ట్యాబ్స్ మార్కెట్ ఢమాల్ 2016లో 18 శాతం క్షీణత
న్యూఢిల్లీ: దేశీ ట్యాబ్లెట్ పీసీ మార్కెట్‌లో గతేడాది 18 శాతం క్షీణత నమోదయ్యింది. వీటి విక్రయాలు కేవలం 35 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. వార్షిక ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వీటి విక్రయాలు 16 శాతం తగ్గుదలతో 8.1 లక్షల యూనిట్లకు పడ్డాయి. ఈ విషయాలను ప్రముఖ రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ తన నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం.. డేటావిండ్ 34 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది.
దీని తర్వాతి స్థానాల్లో శాంసంగ్ (18 శాతం), పాంటెల్ (12 శాతం), మైక్రోమ్యాక్స్ (10 శాతం) ఉన్నాయి. గతేడాది 2జీ ట్యాబ్స్ విక్రయాలు 92 శాతంమేర, 3జీ ట్యాబ్స్ అమ్మకాలు 71 శాతంమేర క్షీణించాయి. 4జీ ట్యాబ్స్ విక్రయాలు మాత్రం 6 శాతం పెరిగాయి. ఇక 2017లో ఐరిష్, బయోమెట్రిక్ ట్యాబ్స్‌కు మంచి ఆదరణ లభించనుంది. ప్రస్తుతం ట్యాబ్స్ మార్కెట్ స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తోందని, భవిష్యత్‌లో ఈ విభాగంలోని కంపెనీల సంఖ్య కేవలం 6–7కి పరిమితం కావొచ్చని సీఎంఆర్ అంచనా వేసింది.