వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు సైబర్‌ బీమా! | COVID-19: Work from home makes you vulnerable to cyber attacks | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు సైబర్‌ బీమా!

Published Mon, May 4 2020 12:41 AM | Last Updated on Mon, May 4 2020 3:10 AM

COVID-19: Work from home makes you vulnerable to cyber attacks - Sakshi

కరోనా వైరస్‌ పరిశ్రమల రూపురేఖలను మార్చేసింది. వైరస్‌ విస్తరించకుండా చూసే లక్ష్యంతో సేవల రంగ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (ఇంటి నుంచే పని) విధానాన్ని ఆచరణలో పెట్టాయి. ఐటీ, మీడియా తదితర చాలా రంగాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. వైరస్‌ ఇప్పట్లో కనుమరుగు కాకపోవచ్చని, వ్యాక్సిన్‌ వచ్చే వరకు సామాజిక దూరం పాటించక తప్పదంటున్నారు నిపుణులు. దీంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం భవిష్యత్తులోనూ కొనసాగొచ్చని భావిస్తున్నారు.

ఈ విధానంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ సాయంతో ఇంటర్నెట్‌ ద్వారా కార్యాలయ సర్వర్లతో అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్‌ దాడుల రిస్క్‌ ఎక్కువగా పొంచి ఉంటుంది. ఏ కొంచెం అవకాశం ఇచ్చినా సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లు, సర్వర్లలోకి చొచ్చుకుపోయి నష్టానికి కారణం కావచ్చు. కరోనా వైరస్‌ పేరుతో నిత్యం 2,600 సంస్థలపై సైబర్‌ దాడులు జరుగుతున్నాయని ఇటీవలే చెక్‌ పాయింట్‌ సర్వే వెల్లడించింది.

కనుక ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువైన డేటాతోపాటు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును జాగ్రత్తగా కాపాడుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ఒక చక్కని పరిష్కారం. సైబర్‌ దాడి జరిగితే ఎదురయ్యే నష్టాన్ని సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ భరిస్తుంది. కనుక ఆన్‌లైన్‌ వేదికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారు, తమ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారాన్ని ఉంచుకునే వారు తప్పకుండా ఈ సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు.

కవరేజీ వీటికి...
దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థలు.. బజాజ్‌ అలియాంజ్‌ జనరల్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్‌ బీమా సంస్థలు ఈ తరహా సైబర్‌ కవరేజీలను అందిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో అయితే ఫ్యామిలీ ఫ్లోటర్‌ సైబర్‌ పాలసీని అందిస్తోంది. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. ప్రతీ ఏటా దీన్ని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థలను బట్టి కవరేజీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

ప్రధానంగా గుర్తింపు చోరీ, అనధికారిక ఆన్‌లైన్‌ లావాదేవీలు (మీ ప్రమేయం లేకుండా వేరే వారు చేసేవి) ఈ–ఎక్ట్సార్షన్‌ (డబ్బు కోసం డిమాండ్‌ చేస్తూ దాడి చేయం), సైబర్‌ బుల్లీయింగ్‌ (బెదిరింపులు), మాల్వేర్‌ దాడులు  (సాఫ్ట్‌వేర్‌ సాయంతో కంప్యూటర్లను అధీనంలోకి తీసుకోవడం), కీలకమైన సమాచార వివరాలను (పాస్‌వర్డ్, యూజర్‌ నేమ్‌ వంటివి) చోరీ చేసే ఫిషింగ్‌ దాడులు, ఈమెయిల్‌ స్పూఫింగ్‌ (తప్పుదోవ పట్టించే, మోసపూరిత మెయిల్స్‌) తదితర దాడుల నుంచి సైబర్‌ పాలసీల్లో రక్షణ ఉంటుంది.

వీటి వల్ల జరిగిన నష్టానికి పరిహారం కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. పరిహారం అన్నది గరిష్టంగా మీరు తీసుకునే సమ్‌ ఇన్సూర్డ్‌ వరకేనని గమనించాలి. సైబర్‌ దాడుల కారణంగా ఎదురయ్యే న్యాయపరమైన చర్యల ఖర్చును కూడా బీమా సంస్థ నుంచి పొందే అవకాశం ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, బజాజ్‌ అలియాంజ్‌ సంస్థలు ఈ కవరేజీలు అన్నింటినీ ఆఫర్‌ చేస్తున్నాయి.

బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ అదనంగా సోషల్‌ మీడియా కవర్‌ను కూడా అందిస్తోంది. దీని కింద సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రొఫైల్‌పై దాడుల వల్ల గుర్తింపు వివరాల నష్టం జరిగితే పరిహారం తీసుకోవచ్చు. ఈ దాడుల వల్ల వేతన నష్టం జరిగితే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో పరిహారం (గరిష్టంగా ఏడు రోజులకు మించకుండా) ఇస్తోంది. మొబిక్‌విక్‌ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఐసీఐసీఐ లాంబార్డ్‌ సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అయితే అనధికారిక లావాదేవీల వల్ల కలిగే ఆర్థిక నష్టం, వేతన నష్టాలకు పరిహారం అందిస్తోంది.  

క్లెయిమ్‌ విధానం..
సైబర్‌ దాడి ఏదైనా కానీయండి.. ఏడు రోజుల్లోపు బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్‌ లేదా ఫోన్‌ లేదా ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని అందించొచ్చు. క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేస్తూ, ఆధారంగా అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇవి అందిన రోజు నుంచి 30 రోజుల్లోగా బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిష్కరిస్తుంది. క్లెయిమ్‌ ఫామ్, ఎఫ్‌ఐఆర్‌ కాపీ, సైబర్‌ దాడి జరిగినట్టు ఆధారాలు, లీగర్‌ నోటీసులు ఏవైనా అందుకుంటే ఆయా కాపీలను కూడా బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది.


గమనించాల్సినవి..
సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఎన్నో పరిమితులు, మినహాయింపులతో ఉంటాయి. ముఖ్యంగా పాలసీదారుడు ఒక ఏడాదిలో ఒకటే క్లెయిమ్‌ చేయగలరు. ఒకటికి మించి దాడులు ఏకకాలంలో జరిగితే ఇందులో ఎక్కువ నష్టం జరిగిన దాడికి సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో పరిహారం చెల్లిస్తుంది. బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ఆఫర్‌ చేస్తున్న సైబర్‌సేఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో పరిహారానికి సంబంధించి ఉప పరిమితులు ఉన్నాయి. అంటే ప్రతీ కవరేజీకి విడిగా గరిష్ట పరిహారాన్ని కంపెనీ పరిమితం చేసింది.

ఉదాహరణకు ఫిషింగ్, ఐటీ చోరీలో పరిహారం అన్నది బీమా మొత్తం (సమ్‌ ఇన్సూర్డ్‌)లో 25 శాతానికే పరిమితం అవుతుంది. ఉదాహరణకు రూ.1 లక్షకు పాలసీ తీసుకున్నట్టయితే ఫిషింగ్‌ ఘటనలో లభించే గరిష్ట పరిహారం రూ.25 వేలుగానే ఉంటుంది. అదే విధంగా ఈమెయిల్‌ స్పూఫింగ్‌లో గరిష్ట బీమా 15 శాతానికే పరిమితం అవుతుంది. మిగిలిన అన్ని దాడుల్లోనూ పరిహారం బీమా కవరేజీలో 10 శాతంగానే ఉంటుందని గమనించాలి. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఈ సెక్యూర్‌ సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో సైబర్‌ బుల్లీయింగ్, ఈ ఎక్ట్సార్షన్, ఈ రిప్యుటేషన్‌ (పేరు ప్రతిష్ట) నష్టానికి క్లెయిమ్‌ చేసుకోవాలంటే 45 రోజులు వేచి ఉండే నిబంధన అమల్లో ఉంది.

అంటే పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాతే వీటి విషయంలో క్లెయిమ్‌ హక్కు లభిస్తుంది. అలాగే, ఈ రిప్యుటేషన్‌ నష్టం, గుర్తింపు వివ రాల చోరీ, ఈమెయిల్‌ స్పూఫింగ్‌ ఘటనల్లో లభించే పరిహారం గరిష్టంగా బీమా కవరేజీలో 25 శాతంగానే ఉంటుంది. ఫిషింగ్‌లో ఇది 15 శాతంగాను, సైకలాజికల్‌ కౌన్సిలింగ్, ఈ ఎక్ట్సార్షన్, సైబర్‌ బుల్లీయింగ్, మాల్వేర్‌ దాడుల్లో గరిష్ట పరిహారం 10%. అదే విధంగా క్లెయిమ్‌ మొత్తం రూ.50,000 మించి ఉంటే కనీసం రూ. 3,500ను తగ్గించి ఇస్తుంది. ఐసీఐసీఐ లాం బార్డ్‌ సైబర్‌ పాలసీలో 10% లోపే ఆప్షన్‌ ఉంది. అంటే పాలసీదారు క్లెయిమ్‌ మొత్తంలో తన వంతుగా 10 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement