సాక్షి, అనంతపురం : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతిని వెలికి తీసి.. అర్హులకే బిల్లులు మంజూరు చేసే విధంగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా జియో ట్యాగింగ్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 2005-06 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు.. అంటే గడిచిన పదేళ్లలో ఇందిరమ్మ పథకంతో పాటు ‘రచ్చబండ’లో జిల్లాకు 4,07,779 ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాల్లో చాలా వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం లోటు బడ్జెట్‌తో పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. వాటి నుంచి గట్టెక్కేందుకు సంక్షేమ పథకాల్లో లొసుగులను వెతికి పట్టుకుంటూ నిబంధనలు కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ పథకాల్లోనూ అక్రమాల వెలికితీతకు సిద్ధమవుతోంది.
జూలై 31న హైదరాబాద్‌లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన హౌసింగ్ పీడీల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ‘జియో ట్యాగింగ్’ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా నిజమైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ విధానాన్ని అమలులోకి తేవడానికి చర్యలు ప్రారంభించారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లలో పూర్తయినట్లు చెబుతున్న 1,90,510 ఇళ్లలో చాలా వరకు దొంగ బిల్లులు చేసినట్లు విమర్శలున్నాయి. కొన్ని చోట్ల హౌసింగ్ అధికారులే నిధుల్ని కాజేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఇంతకు ముందున్న ఇళ్లను చూపి బిల్లులు పొందడం, ఇంటి పేరుతో ప్రహరీలు, పశువుల శాలలు, అతిథి గృహాలు, అంతస్తులు నిర్మించుకోవడం, పాత ఇంటికి మరమ్మతులు చేయించుకోవడం వంటి అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ఆధారాలను కూడా సేకరించింది. బోగస్ రేషన్ కార్డులతో కూడా అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది. జిల్లాలో దాదాపు ఐదు వేల ఇళ్లు బోగస్‌గా గుర్తించింది. ఇకపై ఇలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ‘జియో ట్యాగింగ్’ విధానం ద్వారా గృహ నిర్మాణాలను పర్యవేక్షించనున్నారు.
జియో ట్యాగింగ్ అంటే...
భూమిపై నిర్ధిష్టంగా ఒక ప్రాంతాన్ని గుర్తించటాన్ని ‘జియో ట్యాగింగ్’ అంటారు. ప్రతి ప్రదేశానికి నిర్ధిష్టమైన అక్షాంశం, రేఖాంశం ఉంటాయి. గృహ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయగానే వాటి అక్షాంశం, రేఖాంశం నమోదయ్యేలా ఫొటోలు తీస్తారు. వీటికి, దశల వారీగా పూర్తి చేసిన నిర్మాణాలకు అక్షాంశాలు, రేఖాంశాలు సరిపోలితేనే బిల్లులు మంజూరు చేస్తారు. లేదంటే బోగస్‌గా నిర్ధారిస్తారు. హౌసింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫొటోలు తీసి సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తారు.
అలాగే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను ఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేకాధికారి, ఈఈల ఆధ్వర్యంలో తనిఖీ చేస్తారు. ఎంతమంది అర్హులుగా ఉన్నారు..ఎంత మంది లేరన్న వివరాలను సేకరించి సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తారు. ఇంతకు ముందు లబ్ధిదారులు గృహ నిర్మాణాల వద్ద వివిధ దశలకు సంబంధించి ఫొటోలు దిగి బిల్లులు పొందేవారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. జియో ట్యాగింగ్ విధానంలో భాగంగా ఇంటి నిర్మాణంలో ప్రతి దశను ఫొటోలు తీసి సెంట్రల్ సర్వర్‌కు పంపుతారు. ఆ ఫొటోలు అవే ఇంటివని తేలాక బిల్లులు చెల్లిస్తారు.
అక్రమాలు నిగ్గు తేల్చేందుకే...
ఇందిరమ్మ పథకంలో దాదాపు ఐదు వేల ఇళ్లను నకిలీ రేషన్‌కార్డులతో కాజేసినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు రూ.30 కోట్ల అవినీతి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జియో ట్యాగింగ్ విధానం ద్వారా అక్రమాలు వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కొద్దిరోజుల్లోనే విచారణ ప్రారంభం కానుంది. విచారణకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లపై నిఘా
Published Wed, Aug 6 2014 2:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement