అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకంతో వంట గ్యాస్ వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. సబ్సిడీ జమ కాక పూర్తి ధర చెల్లించి గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేసి కళ్లు తేలేస్తున్నారు. పొద్దున లేస్తూనే పనులన్నీ పక్కన పెట్టి గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కొంత మందికి ఒక సిలిండర్‌కు సబ్సిడీ జమ అయితే మూడు సిలిండర్లకు పడలేదు. మరి కొంత మందికి గ్యాస్ ఏజెన్సీలో, బ్యాంక్‌లో ఆధార్ నంబర్‌తో సీడింగ్ అయి ఆరు సిలిండర్‌లు తీసుకున్నా రూపాయి సబ్సిడీ కూడా జమ కాలేదు.
సీడింగ్‌కు నోచుకోని లక్ష మంది వినియోగదారులు
జిల్లాలో 60 ఏజెన్సీల పరిధిలో 5,88,205 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ఇప్పటిదాకా 5,24,545 మంది వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల్లో సీడింగ్ అయ్యాయి. 4.80 లక్షల మందికి బ్యాంక్‌లో అనుసంధానం పూర్తి చేశారు. ఏజెన్సీల్లో 63,660, బ్యాంకుల్లో 1.08 లక్షల మందికి సంబంధించి ఆధార్ సీడింగ్ కాలేదు. చాలా మంది వినియోగదారులు ఐదారు సార్లు ఏజెన్సీలు, బ్యాంక్‌ల చుట్టూ తిరిగి బ్యాంక్, ఆధార్, గ్యాస్ జిరాక్స్ పుస్తకాలు అందజేసినా సీడింగ్ చేయలేదు. ఇదిలా ఉండగా వినియోగదారులు అనుసంధానం చేసేందుకు బ్యాంకుల్లో, ఏజెన్సీలో జిరాక్స్ పత్రాలు అందజేసినా పక్కన పడేస్తున్నారు. వినియోగదారులు సంబంధిత పత్రాలు ఇచ్చినట్లు అటు ఏజెన్సీలు గానీ, బ్యాంకులు గానీ ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. దీంతో అనేక సార్లు అందజేసినా సీడింగ్ చేయలేదని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
రూ.52 కోట్ల మేర వినియోగదారుల జేబులకు చిల్లు
జిల్లాలో నెలకు 2.5 లక్షల సిలిండర్లు రీఫిల్ అవుతున్నాయి. జూన్ నుంచి ఇప్పటికి 17.5 లక్షల మందికి సిలిండర్లు డెలివరీ ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 లక్షల మంది వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వారికి సబ్సిడీ అందలేదు. ఈ ప్రకారం 7.50 లక్షల మందికి రూ.48 కోట్లు, ఆధార్ కార్డులు లేక సీడింగ్ చేయించుకోలేకపోయిన 60 వేల మందికి రూ.4 కోట్లు మొత్తం రూ.52 కోట్ల మేర నగదు బదిలీ కింద సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లోకి జమ కాలేదు. ఇంత పెద్ద సమస్యను జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
గ్యాస్‌ట్రబుల్
Published Fri, Jan 10 2014 2:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement