
‘కామన్వెల్త్’లో తొలి తీర్పు
ఆరుగురు దోషులకు శిక్షలు ఖరారు చేసిన సీబీఐ కోర్టు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల స్కాంలో తొలితీర్పు వెలువడింది. బుధవారమిక్కడి సీబీఐ న్యాయస్థానం మొత్తం ఆరుగురు దోషులకు శిక్షలు ఖరారు చేసింది. వీరిలో నలుగురు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)కి చెందిన అధికారులు కాగా, మరో ఇద్దరు స్వేకా పవర్‌టెక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీ ఉన్నత ఉద్యోగులు. నలుగురు ఎంసీడీ అధికారులు, పవర్‌టెక్ కంపెనీ డెరైక్టర్‌కు నాలుగేళ్లు, అదే కంపెనీ ఎండీకి ఆరేళ్ల కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి బ్రిజేష్ గార్గ్ తీర్పు వెలువరించారు.
2010 కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి రూ.1.4 కోట్ల వీధి దీపాల కుంభకోణంలో ఆయన ఈ శిక్షలు ఖరారు చేశారు. స్ట్రీట్‌లైట్ల కొనుగోలు టెండర్ ప్రక్రియలో ఎంసీడీ అధికారులు పక్షపాతం చూపి స్వేకా పవర్‌టెక్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు విచారణలో తేలింది. నాలుగేళ్ల శిక్ష పడినవారిలో ఎంసీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్ డీకే సుగాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓపీ మాహ్లా, అకౌంటెంట్ రాజు, క్లర్క్ గురుచరణ్ సింగ్, స్వేకా పవర్‌టెక్ ఇంజనీరింగ్ కంపెనీ డెరైక్టర్ జేపీ సింగ్ ఉన్నారు. స్వేకా పవర్‌టెక్ కంపెనీ ఎండీ టీపీ సింగ్‌కు కోర్టు ఆరేళ్ల శిక్ష విధించింది. వీరిపై సీబీఐ మోపిన అభియోగాలన్నీ రుజువైనట్లు జడ్జి ప్రకటించారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో నమోదైన 10 అవినీతి కేసుల్లో స్ట్రీట్‌లైట్ కుంభకోణం ఒకటి.