హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) అమ్మకాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 33.9 లక్షల యూనిట్లు నమోదైంది. 2023 జూన్ త్రైమాసికంతో పోలిస్తే విక్రయాలు 7.1 శాతం పెరిగాయి. నాలుగు త్రైమాసికాలుగా పీసీ మార్కెట్ జోరు కొనసాగుతుండడం విశేషం.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం.. 2023 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో డెస్క్‌టాప్స్ 5.9 శాతం, నోట్‌బుక్స్ 7.4, వర్క్‌స్టేషన్స్ 12.4 శాతం వృద్ధి చెందాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మెరుగైన డిమాండ్‌తో కంజ్యూమర్ విభాగం 11.2 శాతం దూసుకెళ్లింది. ఈ–టైల్ చానెల్స్ 22.4 శాతం ఎగశాయి. వాణిజ్య విభాగం 3.5 శాతం అధికమైంది. అమ్మకాల వృద్ధి చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల విభాగంలో 12.4 శాతం, భారీ వ్యాపార సంస్థల సెగ్మెంట్లో 33.1 శాతం నమోదైంది.
తిరిగి ఆఫ్‌లైన్ వైపు..
ఆఫ్‌లైన్ మీద కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయని పీసీ డిస్ట్రిబ్యూటర్ ఐటీ మాల్ ఎండీ అహ్మద్ అలీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఒకప్పుడు ఈ కామర్స్ కంపెనీలు డీలర్స్‌తో ఒప్పందం చేసుకుని పీసీలను విక్రయించేవి. కొన్నేళ్లుగా తయారీ సంస్థల నుంచి నేరుగా ఈ–కామర్స్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ–కామర్స్ సంస్థలు ప్రాచుర్యంలోకి రావడంతో తయారీ వ్యయం కంటే తక్కువకే పీసీలను డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో తయారీ సంస్థలు తిరిగి ఆఫ్‌లైన్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో ఉత్పత్తిదార్లకు కూడా మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రిటైలర్‌కు చేరువగా సర్వీస్ కేంద్రాలను విస్తరిస్తున్నాయి. ఆన్‌లైన్‌కు ఆఫ్‌లైన్‌కు ధరలో వ్యత్యాసం ఎక్కువ లేదు. ఆఫ్‌లైన్‌లో అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది. కంపెనీలు ఆఫ్‌లైన్‌లో ఎక్కువ మోడల్స్ ఆఫర్ చేస్తున్నాయి’ అని వివరించారు.
గేమింగ్ హవా..
గేమింగ్ మార్కెట్ బాగా ప్రాచుర్యంలో వస్తోంది. ల్యాప్‌టాప్ సెగ్మెంట్లో గేమింగ్ 65 శాతం వాటా ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. మొత్తం పీసీ మార్కెట్లో ల్యాప్‌టాప్స్ వాటా అత్యధికంగా 75 శాతం దాకా ఉంది. డెస్క్‌టాప్స్ 10–12 శాతం, ఆల్ ఇన్ వన్స్ 8, వర్క్ స్టేషన్స్ 5 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. రూ.50–60 వేల ధరల శ్రేణిలో ఎక్కువగా పీసీలు అమ్ముడవుతున్నాయి. ఈ విభాగానికి అత్యధికంగా 45 శాతం వాటా ఉంది. పరిమాణం పరంగా రూ.40–50 వేల సెగ్మెంట్ 25–30 శాతం, రూ.20–40 వేల విభాగం 10 శాతం, రూ.60 వేల నుంచి రూ.1 లక్ష వరకు 8–10 శాతం వాటా ఉంది. రూ.1 లక్ష పైన ఖరీదు చేసే పీసీల వాటా 5 శాతం ఉంటుంది. భారత పీసీ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 8–10 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.
హెచ్‌పీ వాటా 32శాతం
విక్రేతలు జూన్ త్రైమాసికంలో బ్యాక్ టు స్కూల్/కాలేజ్ ప్రచారాలను ప్రారంభించారు. ఆన్‌లైన్ విక్రయాల సమయంలో ఈ–టైల్ ఛానెల్‌లో మంచి డిమాండ్ కనిపించింది. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు భారీ అమ్మకాలకు నాంది పలికింది. తద్వారా కంజ్యూమర్ పీసీ షిప్‌మెంట్లలో ఆరోగ్యకర వృద్ధిని అందించింది. భారత పీసీ విపణలో 31.7 శాతం వాటాతో హెచ్‌పీ తొలి స్థానంలో నిలిచింది. లెనోవో 17.5 శాతం, డెల్ 14.8, ఏసర్ గ్రూప్ 14.7, ఏసస్ 7.1 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment