
పేర్లు తీసేయాలని ఒత్తిడి చేశారు
కోల్‌గేట్, కామన్వెల్త్ గేమ్స్ ఆడిట్ నివేదికల్లో కొన్ని పేర్లు తొలగించమన్నారు
యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్‌పై మాజీ కాగ్ వినోద్ రాయ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మరో మాజీ ఉన్నతాధికారి గళమెత్తారు. కోల్‌గేట్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం ఆడిట్ రిపోర్టుల నుంచి కొన్ని పేర్లు తొలగించాలని అప్పటి రాజకీయ నేతలతో తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆ పేర్లు తప్పించేలా తనను ఒప్పించడానికి తన సహచర ఐఏఎస్‌లతో కూడా ప్రయత్నించారన్నారు. ఈ విషయాలన్నీ అక్టోబర్‌లో విడుదల చేయబోయే తన పుస్తకం ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’లో వివరిస్తానని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మన్మోహన్ సింగ్, యూపీఏ ప్రభుత్వంపై ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు ఏ విధంగా నష్టం జరిగిందనే విషయాలపై పూర్తి స్థాయిలో వివరిస్తానని రాయ్ తెలిపారు. ‘‘ప్రధాని కీలకమైన వ్యక్తి. ఆయన తుది నిర్ణయం తీసుకోవాలి. మన్మోహన్ కొన్ని సార్లు తీసుకున్నారు. కొన్ని సార్లు తీసుకోలేదు. అధికారం నిలబెట్టుకోవడానికి అన్నింటినీ త్యాగం చేయకూడదు. సంకీర్ణ రాజకీయాలకోసం పాలనను బలి చేయకూడదు. అవన్నీ నేను పుస్తకంలో చెప్పాను’’ అని మాజీ ప్రధానిపై రాయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ నిష్క్రియాపరత్వంపై పీసీ పరేఖ్, సంజయ్ బారు, నట్వర్‌సింగ్ తమ పుస్తకాల్లో విమర్శించడం తెలిసిందే. అదే తరహాలో రాయ్ కూడా అప్పటి ప్రభుత్వంపై పెన్ను ఎత్తడం దుమారం రేపుతోంది. గతేడాది పదవి నుంచి నిష్ర్కమించిన రాయ్.. 2జీ, కోల్‌బ్లాక్ స్కాంలలో ప్రభుత్వం నష్టపోయిన నిధుల్ని అంచనావేశారు.
కాంగ్రెస్ మండిపాటు..
ఈ మధ్యన ఏదోటి రాస్తూ.. దాన్ని సంచలనం చేస్తూ రిటైర్మెంట్ తర్వాత పింఛను సంపాదనలా మారిన దాన్ని రాయ్ కూడా అనుసరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ మండిపడ్డారు. ఆయన చెప్పిన విషయాలపై చర్చకైనా సిద్ధమన్నారు.
మన్మోహన్ మౌనం వీడాలి..
బీజేపీ నేత విజయ్ శంకర్ శాస్త్రి మాట్లాడుతూ.. మన్మోహన్ మాట్లాడే సమయం ఆసన్నమైందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేసిందన్నారు.