పామాయిల్ నిల్
సాక్షి, అనంతపురం : సంక్రాంతి పండుగంటేనే పిండి వంటల హడావుడి. అయితే... పేద, మధ్య తరగతి కుటుంబీకులు ఈ సారి పండుగంటేనే భయపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాటు పిండి వంటలకు అవసరమైన పామాయిల్ చౌక దుకాణాల నుంచి అందే అవకాశం లేకుండా పోయింది. గతంలో పర్వదినాలకు ప్రభుత్వం చక్కెర, కందిపప్పు, గోధుమలు కాస్త ఎక్కువగా ఇచ్చేది. ఈసారి అలా ఇవ్వడం లేదు. దీంతో పండుగ ఖర్చు తలకు మించిన భారం అవుతోందని సామాన్యులు వాపోతున్నారు.
జిల్లాలో 11 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. అత్యధికులు ఇతర నిత్యావసర సరుకులతో పాటు పామాయిల్ కూడా కొనుగోలు చేస్తున్నారు. రెండు నెలలుగా చౌక దుకాణాలకు పామాయిల్ సరిగా సరఫరా కావడం లేదు. పామాయిల్‌ను ప్రభుత్వం మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అక్కడి నుంచి ఒక్కసారిగా దిగుమతి నిలిచిపోవడంతో పౌరసరఫరాల శాఖ చౌక దుకాణాలకు సరఫరా ఆపేసింది. జిల్లాకు ఇప్పటి వరకు రెండు లక్షల పామాయిల్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. ఇవి కూడా చౌక దుకాణాలకు చేరలేదు. ఫలితంగా కార్డుదారులకు సంక్రాంతికి పామాయిల్ అందకుండా పోతోంది.
బహిరంగ మార్కెట్‌లో పామాయిల్ లీటర్ ప్యాకెట్ ధర రూ.58 నుంచి రూ.60 వరకు ఉంది. అదే చౌక దుకాణాల ద్వారా రూ.40తోనే సరఫరా చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో లీటర్‌పై రూ.20 చొప్పున అదనపు భారం పడుతోంది. ఇలా 11 లక్షల కార్డులకు లెక్కిస్తే రూ.2.20 కోట్లు అదనపు భారం పడనుంది. గతంలో పౌరసరఫరాల శాఖ పండుగల సమయంలో చ క్కెర, గోధుమలు, కందిపప్పు అదనపు కోటాగా పంపిణీ చేసేది. ఈ సారి ఆ ఊసేలేదు. దీని కారణంగానూ మరో రూ.5 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది.
‘గ్యాస్’ బాదుడు
నూతన సంవత్సర సంబరాలు పూర్తి కాకుండానే ప్రభుత్వం సామాన్యులపై గ్యాస్ బాంబు విసిరింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై రూ.10, సబ్సిడీ లేని సిలిండర్‌పై రూ.215, వాణిజ్య సిలిండర్‌పై రూ.387 చొప్పున భారం మోపింది. సబ్సిడీ సిలిండర్లను తొమ్మిదికే పరిమితం చేయడంతో ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలకు కోటా ఎప్పుడో పూర్తయింది. అలా కుటుంబాలు పూర్తి మొత్తాన్ని వెచ్చించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తోంది.
దిగుమతి లేకనే...
పామాయిల్ మలేషియా నుంచి రావాల్సి ఉంది. అక్కడి నుంచి దిగుమతి ఆలస్యం కావడంతోనే జిల్లాకు ఆలస్యంగా సరఫరా అవుతోంది. మలేషియా నుంచి అరకొరగా వస్తున్న పామాయిల్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒకే సారి సరఫరా చేస్తున్నారు. దీనివల్ల మరింత ఆలస్యమవుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-వెంకటేశం, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, అనంతపురం