Commonwealth Games scam
-
ఏకేఆర్ కన్స్ట్రక్షన్స్కు ఈడీ షాక్
న్యూఢిల్లీ: 2010 కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో అక్రమ నగదు చెలామణికి సంబంధించి హైదరాబాద్‌లోని ఏకేఆర్ కన్స్ట్రక్షన్స్కు చెందిన రూ.11.28 కోట్లను గురువారం జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. ఈ క్రీడల కోసం టైమింగ్ స్కోరింగ్ అండ్ రిజల్టింగ్(టీఎస్ఆర్) వ్యవస్థ ఏర్పాటులో అవకతవకలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. టీఎస్ఆర్ వ్యవస్థ కాంట్రాక్టు పొందేందుకు ఒలింపిక్ కమిటీ అధికారులు తొలుత స్విస్ టైమింగ్ లిమిటెడ్ సంస్థతో కుమ్మక్కయ్యారనీ, దీనివల్ల ఖజానాకు రూ.95 కోట్లు నష్టం జరిగిందని వెల్లడించింది. ఈ స్విస్ టైమింగ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా జెమ్ ఇంటర్నేషనల్ అనే మరో సంస్థకు సబ్ కాంట్రాక్టు కట్టబెట్టగా, సదరు సంస్థ ఏకేఆర్ కన్స్ట్రక్షన్స్కు మళ్లీ రూ.11.28 కోట్ల మేర సబ్ కాంట్రాక్టు ఇచ్చిందని ఈడీ పేర్కొంది. -
‘కామన్వెల్త్’లో తొలి తీర్పు
ఆరుగురు దోషులకు శిక్షలు ఖరారు చేసిన సీబీఐ కోర్టు న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల స్కాంలో తొలితీర్పు వెలువడింది. బుధవారమిక్కడి సీబీఐ న్యాయస్థానం మొత్తం ఆరుగురు దోషులకు శిక్షలు ఖరారు చేసింది. వీరిలో నలుగురు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)కి చెందిన అధికారులు కాగా, మరో ఇద్దరు స్వేకా పవర్‌టెక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీ ఉన్నత ఉద్యోగులు. నలుగురు ఎంసీడీ అధికారులు, పవర్‌టెక్ కంపెనీ డెరైక్టర్‌కు నాలుగేళ్లు, అదే కంపెనీ ఎండీకి ఆరేళ్ల కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి బ్రిజేష్ గార్గ్ తీర్పు వెలువరించారు. 2010 కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి రూ.1.4 కోట్ల వీధి దీపాల కుంభకోణంలో ఆయన ఈ శిక్షలు ఖరారు చేశారు. స్ట్రీట్లైట్ల కొనుగోలు టెండర్ ప్రక్రియలో ఎంసీడీ అధికారులు పక్షపాతం చూపి స్వేకా పవర్‌టెక్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు విచారణలో తేలింది. నాలుగేళ్ల శిక్ష పడినవారిలో ఎంసీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్ డీకే సుగాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓపీ మాహ్లా, అకౌంటెంట్ రాజు, క్లర్క్ గురుచరణ్ సింగ్, స్వేకా పవర్‌టెక్ ఇంజనీరింగ్ కంపెనీ డెరైక్టర్ జేపీ సింగ్ ఉన్నారు. స్వేకా పవర్‌టెక్ కంపెనీ ఎండీ టీపీ సింగ్‌కు కోర్టు ఆరేళ్ల శిక్ష విధించింది. వీరిపై సీబీఐ మోపిన అభియోగాలన్నీ రుజువైనట్లు జడ్జి ప్రకటించారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో నమోదైన 10 అవినీతి కేసుల్లో స్ట్రీట్‌లైట్ కుంభకోణం ఒకటి. -
పేర్లు తీసేయాలని ఒత్తిడి చేశారు
కోల్గేట్, కామన్వెల్త్ గేమ్స్ ఆడిట్ నివేదికల్లో కొన్ని పేర్లు తొలగించమన్నారు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్పై మాజీ కాగ్ వినోద్ రాయ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మరో మాజీ ఉన్నతాధికారి గళమెత్తారు. కోల్గేట్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం ఆడిట్ రిపోర్టుల నుంచి కొన్ని పేర్లు తొలగించాలని అప్పటి రాజకీయ నేతలతో తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆ పేర్లు తప్పించేలా తనను ఒప్పించడానికి తన సహచర ఐఏఎస్‌లతో కూడా ప్రయత్నించారన్నారు. ఈ విషయాలన్నీ అక్టోబర్‌లో విడుదల చేయబోయే తన పుస్తకం ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’లో వివరిస్తానని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మన్మోహన్ సింగ్, యూపీఏ ప్రభుత్వంపై ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు ఏ విధంగా నష్టం జరిగిందనే విషయాలపై పూర్తి స్థాయిలో వివరిస్తానని రాయ్ తెలిపారు. ‘‘ప్రధాని కీలకమైన వ్యక్తి. ఆయన తుది నిర్ణయం తీసుకోవాలి. మన్మోహన్ కొన్ని సార్లు తీసుకున్నారు. కొన్ని సార్లు తీసుకోలేదు. అధికారం నిలబెట్టుకోవడానికి అన్నింటినీ త్యాగం చేయకూడదు. సంకీర్ణ రాజకీయాలకోసం పాలనను బలి చేయకూడదు. అవన్నీ నేను పుస్తకంలో చెప్పాను’’ అని మాజీ ప్రధానిపై రాయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ నిష్క్రియాపరత్వంపై పీసీ పరేఖ్, సంజయ్ బారు, నట్వర్‌సింగ్ తమ పుస్తకాల్లో విమర్శించడం తెలిసిందే. అదే తరహాలో రాయ్ కూడా అప్పటి ప్రభుత్వంపై పెన్ను ఎత్తడం దుమారం రేపుతోంది. గతేడాది పదవి నుంచి నిష్ర్కమించిన రాయ్.. 2జీ, కోల్‌బ్లాక్ స్కాంలలో ప్రభుత్వం నష్టపోయిన నిధుల్ని అంచనావేశారు. కాంగ్రెస్ మండిపాటు.. ఈ మధ్యన ఏదోటి రాస్తూ.. దాన్ని సంచలనం చేస్తూ రిటైర్మెంట్ తర్వాత పింఛను సంపాదనలా మారిన దాన్ని రాయ్ కూడా అనుసరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ మండిపడ్డారు. ఆయన చెప్పిన విషయాలపై చర్చకైనా సిద్ధమన్నారు. మన్మోహన్ మౌనం వీడాలి.. బీజేపీ నేత విజయ్ శంకర్ శాస్త్రి మాట్లాడుతూ.. మన్మోహన్ మాట్లాడే సమయం ఆసన్నమైందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేసిందన్నారు. -
కాంగ్రెస్ అవినీతికి ‘ఆప్’ ప్రోత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అవినీతి, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలను పక్కనబెట్టి అనవసర విషయాలకు ప్రాధాన్యాన్ని ఇస్తోందని బీజేపీ విమర్శించింది. అసెంబ్లీలో సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ప్రసంగం నిరాశ కలిగించేలా ఉందని సభలో ప్రతిపక్షనేత డాక్టర్ హర్షవర్ధన్ ఆరోపించారు. అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం చే పట్టబోయే చర్యలపై లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదని ఆరోపించారు. కామన్వెల్త్ క్రీడల అవినీతి కుంభకోణంలో షీలాదీక్షిత్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ చేయించాలన్న డిమాండ్ గురించి ఆయన కూడా స్పందించలేదంటూ పెదవి విరించారు. ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం అరవింద్ (కేజ్రీవాల్), అర్విందర్ సింగ్ లవ్లీ మధ్య పొత్తని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సామాన్యుడు ధరల పెరుగుదలతో బాధపడుతున్నాడని, వీటి పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం చెప్పలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఆప్ ఇప్పుడు అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం, భద్రతలేమి వంటి కీలక విషయాలను నిర్లక్ష్యం చేస్తోందని హర్షవర్ధన్ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ మేనిఫెస్టోలోని హామీలనే చదివారన్నారు. వాటిని అమల్లోకి తేవడానికి ప్రభుత్వం ఏయే పథకాలను అమల్లోకి తెస్తుందో చెప్పలేదని హర్షవర్ధన్ విమర్శించారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును త్వరగా ప్రకటించకపోవడం వల్ల బీజేపీ ఢిల్లీలో చాల నష్టపోయిందని పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ సోమవారం అన్నారు. బీజేపీ ప్రవాస భారతీయుల విభాగం ‘గ్లోబల్మీట్’ పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.