PC market
-
పీసీ అమ్మకాల జోరు.. ల్యాప్‌టాప్స్‌దే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) అమ్మకాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 33.9 లక్షల యూనిట్లు నమోదైంది. 2023 జూన్ త్రైమాసికంతో పోలిస్తే విక్రయాలు 7.1 శాతం పెరిగాయి. నాలుగు త్రైమాసికాలుగా పీసీ మార్కెట్ జోరు కొనసాగుతుండడం విశేషం.ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం.. 2023 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో డెస్క్‌టాప్స్ 5.9 శాతం, నోట్‌బుక్స్ 7.4, వర్క్‌స్టేషన్స్ 12.4 శాతం వృద్ధి చెందాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో మెరుగైన డిమాండ్‌తో కంజ్యూమర్ విభాగం 11.2 శాతం దూసుకెళ్లింది. ఈ–టైల్ చానెల్స్ 22.4 శాతం ఎగశాయి. వాణిజ్య విభాగం 3.5 శాతం అధికమైంది. అమ్మకాల వృద్ధి చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల విభాగంలో 12.4 శాతం, భారీ వ్యాపార సంస్థల సెగ్మెంట్లో 33.1 శాతం నమోదైంది. తిరిగి ఆఫ్‌లైన్ వైపు.. ఆఫ్‌లైన్ మీద కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయని పీసీ డిస్ట్రిబ్యూటర్ ఐటీ మాల్ ఎండీ అహ్మద్ అలీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఒకప్పుడు ఈ కామర్స్ కంపెనీలు డీలర్స్‌తో ఒప్పందం చేసుకుని పీసీలను విక్రయించేవి. కొన్నేళ్లుగా తయారీ సంస్థల నుంచి నేరుగా ఈ–కామర్స్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ–కామర్స్ సంస్థలు ప్రాచుర్యంలోకి రావడంతో తయారీ వ్యయం కంటే తక్కువకే పీసీలను డిమాండ్ చేస్తున్నాయి.దీంతో తయారీ సంస్థలు తిరిగి ఆఫ్‌లైన్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో ఉత్పత్తిదార్లకు కూడా మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రిటైలర్‌కు చేరువగా సర్వీస్ కేంద్రాలను విస్తరిస్తున్నాయి. ఆన్‌లైన్‌కు ఆఫ్‌లైన్‌కు ధరలో వ్యత్యాసం ఎక్కువ లేదు. ఆఫ్‌లైన్‌లో అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది. కంపెనీలు ఆఫ్‌లైన్‌లో ఎక్కువ మోడల్స్ ఆఫర్ చేస్తున్నాయి’ అని వివరించారు.గేమింగ్ హవా.. గేమింగ్ మార్కెట్ బాగా ప్రాచుర్యంలో వస్తోంది. ల్యాప్‌టాప్ సెగ్మెంట్లో గేమింగ్ 65 శాతం వాటా ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. మొత్తం పీసీ మార్కెట్లో ల్యాప్టాప్స్ వాటా అత్యధికంగా 75 శాతం దాకా ఉంది. డెస్క్‌టాప్స్ 10–12 శాతం, ఆల్ ఇన్ వన్స్ 8, వర్క్ స్టేషన్స్ 5 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. రూ.50–60 వేల ధరల శ్రేణిలో ఎక్కువగా పీసీలు అమ్ముడవుతున్నాయి. ఈ విభాగానికి అత్యధికంగా 45 శాతం వాటా ఉంది. పరిమాణం పరంగా రూ.40–50 వేల సెగ్మెంట్ 25–30 శాతం, రూ.20–40 వేల విభాగం 10 శాతం, రూ.60 వేల నుంచి రూ.1 లక్ష వరకు 8–10 శాతం వాటా ఉంది. రూ.1 లక్ష పైన ఖరీదు చేసే పీసీల వాటా 5 శాతం ఉంటుంది. భారత పీసీ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 8–10 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.