యూపీఏ ప్రజల విశ్వాసం కోల్పోయింది | Congress has lost the public's confidence | Sakshi
Sakshi News home page

యూపీఏ ప్రజల విశ్వాసం కోల్పోయింది

Published Fri, Mar 28 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

Congress has lost the public's confidence

దేవీచౌక్ (రాజమండ్రి), న్యూస్‌లైన్ : యూపీఏ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, అన్ని రంగాల్లోను దేశాన్ని అథోగతి పాలుచేసిందని కేంద్ర మాజీ మంత్రి, సీమాంధ్ర బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ‘ప్రధానిగా మోడీ-సీమాంధ్రలో అభివృద్ధికై బీజేపీ’ నినాదంతో స్థానిక జాంపేట శ్రీఉమారామలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో గురువారం జరిగిన సీమాంధ్ర ఎన్నికల ప్రచార యాత్ర సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు.
 
దేశ పురోభివృద్ధి రేటు 8 శాతం నుంచి 5 శాతానికి యూపీఏ పాలనలో దిగజారిందన్నారు. యువకులు ఉద్యోగావకాశాలు లేక అసంతృప్తితో ఉన్నారన్నారు. యూపీఏ పాలనలో మహిళలు నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు నిరాశలో ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిందని పురంధేశ్వరి అన్నారు. రాజ్యసభలో బీజేపీ ఒత్తిడి వలనే ప్రధాని మన్మోహన్‌సింగ్ సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడానికి, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో విలీనం చేయడానికి అంగీకరించారన్నారు.
 
యూపీఏకు తెలుగువాడు గుణపాఠం చెప్పవలసిన తరుణం ఆసన్నమయిందన్నారు. మాజీ మంత్రి కృష్ణంరాజు మాట్లాడుతూ సీమాంధ్రను సింగపూర్ చేస్తామని కొందరు చెబుతున్నారని, కానీ నరేంద్రమోడీ గుజరాత్‌లో మారుమూల పల్లెసీమల్లో కూడా విద్యుత్ కోతలు లేకుండా చేశారన్నారు. 60 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించలేని ప్రగతిని 60 నెలల్లో మోడీ సాధించగలరని కృష్ణంరాజు అన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
 
పార్టీ సీమాంధ్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక, దేశాన్ని ఒకే ఫుడ్ జోన్‌గా ప్రకటిస్తుందన్నారు. పోలవరం డిజైన్‌ను రూపొందించవలసింది సాంకేతిక నిఫుణులేకానీ కేసీఆర్ కాదన్నారు. దున్నపోతుకు గడ్డివేసి, గేదెను పాలిమ్మంటే ఇవ్వదు, మిగతా పార్టీలకు ఓటు వేయడం వలన మోడీ అభివృద్ధి ఫలాలు మనకు అందవన్నారు.
 
జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు, రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు క్షత్రియ బాల సుబ్రహ్మణ్యం సింగ్,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, సూర్యనారాయణరాజు, పొట్లూరి రామ్మోహనరావు, గరిమెళ్ల చిట్టిబాబు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత ఏసీవై రెడ్డి అన్న కుమార్తె, మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి తదితరులు బీజేపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement