బీజేపీ పవర్‌ ప్లే..ఎలా పట్టు సాధించింది ? | BJP power play..in all over india | Sakshi
Sakshi News home page

బీజేపీ పవర్‌ ప్లే..ఎలా పట్టు సాధించింది ?

Published Sat, Mar 4 2023 5:13 AM | Last Updated on Sat, Mar 4 2023 9:04 AM

BJP power play..in all over india - Sakshi

భారతీయ జనతా పార్టీ దేశాన్ని చుట్టేస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ఇమేజ్‌ని పెట్టుబడిగా పెట్టి, డబుల్‌ ఇంజిన్‌ నినాదంతో రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు కమలం దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభివృద్ధి, శాంతి స్థాపన లక్ష్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల్ని ఎదుర్కొని, అధికార వ్యతిరేకతను ఎదురొడ్డి త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా ఒకప్పటి మిత్రపక్షం కాన్రాడ్‌ సంగ్మాకు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడం ద్వారా 2024లో జరగనున్న లోక్‌ సభ ఎన్నికలకు బలమైన పునాదులు వేసుకుంటోంది.

ఎలా పట్టు సాధించింది ?  
ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, త్రిపురలో హిందూ జనాభా ఎక్కువ. మిగి లిన రాష్ట్రాల్లో గిరిజనులు, క్రిస్టియన్లదే పట్టు. ఆయా రాష్ట్రాల్లో అత్యధికులు బీఫ్‌ తింటారు. ఇంగ్లిష్‌ మాట్లాడతారు. దీంతో ఇతర పార్టీలు బీజేపీ హిందూత్వ, హిందీ ఎజెండాను పదే పదే ఎత్తి చూపుతూ కాషాయ దళాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. అయినప్పటికీ ఈశాన్యంలో కాషాయ జెండా రెపరెపలాడింది. త్రిపుర లో శాంతి స్థాపన, అభివృద్ధికే బీజేపీ మొదట నుంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. మౌలిక సదుపాయాలు, హైవేల నిర్మాణం, సురక్షిత మంచి నీరు, ఉచిత రేషన్‌ , విద్యుత్‌ సౌకర్యం వంటివన్నీ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణాలే.

ఎన్నికలకు కాస్త ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 12% డీఏ ప్రకటించి వారిని తమ వైపు తిప్పుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో నాగాలాండ్‌లో కూడా శాంతి చర్చలు చేసి వారి సమస్య పరిష్కారానికి హా మీలు ఇచ్చింది. ఎన్‌డీపీపీతో పొత్తుతో అధికారా న్ని మళ్లీ నిలబెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం మేఘాలయ బీజేపీ చీఫ్‌ ఎర్నెస్ట్‌ మావ్రీ బీఫ్‌ తినడం రాష్ట్ర ప్రజల జీవనశైలిలో ఒక భాగమంటూ వ్యాఖ్యానించి ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్‌ తినడాన్ని బీజేపీ అడ్డుకోదన్న సందేశాన్ని ఇచ్చారు. మైనార్టీ వ్యతిరేక పార్టీ అని విపక్షాలు ప్రచారం చేసినప్పటికీ నాగాలాండ్‌లో 15% నుంచి 19 శాతానికి ఓటు షేర్‌ను పెంచుకోగలిగింది. మేఘాలయలో 9% ఓట్లను రాబట్టింది.   

నాగాలో శాంతి మంత్రం..  
నాగాలాండ్‌లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం చేస్తున్న నాగాలతో శాంతి చర్చలు జరుపుతూ వారి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంలో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) పరిమితమైన సీట్లలో పోటీ చేశాయి. 60 అసెంబ్లీ స్థానాల్లో ఎన్‌పీఎఫ్‌ 22 స్థానాల్లో పోటీ చేస్తే, కాంగ్రెస్‌ 23 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. నాగా సమస్యని ఎన్‌డీపీపీతో కలిసి సమష్టిగా పరిష్కరిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు తిరిగి ఆ కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేలా చేశాయి.  

పక్కా వ్యూహంతో సీఎంల మార్పు
అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల జరగడానికి ఏడాది ముందు ముఖ్యమంత్రుల్ని హఠాత్తుగా మార్చి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో బీజేపీ విజయం సాధిస్తోంది. త్రిపురలో కాంగ్రెస్‌–లెఫ్ట్‌ కూటమి, తిప్రా మోథాలను దీటుగా ఎదుర్కొని అధికార వ్యతిరేకతను ఎదు రొడ్డడానికి ముఖ్య కారణం నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న విప్లవ్‌దేవ్‌ను పది నెలల క్రితం మార్చడమే. ఆయన స్థానంలో మిస్టర్‌ క్లీన్‌గా పేరున్న మాణిక్‌ సాహాను సీఎంను చేయడంతో అధికార వ్యతిరేకత తుడిచిపెట్టుకుపోయింది.

గతంలో ఉత్తరాఖండ్‌లో ఇద్దరు సీఎంలను, గుజరాత్‌లో సీఎంను మార్చి నెగ్గింది. హిమాచల్‌లోనూ సీఎంను మార్చాలని ఎన్నో గళాలు వినిపించినా జైరామ్‌ ఠాకూర్‌నే కొనసాగించి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది. చిన్న నియోజకవర్గాలున్న త్రిపురలో అభివృద్ధిని చేసి చూపించడంతో పాటు సీఎంను మార్చడం కూడా బీజేపీకి కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం కూడా  ఒక కారణం.

అసోం నుంచి త్రిపుర వరకు  
► 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్‌ 15 ఏళ్ల పరిపాలనకు తెర దించింది.  
► 2017లో మణిపూర్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ మాజీ సభ్యుడు ఎన్‌. బైరాన్‌ సింగ్‌ ముఖ్యమంత్రి అయ్యారు.  
► 2018లో త్రిపుర ఎన్నికల్లో బీజేపీ 25ఏళ్ల లెఫ్ట్‌ పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చింది
► అదే ఏడాది బీజేపీ మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది.  
► 2019లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలను కైవశం చేసుకొని విజయ ఢంకా మోగించింది.  
► 2021లో అసోంలో మళ్లీ అధికారాన్ని కాపాడుకుంది.
► 2022లో బీజేపీ మణిపూర్‌లో కూడా తిరిగి అధికారంలోకి వచ్చింది.  
► 2023లో త్రిపుర, నాగాలాండ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా అధికారంలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.  


వాజ్‌పేయి హయాంలోనే అభివృద్ధికి బీజం  
► 2016లో అసోంతో మొదలైన బీజేపీ జైత్రయాత్ర 2023 వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం వాజ్‌పేయి హయాంలో తొలి బీజం పడింది. కేంద్రంలో మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్టులకు రూప కల్పన చేశారు. అప్పుడు మొదలైన అభివృద్ధి పథం 2014లో నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయ్యాక పరుగులు తీసింది. అభివృద్ధి కంటికి కనిపించేలా సాగింది.ప్రజల్లో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్‌ నాయకుడు హిమాంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళానికి పట్టు పెరిగింది.

ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రి అయిన శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన నార్త్‌ ఈస్ట్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌(ఎన్‌డీపీఏ)తో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ జత కట్టాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే బిశ్వ శర్మ మూడు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ తమకు అనుకూలంగా ఉండే చిన్న పార్టీలను ఎన్‌డీపీఏ గూటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. డబుల్‌ ఇంజిన్‌ నినాదంతో బీజేపీ తనకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతూ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కొల్లగొడుతూ వచ్చింది. ఎన్‌. బైరాన్‌ సింగ్, ప్రేమ ఖాండూ వంటి నాయకులు కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీ ఉనికి కూడా కోల్పోసాగింది. ఎన్‌డీపీఏ కంటే ముందే ఆరెస్సెస్‌ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తండాల్లో పని చేస్తూ  పట్టు పెంచుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది.    –

సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement