లు ఈ ఇంటర్ఫేస్ను ఏమాత్రం ఇష్టపడలేదు. ఇంతకాలం ఉన్న స్టార్ట్ బటన్ పాపప్ మెనూ లేకపోవడం వాళ్లకు లోటుగా కనిపించింది. ఎక్స్‌బాక్స్ నుంచి పీసీ వరకు, ఫోన్ల నుంచి టాబ్లెట్ల వరకు, చిన్న చిన్న గాడ్జెట్లకు కూడా విండోస్ 10 సరిగ్గా సరిపోతుందని మయర్సన్ అంటున్నారు. యాపిల్ సంస్థ ఐఫోన్, ఐప్యాడ్లను విడుదల చేయడం, మరోవైపు గూగుల్ ఆండ్రాయిడ్ ఉత్పత్తులను విడుదల చేయడంతో విండోస్ పెద్దగా ఆదరణ పొందకపోవడం మైక్రోసాఫ్ట్‌ను కలవరపరుస్తోంది. దానికితోడు ఎక్స్పీ తర్వాత వచ్చిన ఉత్పత్తులేవీ పెద్దగా జనంలోకి వెళ్లలేదు. పదేళ్ల క్రితం పర్సనల్ కంప్యూటర్ల రంగంలో రారాజుగా ఉన్న విండోస్.. ఇప్పుడు కేవలం 14 శాతానికి మాత్రమే పరిమితమైందని గార్ట్నర్ సంస్థ తెలిపింది. -
సిటీజన్స్ స్క్రీన్ జంకీస్
గ్రేటర్లో సగం మంది రోజుకు ఎనిమిది గంటలపాటు డిజిటల్ స్క్రీన్లకు అతుక్కు పోతారట. ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్, మొబైల్ వీటిల్లో ఏదో ఒక తెరతో కుస్తీపడుతూ... కళ్లను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నట్లు తాజా ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే... ఈ విషయంలో మన సిటీ ముంబైతో పోటీపడుతోంది. ప్రముఖ కళ్లజోళ్ల సంస్థ టైటాన్ ఐవేర్ డివిజన్ ఆన్లైన్లో నిర్వహించిన ‘స్క్రీన్ జంకీ పోల్’లో పలు మెట్రో నగరాలకు చెందిన వెయ్యిమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలిపారు. జాతీయ స్థాయిలో మొత్తంగా 41 శాతం మంది ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల వంటివి వినియోగిస్తున్నట్టు తేలింది. సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు... ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్ వంటి విభిన్న రకాల తెరలను వీక్షిస్తున్న వారు ఢిల్లీలో కేవలం 11 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. వారాంతంలో మాత్రం ఇది 41 శాతానికి చేరుకోవడం విశేషం. ఇందులో ట్యాబ్లెట్స్ వినియోగించే వారే అధికం. - ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోవాసుల్లో 25 శాతం మంది మాత్రం రోజులో ఎక్కువ గంటలు టీవీని వీక్షించి కాలక్షేపం చేస్తున్నారు. - ఇక వీకెండ్లో డిజిటల్ తెరలను వీక్షిస్తున్న వారు ఢిల్లీలో 41 శాతం, అహ్మదాబాద్‌లో 68 శాతం, లక్నోలో 64 శాతం మంది. - భువనేశ్వర్‌లో 47 శాతం మంది మొబైల్స్, స్మార్ట ఫోన్లు వినియోగిస్తున్నారు. - లక్నోలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు వినియోగించేందుకు 50 శాతం మంది మక్కువ చూపుతున్నారు. - ట్యాబ్లెట్స్ వినియోగంలో దేశరాజధాని ఢిల్లీ వాసులు టాప్‌లో ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న వారిలో 7 శాతం మంది ట్యాబ్లెట్స్‌పై మనసు పారేసుకోవడం విశేషం. అతిగా వాడితే కళ్లకు చేటే.. గంటల తరబడి ఆయా తెరలతో కుస్తీపడుతున్న వాళ్లకు కళ్లకు సంబంధించిన సమస్యలు తప్పవని కంటి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా తెరలపై పనిచేయాల్సి వచ్చినపుడు,వీక్షిస్తున్నప్పుడు కళ్లకు చేటు చేయని నాణ్యమైన కళ్లజోళ్లు ధరించాలని సూచిస్తున్నారు. తరచూ కంటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.