
పండగ వేళ.. గుది‘బండ’
సాక్షి, రాజమండ్రి : ఇంట్లో గ్యాస్ నిండుకుందా. అయితే మీకు తిప్పలు తప్పవు. రెండు వారాలు దాటినా గ్యాస్ ఇంటికి రాదు. డీలర్ వద్దకెళ్లి స్పాట్ బుకింగ్ చేసుకుందామనుకున్నా, వందల్లో జనం క్యూలో పడిగాపులు పడుతుంటారు. ఉదయం 8 గంటలకు వెళ్లి, పది గంటలకు ఆఫీసు సమయంలోగా గ్యాస్ ఇంట్లో పడేసుకుందాం అనుకుంటే.. ఆ పప్పులేం ఉడకవు. కనీసం రెండు రోజులు సెలవు పెట్టి క్యూలో నిలబడాల్సిందే.
ఎందుకంటే జిల్లాలో ఈ పండగల సీజన్‌లో జనానికి గ్యాస్ కష్టాలు పట్టుకున్నాయి. మూడు వారాలుగా వినియోగదారులకు పంపిణీ అయ్యే గ్యాస్ సరఫరాలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఐవీఆర్‌ఎస్ ద్వారా బుక్ చేసుకున్న వారికి సుమారు 15 నుంచి 20 రోజుల్లో కానీ గ్యాస్ సరఫరా కావడం లేదు. సిలిండర్ ఎందుకు రాలేదని డీలర్‌ను అడిగితే.. మీ వద్ద ఉన్న ఐవీఆర్‌ఎస్ నంబరులో డయల్ చేస్తే విషయం తెలుస్తుందని ఉచిత సలహా పడేస్తున్నారు.
గతంలో లేదిలా..
ఏడాది కాలంగా జిల్లాలో సిలిండర్ బుక్ చేస్తే గరిష్టంగా వారం రోజుల్లో ఇంటికి వచ్చేది. కొంతమంది బుకింగ్‌తో ప్రమేయం లేకుండా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి, స్పాట్ బుకింగ్ ద్వారా సిలిండర్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ నెల రోజులుగా వినియోగదారుల ఇంట్లో బండ నిండుకుంటే.. ఓ గండం ఎదురవుతోంది. డీలర్ వద్దకు వెళితే స్టాక్ లేదంటాడు. స్టాక్ ఉంటే.. వందల జనం క్యూలో ఉంటున్నారు. కష్టపడి క్యూలో నిలబడితే, వారి నంబరు వచ్చేసరికి ‘నో స్టాక్’ అంటున్నారు. శ్రావణ మాసం నుంచి ఇళ్లల్లో పండగలు వరుసగా వస్తుంటాయి. వినాయక చవితి పూట కూడా ఇదే స్థితి ఎదురైనా సర్దుకుంటుందేమో అని భావించిన జనానికి రానురాను పరిస్థితి మరింత జటిలమవుతోంది. దసరా, దీపావళి సమీపిస్తున్న తరుణంలో పండగ పూటా ఇదేం గోలరా బాబూ అనుకుంటున్నారు వంటింట్లో ఆడపడుచులు.
గ్యాస్ కనెక్షన్ల తీరిలా..
జిల్లాలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ డీలర్లు సుమారు 35 మంది వరకూ ఉన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పంపిణీదారులు 12, భారత్ పెట్రోలియం పది, ఇతరులు ఐదుగురు మొత్తం 65 మంది వరకూ గ్యాస్ డీలర్లు ఉన్నారు. జిల్లాలో 25 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా ముందుగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుని, ఆ తర్వాత ప్రయారిటీ ప్రకారం బుక్ చేసుకున్న వారికి పంపిణీ చేస్తారు.
ఐవీఆర్‌ఎస్‌తో తిప్పలు
ఇటీవల అన్ని కంపెనీలు దళారులకు చెక్ పెట్టేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సర్వీసులకు ఓ నంబరు ఉంటుంది. వినియోగదారులు దానికి ఫోన్ చేసి, తమ గ్యాస్ కనెక్షన్ నంబరు ఫోన్ కీ ప్యాడ్‌పై టైపు చేస్తే రిక్వెస్ట్ బుక్ అవుతుంది. అందులో ఎన్నాళ్లకు సిలిండర్ ఇస్తారనే సమాచారం సరిగ్గా లభించడం లేదు. మళ్లీ డయల్ చేసి ఆప్షన్ల ద్వారా బుకింగ్ స్థితి తెలుసుకుందామంటే.. బుక్ చేసిన తేదీ మాత్రం తెలుస్తోంది. గ్యాస్ డీలర్‌ను సంప్రదిస్తే.. ఆన్‌లైన్‌లో రావాలని, కనీసం పది రోజులు పడుతుందని చెబుతున్నారు. కానీ 15 రోజులు దాటితే కానీ గ్యాస్ బోయ్ తలుపు త ట్టడం లేదు.