స్మార్ట్‌వాచ్‌..ఇష్టం తగ్గింది!  | India smartwatch market faces first major decline by 30 percent | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌వాచ్‌..ఇష్టం తగ్గింది! 

Mar 2 2025 5:57 AM | Updated on Mar 2 2025 5:57 AM

India smartwatch market faces first major decline by 30 percent

2024 విక్రయాలు 30 శాతం డౌన్‌

కొత్తదనం లేకపోవడంతో క్షీణత 

ప్రీమియం విభాగంలోనే వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌వాచెస్‌ పట్ల జనంలో ఆసక్తి తగ్గిందా? 2024 అమ్మకాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2023తో పోలిస్తే గత ఏడాది స్మార్ట్‌వాచ్‌ల విక్రయాలు ఏకంగా 30 శాతం క్షీణించాయి. అసంతృప్తికర అనుభవం, ఆవిష్కరణలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం అని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. తక్కువ ధర కలిగిన స్మార్ట్‌వాచెస్‌ విభాగంలో ప్రముఖ బ్రాండ్స్‌ భారీగా దెబ్బ తిన్నాయి. బలహీన అప్‌గ్రేడ్‌ సైకిల్స్, మొదటిసారి కొనుగోలుదార్లలో అసంతృప్తికర వినియోగ అనుభవాల కారణంగా అనేక సంవత్సరాల స్థిర వృద్ధి తర్వాత మొదటిసారిగా భారీ తగ్గుదల అని కౌంటర్‌పాయింట్‌ తెలిపింది.  

బ్రాండ్స్‌వారీగా ఇలా.. 
ప్రతికూల కస్టమర్‌ సెంటిమెంట్‌ ప్రభావం ప్రధానంగా టాప్‌–3 బ్రాండ్స్‌ ఫైర్‌ బోల్ట్, బోట్, నాయిస్‌పై చూపింది. ఫైర్‌ బోల్ట్‌ సేల్స్‌ 54 శాతం తగ్గాయి. బోట్‌ 47 శాతం, నాయిస్‌ 26 శాతం క్షీణతను నమోదు చేశాయి. సరఫరాలు తగ్గినప్పటికీ ఈ మూడు బ్రాండ్స్‌ మార్కెట్‌ను నడిపించాయని నివేదిక వివరించింది. తొలి స్థానంలో ఉన్న నాయిస్‌ 27 శాతం మార్కెట్‌ వాటాతో మార్కెట్‌ను ముందుకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత ఫైర్‌–బోల్ట్‌ 19 శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది. 2023లో ఈ కంపెనీ మార్కెట్‌ వాటా 30 శాతం. 2023లో 17 శాతంగా ఉన్న బోట్‌ వాటా గత ఏడాది 13 శాతానికి వచ్చి చేరింది. గత సంవత్సరంలో బౌల్ట్‌ సేల్స్‌ దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఫాస్ట్రాక్ మాతృ బ్రాండ్‌ అయిన టైటాన్‌ 35 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన ఏకైక కంపెనీగా నిలిచింది.  

పరిస్థితుల్లో మార్పు.. 
హెల్త్‌ ట్రాకింగ్, అవసరమైన సెన్సార్లపై వినియోగదారుల అవగాహన పెరిగేకొద్దీ.. కస్టమర్ల అనుభవాన్ని మార్చగల అధిక–నాణ్యత మోడళ్లలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు ఎక్కువ మొగ్గు చూపుతాయని నివేదిక వివరించింది. ‘డిమాండ్‌ను ప్రోత్సహించడానికి తయారీ సంస్థలు ఈ విభాగంలో కస్టమర్‌ నమ్మకాన్ని పునరి్నరి్మంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకురావడం, వినియోగదారులు వారి పాత స్మార్ట్‌వాచ్‌లను భర్తీ చేయడం వల్ల పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇదే జరిగితే 2025 విక్రయాల్లో సింగిల్‌ డిజిట్‌ స్థాయిలో తగ్గుదల అంచనా వేస్తున్నాం’ అని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు బల్బీర్‌ సింగ్‌ అన్నారు.   

ప్రీమియం.. మహా జోరు.. 
ఆసక్తికర అంశం ఏమంటే రూ.20,000 కంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ల విభాగం మాత్రం దూసుకుపోతోంది. ఈ విభాగంలో అమ్మకాలు 147 శాతం పెరిగాయి. అనుభవజు్ఞలైన వినియోగదారులు అధునాతన, తదుపరితరం స్మార్ట్‌వాచెస్‌ వైపు మళ్లడం ఈ వృద్ధికి కారణం. దిగ్గజ బ్రాండ్లలో యాపిల్, సీఎంఎఫ్‌ బై నథింగ్‌ అత్యధిక వార్షిక వృద్ధిని సాధించాయి. ప్రీమియం విభాగంలో యాపిల్, సామ్‌సంగ్, వన్‌ప్లస్‌ టాప్‌–3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. తయారీ కంపెనీలు ఇప్పుడు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, సెల్యులర్‌ కనెక్టివిటీ వంటి కొత్త ఫీచర్లను చేర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని కౌంటర్‌పాయింట్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అన్షిక జైన్‌ వివరించారు. అదే సమయంలో అధిక ధరల్లో మోడళ్లను క్రమంగా పెంచడంతోపాటు పిల్లల విభాగాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయని అన్నారు.  

నెమ్మదైన రీప్లేస్‌మెంట్‌.. తక్కువ ధర విభాగాలలో మోడళ్ల మధ్య పెద్దగా తేడా లేకపోవడం, తక్కువ సెన్సార్‌ ఖచ్చితత్వం, సరైన మోడల్‌ను ఎంచుకోవడం కష్టతరం చేసిన అస్పష్ట ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో, అసంతృప్తికరమైన అనుభవం.. వెరశి రీప్లేస్‌మెంట్‌ చక్రం నెమ్మదిగా సాగిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక వివరించింది. మొదటి సారి వినియోగదారుల సంఖ్య తిరోగమనం, బ్రాండ్స్‌ మధ్య ధరల యుద్ధాలు.. విలువ, పరిమాణంలో మరింత తగ్గుదలకు దారితీశాయి. అయితే వృద్ధిలో తగ్గుదల తాత్కాలిక విరామం మాత్రమే అని నివేదిక వివరించింది. స్మార్ట్‌వాచ్‌ల వినియోగ స్థాయి ఇప్పటికీ తక్కువగా ఉన్నందున భవిష్యత్తులో కొనుగోళ్ల శాతం పెరగవచ్చని పేర్కొంది.  

ఐడీసీ ప్రకారం భారత్‌లో వేరబుల్స్‌ మార్కెట్‌ మొదటిసారిగా 2024లో వార్షిక క్షీణతను చవి చూసింది. మొత్తం విక్రయాలు 11.3% తిరోగమనం చెంది 11.9 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి. స్మార్ట్‌వాచ్‌ అమ్మకాలు 34.4% తగ్గి 3.5 కోట్ల యూనిట్లకు పడిపోవడం ఈ క్షీణతకు ప్రధాన కారణం. 2023లో వేరబుల్స్‌ పరిశ్రమలో స్మార్ట్‌వాచ్‌ల వాటా 39.8% నమోదైంది. గత ఏడాది వీటి వాటా 29.4%కి వచ్చి చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement