సాక్షి,సిటీబ్యూరో : నగరంలోని ముషీరాబాద్ నివాసం ఉండే శ్రీనివాస్‌కు సికింద్రాబాద్‌లోని ఒక గ్యాస్ ఏజెన్సీలో ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గత పదేళ్లుగా రీఫిల్ బుక్ చేయగానే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ద్వారా డోర్ డెలివరీ జరుగుతూ వస్తోంది. గత ఏడాది క్రితం శ్రీనివాస్ కుటుంబం ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు నివాసం మారింది. అడ్రస్ మార్పు చేసుకునేందుకు వీలు పడక ఎప్పటి మాదిరిగా రీఫిల్ బుక్ చేసుకొని పాత అడ్రస్‌కు డెలివరీ జరిగిన సిలిండర్‌ను తీసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రక్రియ కొంత ఇబ్బంది కరంగా ఉండటంతో కొత్త అడ్రస్‌కు గ్యాస్ కనెక్షన్ మార్చుకోవాలని భావించారు. సికింద్రాబాద్‌లోని గ్యాస్ ఏజెన్సీకి అడ్రస్ మార్పు కోసం సంప్రదించారు. అక్కడ కంప్యూటర్‌లో పరిశీలించి మీ కనెక్షన్ ఇక్కడ లేదని... ముషీరాబాద్ లోని ఏజెన్సీకి మార్పు చేశామని చెప్పారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఇతర ఏజెన్సీకి ఏలా మార్చుతారని నిలదీస్తే.. తమకు సంబంధం లేదని ఆయిల్ కంపెనీ అడ్రస్ ఆధారంగా కనెక్షన్ బదిలీ చేసిందని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నివాసానికి సికింద్రాబాద్ ఏజెన్సీ దగ్గర ని పేర్కొనగా, ముషీరాబాద్ ఏజెన్సీకి వెళ్లి అడ్రస్ బదిలీ చేసుకోవాలన్నారు. గత్యంతరం లేక గ్యాస్ కనెక్షన్ కాగితాలు, చిరునామా గుర్తింపు తదితరాలు తీసుకొని వెళ్లి ముషీరాబాద్ ఏజెన్సీ నుంచి తిరిగి సికింద్రాబాద్ ఏజెన్సీకి అడ్రస్ మార్పు కోవడంతో కనెక్షన్ (వినియోగదారుడి) నెంబర్ కాస్త మారింది. ఇదీ ఒక శ్రీనివాస్ ఎదుర్కొన సమస్య కాదు... నగరంలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారుల సమస్య.
వినియోగదారులతో చెలగాటం
గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులతో ఆయిల్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. వినియోగదారులకు కనీసం సమాచారం లేకుండానే ఏజెన్సీలను మార్చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. తిరిగి కనెక్షన్లను బదిలీ కోసం నానా తిప్పలు పడాల్సిన వస్తోంది. అడ్రస్ మార్పు కాస్త ఏళ్ల తరబడి ఉన్న గ్యాస్ కనెక్షన్ నంబర్ పై ప్రభావం చూపుతోంది. వాస్తవంగా నగరంలో సొంత నివాసాల కంటే అద్దె గృహాల్లో ఉంటున్న గ్యాస్ వినియోగదారుల సంఖ్య అధికంగా ఉంటుంది. అద్దె పెంపు తదితర కారణాలతో రెండేళ్లు... మూడేళ్లకు ఒక సారి నివాసాలను మార్చుతుంటారు. ప్రతి సారి గ్యాస్ కనెక్షన్ల అడ్రస్ మార్పిడి చేయకుండా పాత అడ్రస్ లేదా డెలివరీ బాయ్స్‌తో పరిచయాలతో రీఫిల్ తీసుకుంటుండం సర్వసాధారణంగా మారింది. ఆయితే ఆయిల్ కంపెనీలు మాత్రం అడ్రస్ ఆధారంగా గ్యాస్ కనెక్షన్లను సమీప ఏజెన్సీలకు బదిలీ చేస్తుండటం వినియోగదారులకు శాపంగా తయారైంది.
40 వేల కనెక్షన్లు దాటితే....
నగరంలోని గ్యాస్ ఏజెన్సీలకు 40 వేల కనెక్షన్ల వరకు పరిమితి ఉంది. ఆ సంఖ్య దాటితే ఆయిల్ కంపెనీలు మాస్ క్యాంపియన్‌లో అడ్రస్ ఆధారంగా కొన్ని కనెక్షన్లను సంబంధిత ఏరియాలకు బదిలీచేసి చేస్తుంటాయి. ఒక ఏజెన్సీకి కేవలం 24 వేల రీఫిల్ సామర్థ్యం వరకు పరిమితం మాత్రమే ఉండటంతో 40 వేల కనెక్షన్లు దాటకుండా ఎప్పటి కప్పుడు సంబంధిత ఆయిల్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. ఒక ఏజెన్సీపై అదనపు భారం లేకపోవడంతోపాటు సేవలందించేందుకు మరింత వెసులుబాటు కోసం వినియోగదారులకు దగ్గర లోకి కనెక్షన్ బదిలీ చేస్తోంది. ఆయిల్ కంపెనీల నిబంధన ప్రకారం ఒక ఏజెన్సీ నుంచి మరొక ఏజెన్సీకి కనెక్షన్ బదిలీ జరిగినప్పుడు సదరు వినియోగదారులకు సెల్‌ఫోన్ ద్వారా సమచారం అందించాల్సి ఉంటుంది. గ్యాస్ బుకింగ్ సమయంలో సైతం ఏజెన్సీ మారిందన్న సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, ఇదేమి లేకుండానే ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారం ఏజెన్సీలను మార్చి వినియోగదారులకు తిప్పలకు గురిచేస్తోంది.
కనెక్షన్లు ఇలా..
మహా నగర పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 డిస్ట్రిబ్యూటర్లకు పైగా ఉన్నారు. వారి పరిధిలో సుమారు 28.21లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు డిమాండ్‌ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు రీఫిల్ స్టాక్ సరఫరా అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అన్‌లైన్ బుకింగ్‌ను బట్టి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తుంటారు. ప్రధానంగా ఐఓసీ కి సంబందించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు,హెచ్‌పీసిఎల్‌కు సంబధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నాయి.
పరిమితికి మించి ఉంటే కనెక్షన్ల బదిలీ
గ్యాస్ ఏజెన్సీలకు కనెక్షన్లు, రీఫిల్‌పై పరిమితి ఉంటుంది. పరిమితికి మించితే ఆయిల్ కంపెనీలు వినియోగదారుడి ఆడ్రస్ ఆధారంగా సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలకు కనెక్షన్లను బదిలీ చేస్తారు. బదిలీ జరిగిన సమయంలో వినియోగదారుల సెల్‌ఫోన్‌లకు తప్పని సరిగా సమాచారం వస్తుంది. కేవలం ఏజెన్సీలపై అదనపు భారం లేకుండా వినియోగదారులకు మరింత వెసులు బాటు కల్పించేందుకు ఎల్పీజీ కనెక్షన్ల బదిలీ ప్రక్రియ. – అశోక్ కుమార్, అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ గ్యాస్ డీలర్ల సంఘం.
Comments
Please login to add a commentAdd a comment