హెచ్‌పీ వాటా 32శాతంవిక్రేతలు జూన్ త్రైమాసికంలో బ్యాక్ టు స్కూల్/కాలేజ్ ప్రచారాలను ప్రారంభించారు. ఆన్లైన్ విక్రయాల సమయంలో ఈ–టైల్ ఛానెల్లో మంచి డిమాండ్ కనిపించింది. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు భారీ అమ్మకాలకు నాంది పలికింది. తద్వారా కంజ్యూమర్ పీసీ షిప్మెంట్లలో ఆరోగ్యకర వృద్ధిని అందించింది. భారత పీసీ విపణలో 31.7 శాతం వాటాతో హెచ్‌పీ తొలి స్థానంలో నిలిచింది. లెనోవో 17.5 శాతం, డెల్ 14.8, ఏసర్ గ్రూప్ 14.7, ఏసస్ 7.1 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
వచ్చే ఆరు నెలల్లో పీసీలకు డిమాండ్: హెచ్‌పీ ఇండియా
న్యూఢిల్లీ: వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) మార్కెట్ కోలుకుంటోందని, వచ్చే ఆరు నెలల్లో పీసీలకు అధిక డిమాండ్ వస్తుందని అంచనా వేస్తున్నట్టు హెచ్‌పీ ఇండియా తెలిపింది. కరోనా నాటితో పోలిస్తే పర్సనల్ కంప్యూటర్ల సంఖ్య పెరిగినట్టు హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ (పీసీలు) విక్రమ్ బేడీ పేర్కొన్నారు. ఇవి ఇంకా పెరిగేందుకు సానుకూలతలు ఉన్నట్టు చెప్పారు. హెచ్‌పీ ఇండియా మంగళవారం పలు నూతన ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా విక్రమ్ బేడీ మాట్లాడారు. హెచ్‌పీ 14, పెవిలియన్ ఎక్స్360, హెచ్‌పీ పెలివియన్ ప్లస్ 14 నోట్‌బుక్‌లను విడుదల చేయగా, వీటి ధరలు రూ.39,999 నుంచి రూ.81,999 మధ్యలో ఉన్నాయి. దేశ పీసీ మార్కెట్లో హెచ్‌పీ ఇండియాకి 30 శాతం మార్కెట్ వాటా ఉంది. -
పీసీ మార్కెట్‌కు కలిసిరాని క్యూ2
భారతీయ పీసీ మార్కెట్‌కు క్యూ2 పెద్దగా కలిసిరాలేదు. ఈ జూన్ త్రైమాసికంలో పీసీ మార్కెట్లో భాగమైన డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, వర్క్‌స్టేషన్స్‌లు మొత్తం కలిపి 21లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే క్యూ2లో 33లక్షల యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 37.3% క్షీణతను చవిచూసినట్లు ఐడీసీ గణాంకాలు తెలిపాయి. ఈ త్రైమాసికంలో డెస్క్‌టాప్ పీసీలకు డిమాండ్ తగ్గడంతో అమ్మకాల్లో 46% పతనాన్ని చవిచూశాయి. (చదవండి : ఇంట్లోనే ఆఫీస్ సెటప్!) కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో పీసీమార్కెట్ కేవలం 45రోజులు మాత్రమే పనిచేసింది. ఫలితంగా ఈ క్వార్టర్లో వినియోగదారుల విభాగంలో తక్కువ అమ్మకాలు జరిగినట్లు ఐడీసీ తెలిపింది. కరోనా వ్యాప్తి భయాలతో కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌కు ప్రాధాన్యతను నిచ్చాయని, దీంతో నోట్‌బుక్‌లకు బలమైన డిమాండ్ ఏర్పడంతో అమ్మకాల్లో 17.6% వృద్ధి పెరిగిందని ఐడీసీ తెలిపింది. లెనోవా కంపెనీ గత 5ఏళ్లలో అత్యధిక విక్రయాలు ఈ క్వార్టర్లో నమోదుచేసింది. ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ తమిళనాడుతో కుదుర్చుకున్న భారీ డీల్‌లో భాగంగా విక్రయాలు పెరిగినట్లు ఐడీసీ తెలిపింది. సప్లై, రవాణా సవాళ్లున్నప్పటికీ క్వార్టర్ తొలిభాగంలో కంపెనీలు పెద్దమొత్తంలో ఆర్డర్లనునిచ్చాయి. వర్క్ ఫ్రమ్‌హోమ్‌లో భాగంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు తొలిసారి నోట్‌బుక్స్ టెక్నాలజీని పరిచయం చేశాయి. దీర్ఘకాలంలో నోట్‌బుక్ కంపెనీలకు ఇదే డిమాండ్ ఉండే అవకాశం ఉందని ఐడీసీ వెల్లడించింది. -
ట్యాబ్స్ మార్కెట్ ఢమాల్ 2016లో 18 శాతం క్షీణత
న్యూఢిల్లీ: దేశీ ట్యాబ్లెట్ పీసీ మార్కెట్లో గతేడాది 18 శాతం క్షీణత నమోదయ్యింది. వీటి విక్రయాలు కేవలం 35 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. వార్షిక ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వీటి విక్రయాలు 16 శాతం తగ్గుదలతో 8.1 లక్షల యూనిట్లకు పడ్డాయి. ఈ విషయాలను ప్రముఖ రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ తన నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం.. డేటావిండ్ 34 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో శాంసంగ్ (18 శాతం), పాంటెల్ (12 శాతం), మైక్రోమ్యాక్స్ (10 శాతం) ఉన్నాయి. గతేడాది 2జీ ట్యాబ్స్ విక్రయాలు 92 శాతంమేర, 3జీ ట్యాబ్స్ అమ్మకాలు 71 శాతంమేర క్షీణించాయి. 4జీ ట్యాబ్స్ విక్రయాలు మాత్రం 6 శాతం పెరిగాయి. ఇక 2017లో ఐరిష్, బయోమెట్రిక్ ట్యాబ్స్‌కు మంచి ఆదరణ లభించనుంది. ప్రస్తుతం ట్యాబ్స్ మార్కెట్ స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తోందని, భవిష్యత్‌లో ఈ విభాగంలోని కంపెనీల సంఖ్య కేవలం 6–7కి పరిమితం కావొచ్చని సీఎంఆర్ అంచనా వేసింది. -
తగ్గుతున్న పీసీల విక్రయాలు
న్యూఢిల్లీ : పర్సనల్ కం ప్యూటర్ల(పీసీ) అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో తగ్గాయి. పీసీ మార్కెట్ క్షీణించడం ఇదే తొలిసారి. 2013-14లో 1.18 కోట్లు గా ఉన్న పీసీ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 10% క్షీణించి 1.06 కోట్లకు తగ్గాయని ఎంఏఐటీ-ఐఎంఆర్బీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక వివరాలను మెయిట్ ప్రెసిడెంట్ అమర్ బాబు వెల్లడించారు. దీని ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరంలో పీసీల అమ్మకాలు మరో 10 శాతం తగ్గుతాయి. కాగా నోట్‌బుక్‌ల విక్రయాలు 17 శాతం వృద్ధి చెందుతాయి. -
పీసీ అమ్మకాలు 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌ల విక్రయాల జోరు కారణంగా భారత్‌లో పర్సనల్ కంప్యూటర్లు అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో 32 లక్షల పీసీలు అమ్ముడయ్యాయని, 8 శాతం వృద్ధి నమోదైందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, గార్ట్నర్ తెలిపింది. ప్రభుత్వం నుంచి భారీగా ఆర్డర్లు రావడం, ల్యాప్‌టాప్ అమ్మకాలు అధికంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది. కాగా జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు భారత్‌లో పీసీ అమ్మకాలు 8.3 శాతం పెరిగాయని మరో అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. విద్య సంబంధిత ప్రాజెక్టుల నిమిత్తం వాణిజ్యపరమైన అమ్మకాలు అధికం కావడం దీనికి కారణమని వివరించింది. వ్యయ నియంత్రణకై కంపెనీలు ఖర్చులకు కళ్లెం వేసినప్పటికీ, స్కూళ్లు ప్రారంభం కావడం, ఓనమ్ పండుగ తదితర కారణాల వల్ల పీసీల అమ్మకాలు పెరిగాయి.