సాక్షి, అనంతపురం : సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను సైతం జిల్లా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ‘ఆధార్’ లేదన్న సాకుతో ప్రజలకు వంటగ్యాస్ సబ్సిడీని నిరాకరించరాదని కోర్టు ఇచ్చిన తీర్పు జిల్లాలో అమలు కావడం లేదు. ఇప్పటికీ అధికారులు వంట గ్యాస్ సబ్సిడీకి, ఆధార్ సీడింగ్‌కు ముడిపెడుతూనే ఉన్నారు. సీడింగ్ (ఆధార్ సంఖ్యను గ్యాస్, బ్యాంకు ఖాతా వివరాలతో అనుసంధానించడం) చేయించుకుంటేనే సబ్సిడీ వస్తుందని తేల్చి చెబుతున్నారు. సీడింగ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి అనంతపురం హౌసింగ్ బోర్డులో కంప్లయింట్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. అధికారుల తీరు వల్ల ఆధార్‌లేని, సీడింగ్ కాని 1,21,142 మంది వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. వీరు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే పూర్తి మొత్తం (రూ.1110) చెల్లించాల్సి వస్తోంది.
వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలుకు సంబంధించి మొదటి విడతలోనే అనంతపురం జిల్లాను ఎంపిక చేశారు. ఇది ఒక రకంగా వినియోగదారులకు శాపంగా మారింది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో నగదు బదిలీ అమలు చేస్తున్నా... పారదర్శకత మాత్రం లోపించింది. పొరుగునే ఉన్న వైఎస్సార్ జిల్లాలో నగదు బదిలీ అమలు ఇంకో రకంగా ఉంది. అక్కడ ఆధార్ అందజేసిన వారికంటే ఇవ్వని వారే సంతోషంగా ఉన్నారు. ఆధార్ సమర్పించని వినియోగదారులకు పాత పద్ధతిలో రూ.473లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. సీడింగ్ పూర్తయిన వారి నుంచి మాత్రం రూ.1,110 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
రాయితీ కోసం వారు ఎదురు చూడాల్సి వస్తోంది. అనంతపురం జిల్లాలో ఆధార్ అందజేసిన, అందజేయని వారి పరిస్థితి ఒకే రకంగా ఉంటోంది. ఇక్కడ నగదు బదిలీని ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి వర్తింపజేస్తున్నారు. ఇప్పటికీ సీడింగ్ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. జిల్లాలో 5,78,470 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 5,10,916 కనెక్షన్లకు సంబంధించి వినియోగదారులు ఆధార్ వివరాలను గ్యాస్ డీలర్లకు అందజేశారు. ఈ నెల ఒకటి నాటికి 4,57,528 కనెక్షన్లకు సీడింగ్ పూర్తయింది. వీరికి కూడా రాయితీ మొత్తం సక్రమంగా జమ కావడం లేదు. ఈ సమస్యపై రోజూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1110 ఉంది.
సీడింగ్ సక్రమంగా జరిగి ఉంటే అలాంటి వారికి రూ.638.77 రాయితీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. లేకుంటే పూర్తి మొత్తం చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో ఇంకా దాదాపు 67 వేల మందికి ఆధార్ లే దు. మరో 53,388 మందికి ఉన్నా సీడింగ్ పూర్తి కాలేదు. దీనివల్ల వారు రాయితీకి దూరమవుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు అమలైతే వీరందరికీ న్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ) శాంతకుమారి దృష్టికి తీసుకెళ్లగా... సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి తమకు పై నుంచి ఎటువంటి ఉత్తర్వులూ అందలేదని చెప్పారు.
వారి దారి...ఆధారే!
Published Wed, Dec 11 2013 4:06 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement