నల్ల కుబేరుల్లో యూపీఏ మంత్రి!
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలు అన్ని వివరాలు కోర్టుకు సమర్పిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ వారికే ఇబ్బందంటూ మంగళవారం వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. విదేశీ బ్యాంకుల్లో భారీ ఎత్తున బ్లాక్‌మనీ దాచిన నల్ల కుబేరుల జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి పేరు ఉందంటూ బుధవారం సంకేతాలిచ్చి సంచలనం సృష్టించారు. సరైన సమయంలో ఆ వివరాలు బహిర్గతమవుతాయంటూ పలు జాతీ య చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.
మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలోని ఒక మంత్రి ఆ జాబితాలో ఉన్నారన్న వార్తను మీరు ఖండిస్తారా? అన్న ప్రశ్నకు జైట్లీ జవాబిస్తూ.. ‘నేనా వార్తను ఖండించను. వాస్తవమని చెప్పను. నేను నవ్వుతున్నానంతే’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దగ్గరున్న నల్ల కుబేరుల వివరాలను ఇప్పుడు వెల్లడించలేనని, అలా వెల్లడిస్తే.. అది ఆయా దేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందాల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరించారు. విదేశీ ప్రభుత్వాలు తమకు అందించిన బ్లాక్‌మనీ అకౌంట్‌దారుల వివరాలున్న సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందజేస్తామని, అనంతరం ఆ వివరాలు సహజంగానే బహిర్గతమవుతాయని తెలిపారు.
‘ప్రభుత్వం దగ్గరున్న నల్ల కుబేరుల జాబితాలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పలుకుబడి కలిగిన నేత పేరుందా?’ అన్న ప్రశ్నకు ‘ఎవరిపైన అయినా సరే.. అభియోగాలను రుజువు చేయగలిగే సమాచారం మా వద్ద ఉంటే ఆ సమాచారాన్ని కోర్టుకు అందజేస్తామని’ అన్నారు. వైరుధ్యాలకు అతీతంగా పార్టీలు సహకరించుకునే పద్ధతిలో భాగంగా.. కాంగ్రెస్ వారి పేర్లను వెల్లడించడం లేదా? అన్న ప్రశ్నకు.. ‘అది తప్పు. నా ప్రత్యర్థి పేరు అందు లో ఉంటే.. దాన్ని వెల్లడించేందుకు మరింత ఉత్సాహపడతా’ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ హర్యానాలో జరిపిన భూ లావాదేవీల వివాదంలోఆ రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై సోనియాగాంధీ, రాహుల్‌లు చాలా ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉందన్నారు.
‘బెదిరింపులు మానండి’
నల్లధనం వివరాల వెల్లడి విషయంలో లీకేజీలతో బ్లాక్‌మెయిలింగ్ చేయడం మానేసి ధైర్యముంటే పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలని మోదీ సర్కారుకు కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. విదేశీ ఖాతాదారుల వివరాలు వెల్లడిస్తే కాంగ్రెస్ ఇరుకునపడటం ఖాయమన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. లీకేజీలు, అసమగ్ర వివరాలతో బెదిరింపులకు పాల్పడటాన్ని ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అజయ్ మాకెన్ హితవు పలికారు.
‘మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేరు. ఆ ప్రయత్నం చేయకండి. నల్లధనం కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి’ అని మాకెన్ వ్యాఖ్యానించారు. నల్లధనం వ్యవహారం నుంచి దూరంగా పారిపోవడానికి జైట్లీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మాట ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకెప్పుడు ఆ పని పూర్తి చేస్తారన్నారు. నల్లధనం అంశంపై మోదీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.
పవర్‌లో ఉన్న పదేళ్లు ఏం చేశారు?: బీజేపీ
నల్లధనం వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ సమాధానమిచ్చింది. ఈ విషయంలో బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, అధికారంలో ఉన్న గత పదేళ్ల కాలంలో విదేశాల నుంచి నల్ల ధనాన్ని తిరిగి తెప్పించేందుకు ఆ పార్టీ ఏం చేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ సూటిగా ప్రశ్నించారు.